Share News

వారధి నిరీక్షణకు మోక్షం!

ABN , Publish Date - Sep 20 , 2026 | 12:37 AM

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల మధ్య రాజుల్లంక–రామేశ్వరం వద్ద వశిష్ట గోదావరిపై నిర్మించతలపెట్టిన వంతెన నిర్మాణ టెండర్లు ఖరారయ్యాయి.

వారధి నిరీక్షణకు మోక్షం!
వారధి ఊహా చిత్రం

గుడిమెళ్లలంక నుంచి సీతారాంపురం వరకు 25 కి.మీ బైపాస్‌ నిర్మాణం

రూ.299 కోట్ల అత్యల్ప బిడ్‌తో బీఆర్‌కే ఇన్‌ఫ్రాకు పనులు

అంచనా వ్యయం రూ.400 కోట్లు.. హైవే అధికారుల ఆమోదమే తరువాయి

(నరసాపురం–ఆంధ్రజ్యోతి):

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రజల దశాబ్దాల కల ఎట్టకేలకు సాకారం కాబోతోంది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల మధ్య రాజుల్లంక–రామేశ్వరం వద్ద వశిష్ట గోదావరిపై నిర్మించతలపెట్టిన వంతెన నిర్మాణ టెండర్లు ఖరారయ్యాయి. రూ.400 కోట్ల అంచనా వ్యయంతో ఆహ్వానించిన ఈ టెండర్లలో బీఆర్‌కే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అత్యల్పంగా రూ.299 కోట్లకు బిడ్‌ దాఖలు చేసి పనులను దక్కించుకుంది. అంచనా కంటే రూ.101 కోట్లు తక్కువకు కోట్‌ చేయడంతో ఆ సంస్థ ఎల్‌–1గా నిలిచింది. నేషనల్‌ హైవేస్‌(ఎన్‌హెచ్‌) అధికారులు దీనికి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం నాలుగు కాంట్రాక్టు సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. స్కైలార్‌ ఇన్‌ఫ్రా సంస్థ రూ.334 కోట్లకు, నితిన్‌ సాయి కన్‌స్ట్రక్షన్‌ సంస్థ అంచనాకంటే ఎక్కువగా రూ.507 కోట్లకు, వల్లభనేని కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ రూ.576 కోట్లకు షెడ్యూళ్లు వేశాయి. అత్యల్పంగా బీఆర్‌కే సంస్థ రూ.299 కోట్లకు కోట్‌ చేయడంతో పనులు ఆ సంస్థకే ఖరారయ్యాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా మలికిపురం మండలం గుడిమెళ్ల లంక నుంచి నరసాపురం మండ లం సీతారాంపురం వరకు సు మారు 25 కిలోమీటర్ల మేర బైపాస్‌ రహదారిని, దాని అనుసంధా నంగా రామేశ్వరం – రాజుల్లంక వద్ద వారధిని నిర్మించనున్నారు.

నాలుగుసార్లు శంకుస్థాపనలు..

ఈ వారధి నిర్మాణం ఇప్పటి వరకు శంకుస్థాపనలకే పరిమితమవుతూ వచ్చింది. 1987లో అప్పటి సీఎం ఎన్టీ రామారావు తొలిసారిగా సఖినేటిపల్లి వద్ద ఈ వంతెనకు శంకుస్థాపన చేశారు. 2004లో చంద్రబాబు మంత్రి వర్గంలో కీలకంగా ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడు రెండు రేవుల మధ్య ఫ్లోటింగ్‌ వంతెన పనులకు శంకుస్థాపన చేశారు. 2007లో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరోసారి శంకుస్థాపన చేశారు. మైటాస్‌ సంస్థ పనులు దక్కించుకుని ప్రారంభించినప్పటికీ, సంస్థ సంక్షోభం, వైఎస్సార్‌ ఆకస్మిక మరణంతో పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పట్టణంలోని ఇసుక ర్యాంపు వద్ద వంతెన నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌ వచ్చింది. అనంతరం వచ్చిన వైసీపీ ప్రభుత్వం డిజైన్‌ మార్చి రాజుల్లంక వద్దకు మార్చింది. నాలుగోసారి అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ దీనికి శంకుస్థాపన చేశారు. సుదీర్ఘ కాలంగా ప్రతిపాదనలు, శంకుస్థాపనలతోనే సాగిన ఈ వంతెన పనులు.. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొలిక్కి రావడంతో త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Updated Date - Sep 20 , 2026 | 12:37 AM