Share News

బీపీఎస్‌కు బ్రేక్‌లు

ABN , Publish Date - Feb 28 , 2026 | 01:01 AM

భవనాల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు దారుల అంచనాలు తల్లకిందులయ్యాయి.

బీపీఎస్‌కు బ్రేక్‌లు

దరఖాస్తుదారుల ఎదురుచూపులు

మొదట్లో ముందుకు రాని యజమానులు

భవనాల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు దారుల అంచనాలు తల్లకిందులయ్యాయి. సమయం ఉంది కదా అని దరఖాస్తు చేసుకోవడంలో జాప్యం చేశారు. అయితే క్రమబద్ధీకరణ నిలుపుదల చేయాలంటూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పుడు దరఖాస్తుదారులు అయోమయంలో పడ్డారు.. అనవసరంగా జాప్యం చేశామంటూ మదనపడుతున్నారు.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

మొదట్లో బీపీఎస్‌కు చాలామంది ముందుకు రాలేదు. అన్ని మునిసిపాలిటీల్లోనూ వెనుకంజవేశారు.అయితే ప్రభుత్వం నుంచి ఒత్తిడి రావడంతో అధికారులు మేల్కొన్నారు. నయానో...భయానో నిర్మాణదారులు దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకున్నారు. మరోవైపు అతిక్రమణ చేసినప్పుడే అధికారులకు ముడుపులు చెల్లించామన్న ధీమాతో చాలా మంది సైలెంట్‌ అయ్యారు. ఇప్పుడిప్పుడే జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో దరఖాస్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే దీనిపై ఒకరు హైకోర్టులో కేసు వేశారు. దీంతో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు భవనాలను క్రమ బద్ధీకరించకూడదంటూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు క్రమబద్ధీకరణ ప్రక్రియ నిలిచిపోయింది. జిల్లాలో దరఖాస్తులు పెరుగుతున్న తరుణంలో బ్రేక్‌ పడింది. ముందుగా అందిన దరఖాస్తుల్లో కొన్నింటిని మాత్రమే పరిష్కరించారు. జిల్లాలోని అన్ని మున్సిపలిటీలకు రూ. 3.54 కోట్ల ఆదాయం లభించింది. మిగిలిన దరఖాస్తుదారులు ఎదురు చూసే పరిస్థితి వచ్చిపడింది.

భయపడ్డ యజమానులు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత బీపీఎస్‌ పథకాన్ని అమలు చేశారు. తొలుత నిర్మాణ దారులు, భవన యజమానులు దరఖాస్తు చేసుకోవడానికి భయపడ్డారు. ఆన్‌లైన్‌లో నమోదు చే సినప్పుడే కొందరు లైసెన్స్‌ టౌన్‌ ప్లానర్స్‌ (ఎల్‌టీపీ)లు కాసులకు కక్కుర్తిపడ్డారు. పలువురు అధికారుల ఆశీస్సులు కూడా ఉండడంతో ఎల్‌టీపీల మాట చెల్లుబాటు అయ్యింది. దాంతో బీపీఎస్‌లో దరఖాస్తు చేసుకోవడానికి కూడా భవన యజమానులు భయపడ్డారు.నిర్మాణ సమయంలో అధికారులకు ముడుపులు చెల్లించారు. క్రమబద్ధీకరణకు మళ్లీ సొమ్ములు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో దరఖాస్తులు మందకొడిగా నమోదయ్యాయి. మున్ముందు చట్టపరమైన ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గడచిన కొద్ది రోజుల నుంచి దరఖాస్తులు పెరిగాయి. హైకోర్టు ఆదేశాలతో తాజాగా నిలిచిపోయాయి.

మున్సిపాలిటీ దరఖాస్తులు పరిష్కారం ఆదాయం

(రూ.కోట్లలో)

భీమవరం 294 73 1.72

తణుకు 265 1 25.58

పాలకొల్లు 215 54 69.99

తాడేపల్లిగూడెం 177 3 38.43

నర్సాపురం 224 16 39.79

ఆకివీడు 38 7 8.58

Updated Date - Feb 28 , 2026 | 01:01 AM