Share News

పేరుపాలెం బీచ్‌కు బ్లూ ఫ్లాగ్‌

ABN , Publish Date - May 03 , 2026 | 11:44 PM

ఉమ్మడి పశ్చిమలో పేరుపాలెం బీచ్‌కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. నరసాపురం, మొగల్తూరు మండలాల్లో 19 కిలోమీటర్ల మేర విస్తరించిన సముద్ర తీరం పర్యాటకంగా ఎంతో ప్రసిద్ధిగాంచింది.

పేరుపాలెం బీచ్‌కు బ్లూ ఫ్లాగ్‌

కలెక్టర్‌ నాగరాణి ప్రత్యేక దృష్టి

గుర్తిస్తే పర్యాటకంగా మరింత అభివృద్ధి

నరసాపురం, మే 3(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి పశ్చిమలో పేరుపాలెం బీచ్‌కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. నరసాపురం, మొగల్తూరు మండలాల్లో 19 కిలోమీటర్ల మేర విస్తరించిన సముద్ర తీరం పర్యాటకంగా ఎంతో ప్రసిద్ధిగాంచింది. కార్తీకమాసం వచ్చిందంటే లక్షల్లో సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. సెలవు రోజుల్లో బీచ్‌ ఖాళీ ఉండదు. ఈ బీచ్‌ను మరింత ఆభివృద్ధి చేసేందుకు జిల్లా కలెక్టర్‌ నాగరాణి ప్రత్యేక దృష్టి సారించారు. బీచ్‌కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చేందుకు బ్లూ ప్లాగ్‌కు దరఖాస్తు చేశారు. ఇప్పటికే ఈ బ్లూ ఫ్లాగ్‌ సంస్థకు చెందిన కొంతమంది ప్రతినిధులు పేరుపాలెం బీచ్‌ను సందర్శించి చేపట్టాల్సిన పనులపై కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. వాటిని పూర్తి చేసేందుకు జిల్లా టూరిజం శాఖ చర్యలు చేపట్టింది.

ప్రస్తుతం బీచ్‌లో రెండు రిసార్ట్స్‌ మాత్రమే

పేరుపాలెం బీచ్‌లో ప్రస్తుతం రెండు రిసార్ట్స్‌ మాత్రమే ఉన్నాయి. ఒకటి కేంద్ర పర్యాటక మంత్రిగా చిరంజీవి ఉన్న సమయంలో హంస రిసార్ట్స్‌ను మంజూరు చేశారు. తరువాత ప్రైవేట్‌ భాగస్వామ్యంతో సీబే రిసార్ట్స్‌లు మాత్రమే ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు ఇవే ఆధారం.. గతంలో బీచ్‌లో బోట్‌ షికారు కూడా ఉండేది. త్వరలో దీన్ని తిరిగి ప్రారంభించే దశగా చర్యలు చేపట్టారు. మరో సంస్థ ఈ ప్రాంతంలో రిసార్ట్స్‌ అభివృద్ధికి ముందుకొచ్చింది. భూమి కేటాయిస్తే రిసార్ట్స్‌ నిర్మించి అభివృద్ధి పరుస్తామంది. దీనిపై జిల్లా టూరిజం అధికారి వెంకట అప్పారావు మాట్లాడుతూ కలెక్టర్‌ చొరవతో బ్లూ ఫ్లాగ్‌ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేశాం. బీచ్‌లో పరిశుభ్రతకు చర్యలు తీసుకుంటున్నాం. గుర్తింపు వస్తే పర్యాటకంగా బీచ్‌ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.

బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపు అంటే..

బ్లూఫ్లాగ్‌ అనేది ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక ఆర్గనైజేషన్‌. బీచ్‌లు, టూరిజం ప్రాంతాల్లో ఈ సంస్థ పర్యటించి పర్యావరణ నాణ్యత సర్టిఫికెట్‌ను జారీ చేస్తుంది. ఈ గుర్తింపు ఉంటే ఆ బీచ్‌ చాలా పరిశుభ్రంగా , సురక్షితంగా, పర్యావరణానికి ఆనుకూలంగా ఉందని అర్థం. ప్రస్తుతం రాష్ట్రంలో విశాఖలోని రుషికొండ బీచ్‌కు మాత్రమే ఈ గుర్తింపు ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో మరికొన్ని బీచ్‌లకు ఈ గుర్తింపు కోసం దరఖాస్తు చేశారు. వాటిలో మచిలీపట్నం, కాకినాడ, చీరాల, శ్రీకాకుళం, విశాఖలోని మరో రెండు బీచ్‌లు కూడా ఉన్నాయి. బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపు వస్తే ప్రపంచ వ్యాప్తంగా ఆ బీచ్‌ల పేర్లు సంస్థ వెబ్‌సైట్‌లో కనిపిస్తాయి. దీనివల్ల పర్యాటకంగా అభివృద్ధి సాధిస్తుంది. అక్కడ రిస్టార్ట్స్‌, రెస్టా రెంట్లు పెట్టేందుకు ముందుకొస్తారు. గుర్తింపు రావాలంటే చాలా ప్రమాణాలు పాటించాల్సి ఉంది. ప్రధానంగా సముద్ర నీరు కాలుష్యం లేకుండా ఉండాలి. బీచ్‌ నిర్వహణ పరిశుభ్రంగా ఉండాలి, చెత్తా, చెదారం, వ్యర్థాలు కనిపించకూడదు. తాగునీరు, మరుగుదొడ్లు, పస్ట్‌ ఎయిడ్‌, గజ ఈతగాళ్లు వంటి సదుపాయాలు ఉండాలి. వీటితో పాటు పర్యాటకుల సంఖ్య కూడా అధికంగా ఉండాలి. వీటిన్నంటిని పరిగణలోకి తీసుకుని సర్టిఫికెట్‌ జారీ చేస్తారు.

Updated Date - May 03 , 2026 | 11:44 PM