కొంగలు.. కనువిందు!
ABN , Publish Date - Feb 04 , 2026 | 12:16 AM
దమ్ము చేస్తున్న వరి పొలాల్లో కొంగలు గుంపులుగా దర్శనమిస్తున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో వరినాట్లు ఊపందుకున్న వేళ దమ్ము చేస్తున్న వరి పొలాల్లో కొంగలు గుంపులుగా దర్శనమిస్తున్నాయి. రైతులకు పంటలు పండక ముందే తెల్ల కొంగలకు మేత పంట పండింది. ట్రాక్టర్‌తో పొలంలో దమ్ము చేసే సమయంలో తెల్లని కొంగలు గుంపులుగా వచ్చి ఆహారం వెతుకుతూ సందడి చేస్తున్నాయి. పొలంలో పంటలకు హానికరమైన మట్టిలోంచి వచ్చే పురుగులు, చిన్నజీవులను, కీటకాలను తింటుండటంతో పంటచేలల్లో రసాయన మందుల వినియోగం లేకుండానే సహజంగా కీటకనియంత్రణ జరుగుతుంది. దీనివల్ల పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. దీంతో రైతులు చేసే పనికి ప్రకృతి కూడా సహకరిస్తున్న దృశ్యం కళ్ల ముందు నిలుస్తుంది. పంట చేలల్లో కొంగలు గుంపులుగా వాలడం ప్రకృతి సమతుల్యతకు మంచి సంకేతమని వ్యవసాయం–ప్రకృతి మధ్య ఉన్న అనుబంధం, రైతుల కష్టానికి ప్రకృతి ఇచ్చే మద్దతు అని రైతులు చెబుతున్నారు.
– లింగపాలెం, ఆంధ్రజ్యోతి