Share News

పట్టణాల్లో బయో డంపింగ్‌ యార్డులు

ABN , Publish Date - Mar 25 , 2026 | 11:52 PM

పట్టణాల్లో చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. బయో డంపింగ్‌ యార్డులు ఏర్పాటు కానున్నాయి.

పట్టణాల్లో బయో డంపింగ్‌ యార్డులు
తాడేపల్లిగూడెంలో చెత్తను తరలిస్తున్న దృశ్యం

రూ.37 కోట్ల నిధులు మంజూరు..

ఏజన్సీలు ఖరారు

నాలుగు మున్సిపాలిటీల్లో స్థలాలు గుర్తింపు

నరసాపురం, ఆకివీడులోనే భూ సమస్య

తడి, పొడి చెత్త సేకరణ

యార్డుల్లో వర్మీ కంపోస్ట్‌ తయారీ

పట్టణాల్లో చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. బయో డంపింగ్‌ యార్డులు ఏర్పాటు కానున్నాయి. ముక్కుపుటాలు అదిరేలా దుర్గంధంతో గుట్టలుగా పడి ఉండే చెత్త భవిష్యత్తులో కనిపించదు. తడిచెత్తతో వర్మీ కంపోస్ట్‌ తయారు చేయనున్నారు. పొడి చెత్తను శక్తి వనరుగా మార్చేందుకు ఇతర ప్రాంతాలకు తరలించనున్నారు.

(భీమవరం–ఆంధ్రజ్యోతి): పట్టణాల్లో కంపోస్ట్‌ యార్డుల నిర్మాణానికి ప్రభుత్వం ఇటీవల ఏజన్సీని ఖరారు చేసింది. జిల్లా ప్రజారోగ్యశాఖ సదరు ఏజన్సీతో ఒప్పందం కుదుర్చుకుంది. పట్టణాల వారీగా ప్రతిరోజు సేకరిస్తున్న చెత్త పరిమాణం ఆధారంగా బయో డంపింగ్‌ యార్డులను నిర్మించనున్నారు. ఆ మేరకు ప్రభుత్వం జిల్లాకు రూ.37 కోట్ల నిధులు కేటాయించింది. టెండర్‌ దక్కించుకున్న ఏజన్సీ సదరు యార్డులను నిర్మిస్తోంది. మున్సిపాలిటీలు ఇచ్చే చెత్తతో యార్డుల్లోనే వర్మీ కంపోస్ట్‌ తయారు చేయనుంది. దీనివల్ల చెత్త సమస్య నుంచి పట్టణాలు గట్టెక్కనున్నాయి. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోనూ స్థలాలు ఇవ్వా లంటూ ప్రజారోగ్య విభాగం కోరింది. ప్రస్తుతం నాలుగు మున్సిపాలిటీల్లో భూమి లభ్యత సాధ్యమైంది. నర్సాపురం, ఆకివీడులో మాత్రం భూ సమస్య వెంటాడుతోంది.

నాలుగు మున్సిపాలిటీలో స్థలాలు

భీమవరంలో ప్రస్తుతం యనమదుర్రు గట్టుపైనే చెత్త తగల బెడుతున్నారు. అక్కడ నాలుగు ఎకరాల విస్తీర్ణం ఉంది. దానినే బయో డంపింగ్‌కు కేటాయించారు. అది అనుకూలంగా ఉందంటూ ఏజన్సీ కూడా నిర్ధారించింది. పలితంగా దశాబ్దాల తరబడి భీమవరంలో డంపింగ్‌ యార్డు సమస్యకు పరిష్కారం లభించి నట్టయ్యింది. తాడేపల్లిగూడెంలో కుంచనపల్లి వద్ద చెత్త డంప్‌ చేస్తున్నారు. అక్కడ ఉన్న మూడు ఎకరాల స్థలంలో చెత్త కొండలుగా పేరుకుపోయింది. ఆ ప్రాంతంలోనే ఇప్పుడు బయో డంపింగ్‌ ఏర్పాటు చేయ నున్నారు. దాదాపు 80 వేల టన్నుల చెత్త అక్కడ ఉన్నట్టు నిర్ధారించారు. దానిని గుంటూరులోని బొగ్గు తయారు చేసే కంపెనీకి తరలించనున్నారు. చెత్తను తరలించే బాధ్యతను ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు అప్పగించింది. చెత్త తరలించిన తక్షణమే బయో డంపింగ్‌ యార్డును నిర్మించనున్నారు.తణుకులో ఇది వరకే ఆరు ఎకరాల్లో కంపోస్ట్‌ యార్డు ఉంది. అందులోనే రెండు ఎకరాలను బయో యార్డు ఏర్పాటుకు కేటాయించారు. పాలకొల్లు మున్సిపాలిటీలోనూ ఎకరన్నర భూమి అందుబాటులో ఉన్నట్టు గుర్తించారు. నాలుగు మున్సిపాలిటీల్లోనూ బయో డంపింగ్‌ యూనిట్‌ల ఏర్పాటుకు స్థలం అందుబాటులోకి ఉంది. నర్సాపురం, ఆకివీడులోనే స్థల సమస్య వెంటాడుతోంది.

తడి– పొడి చెత్త ఇవ్వాల్సిందే

బయో డంపింగ్‌ యార్డులు ఏర్పాటైన తర్వాత పట్టణాల్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించనున్నారు. ఇప్పటికే దీనిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. అక్కడక్కడా బ్యానర్‌లు ఏర్పాటు చేస్తున్నారు.తడి చెత్తను ఉపయోగించి డంపింగ్‌ యార్డులలో వర్మీ కంపోస్ట్‌ తయారు చేస్తారు. పొడి చెత్తను పవర్‌ ఉత్పత్తి కోసం గుంటూరు తరలించనున్నారు. అయితే మున్సిపాలిటీలు ప్రతి టన్ను చెత్తకు రూ. 520 ఏజన్సీకి చెల్లించాలి. మున్సిపాలిటీలో ఉత్పత్తయ్యే చెత్తను బట్టి ఖర్చు భరించాలి. అందుకోసం మున్సిపాలిటీలు అంగీకరించాయి.

Updated Date - Mar 25 , 2026 | 11:52 PM