అంతర్ రాష్ట్ర బైక్‌ల దొంగ అరెస్టు
ABN , Publish Date - Feb 15 , 2026 | 12:30 AM
నరసాపురంలో వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగ మాన్యం మణికంఠ వంశీని శనివారం పోలీసులు అరెస్టు చేశారు.
21 మోటార్ సైకిళ్లు స్వాధీనం
నరసాపురం, ఫిబ్రవరి 14(ఆంద్రజ్యోతి): నరసాపురంలో వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగ మాన్యం మణికంఠ వంశీని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 21 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని లాకుల వద్ద సీఐ యాదగిరి, ఎస్సైలు జయలక్ష్మి, ముత్యాలరావులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఆ మార్గంలో అనుమానాస్పదంగా వెళుతున్న నిందితుడిని పట్టుకుని విచారించగా వరుస చోరీల కేసు వీడింది. దీనికి సంబంధించి పట్టణ సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ డాక్టర్ శ్రీవేద మాట్లాడుతూ ఈనెల 7న చినమామిడిపల్లిలో సిర్రా శ్యాంబాబు నివాసంలో బైక్ చోరీ జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా నిందితుడు దొరికాడన్నారు. ఇప్పటి వరకు నిందితుడు నరసాపురంలో ఎనిమిదికి పైగా బైక్ చోరీలకు పాల్పడ్డారన్నారు. ఇతర జిల్లాలు, రాష్ర్టాల్లో కూడా అనేక కేసులు ఉన్నట్లు డీఎస్పీ చెప్పారు. విచారణలో నిందితుడు కాళ్ల మండలం ఏలూరుపాడు గ్రామానికి చెందిన వాడిగా తెలిసిందన్నారు. పట్టుబడిన 21 బైక్‌ల విలువ సుమారు రూ.13 లక్షల వరకు ఉంటుందన్నారు. ఈ కేసును చేధించడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ యాదగిరి, ఎస్సైలు జయలక్ష్మి, ముత్యాలరావు, కానిస్టేబుళ్లు వేణు, ప్రకాష్; చక్రవర్తి, రాజేష్, నారాయణ, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, రాజేష్‌లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందినట్లు డీఎస్పీ తెలిపారు.