భూమ్.. బూమ్
ABN , Publish Date - Jan 26 , 2026 | 01:04 AM
జిల్లాలో భూముల విలువ పెరగనున్నది. ప్రభుత్వం మార్కెట్ విలువ పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. సబ్ రిజిస్ర్టార్ కార్యా లయాల పరిధిలో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
పట్టణాలు, పల్లెలకు వర్తింపు
ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిఽధిలోనే పశ్చిమ
కనిష్ఠంగా 5 శాతం గరిష్ఠంగా 10 శాతం పెంపు
పంట భూములపై ఎకరానికి రూ.2 లక్షలు పెంచేందుకు కసరత్తు
ఈనెల 29న అభ్యంతరాల స్వీకరణ
ఫిబ్రవరి ఒకటి నుంచి కొత్త ధరల అమలుకు శ్రీకారం
జిల్లాలో భూముల విలువ పెరగనున్నది. ప్రభుత్వం మార్కెట్ విలువ పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. సబ్ రిజిస్ర్టార్ కార్యా లయాల పరిధిలో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. కనిష్టంగా ఐదు శాతం గరిష్టంగా పది శాతం వరకు పెరగనున్నాయి. ఫిబ్రవరి ఒకటి నుంచే కొత్త ధరలు అమలు కానున్నాయి.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో భూముల మార్కెట్ విలువ పెంచేందుకు రిజిస్ర్టేషన్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం జిల్లాలోని ఏడు సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల పరిధిలో పెంచారు. జాయింట్ కలెక్టర్ ఆమోదానికి పంపారు. మిగిలిన ఎనిమిది సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల పరిధిలోనూ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో పూర్తి కానున్నాయి. ఆ తర్వాత జిల్లా కమిటీ ఆమోదానికి పంపనున్నారు. వాటి నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు.అనంతరం పెంపు ప్రతిపాదనలను ఆచరణలోకి తీసుకు రానున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 29న పెంపు ప్రతిపాదనలపై అభ్యంతరాలను స్వీకరి స్తారు. ఆ మరుసటి రోజు అంటే 30వ తేదీన అభ్యంతరాలను పరిష్కరిస్తారు.జనవరి 31వ తేదీన తుది ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేస్తారు. వచ్చేనెల ఒకటో తేదీనుంచి కొత్త ధరలు అమలులోకి రాను న్నాయి. పట్టణాల వరకే పెంపు పరిమితం కానుం దని అంతా ఆశించారు. కానీ ఏలూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ పరిధిలోకి పశ్చిమగోదావరి జిల్లాలోని పట్టణాలు, పల్లెలను తీసుకు వెళ్లారు. దాంతో మార్కెట్ విలువ పెంపు అన్ని ప్రాంతాలకు వర్తించ నుంది. వ్యవ సాయ, వ్యవసాయేతర భూముల విలువను పెంచుతున్నారు. జిల్లాలో వ్యవ సాయ భూములపై ఎకరానికి కనిష్టంగా రూ. 2లక్షలు పెంచాలని నిర్ణయం తీసుకు న్నారు. స్థలాల విలువలోనూ గజానికి కని ష్టంగా 5 శాతం పెంచారు. గరిష్టంగా కొన్నిచోట్ల 30 శాతం వరకు పెరిగింది. పట్టణాల్లో మాత్రం గరిష్ట స్థాయిలో 10 శాతమే గజానికి పెంచాలని సబ్ రిజి స్ర్టార్‌లు నిర్ణయించారు. ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసే పనిలో అంతా నిమగ్నమయ్యారు.
ఆందోళనలో అధికారులు
భూముల విలువ పెంపు ప్రతిపాదనపై అధికారుల్లో ఒకింత గుబులు నెలకొంది. ఇప్పటికే రిజిస్ర్టేషన్‌లు తగ్గిపోయాయని గుబులు చెందుతున్నారు. జిల్లాలో మార్చి మాసాంతం వరకు రోజువారీ లక్ష్యాలను నిర్దేశించారు. జిల్లాలోని 15 సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల నుంచి ప్రతిరోజు రూ. 2 కోట్ల ఆదాయం రావాలన్న లక్ష్యంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ తరుణంలో మార్కెట్ విలువ పెంచితే ఆ ప్రభావం రిజి స్ర్టేషన్‌లపై పడుతుందన్న ఆందోళన నెలకొంది. నిజానికి కూలమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది కాస్త ఆదాయ పరంగా రిజిస్ర్టేషన్ శాఖ కుదుట పడుతోంది.ఆదాయం ఆశించిన స్థాయిలో వస్తోంది. గతంలో లక్ష్యాలపై నెలవారీ సమీక్షలు నిర్వహించే వారు. ఇప్పుడు రోజూ వారీ ఆదాయంపై ఆరా తీస్తున్నారు. మార్చి మాసాంతం వరకు ఇదే పరిస్థితి. తాజాగా భూముల విలువ పెంచాలంటూ రిజిస్ర్టేషన్ శాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. పెంపు ప్రతిపాదనలు చకాచకా జరిగి పోతున్నాయి. జిల్లాలో సోమవారం నాటికి అన్ని సబ్ రిజిస్ర్టార్ కార్యా లయాల్లోనూ పెంపు ప్రతిపాదనలు అధికా రులకు చేరుకోనున్నాయి. ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు.ఆ తర్వాత పెంపు ప్రతిపాదనలు అమలులోకి తేనున్నారు. ప్రభుత్వం పెంపు వద్దంటూ ప్రత్యేకంగా జీవో ఇస్తేనే పెంపు ప్రతిపాదనలను వాయిదా వేస్తారు.కానీ అధికారులు మాత్రం పెంచేందుకే ప్రతిపాదనలు సిద్ధం చేసేశారు.