Share News

భీమవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీకి గ్రీన్‌ సిగ్నల్‌

ABN , Publish Date - Aug 06 , 2026 | 11:48 PM

అమరావతిలో గురువారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో జిల్లాకు రెండు అంశాలకు సంబంధించి ఆమోద ముద్ర వేశారు. కొన్నాళ్లుగా జిల్లా ప్రజల ఎదురు చూస్తున్న భీమవరం ప్రత్యేక అథారిటీ ఆకాంక్ష నెరవేరేలా నిర్ణయం తీసుకు న్నారు.

భీమవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌  అథారిటీకి గ్రీన్‌ సిగ్నల్‌

నెరవేరనున్న జిల్లా ప్రజల ఆకాంక్ష

జిల్లాల విభజన ఆధారంగా

ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం

ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు

అమరావతిలో గురువారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో జిల్లాకు రెండు అంశాలకు సంబంధించి ఆమోద ముద్ర వేశారు. కొన్నాళ్లుగా జిల్లా ప్రజల ఎదురు చూస్తున్న భీమవరం ప్రత్యేక అథారిటీ ఆకాంక్ష నెరవేరేలా నిర్ణయం తీసుకు న్నారు. భీమవరం అర్బన్‌ డవలప్‌మెంట్‌ అథారిటీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అలాగే పుష్కర పనులకు సంబంధించి ఉమ్మడి గోదావరి జిల్లాలో ఘాట్‌ల అభివృద్ధికి రూ.210 కోట్లు పరిపాలనా అనుమతులకు ఆమోదం తెలిపారు.

(భీమవరం–ఆంధ్రజ్యోతి) : జిల్లాకు ప్రత్యేకంగా అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఉండాలన్న ఆకాంక్ష నెరవేరుతోంది. జిల్లాల పునర్వీవ్యవస్థీకరణ ఆధారంగా పట్టణ ప్రాధికార సంస్థ (అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ)లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సకల్పించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో గురువారం నిర్వహించిన మంత్రిమండలి దీనికి ఆమోద ముద్రవేసింది. ప్రస్తుతం జిల్లాలోని అన్ని పట్టణాలు, గ్రామ పంచాయతీలు ఏలూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఈడా)లో ఉన్నాయి. ఇప్పటిదాకా లేఅవుట్‌లు, భవన నిర్మాణాల అనుమతులను ఈడా మంజూరు చేస్తోంది. గ్రామ పంచాయతీల్లో లేఅవుట్‌లకు ఈడా అనుమతిస్తోంది. అందుకు సంబంధించిన రుసుము అంతా ఈడా ఖాతాలోనే జమ అవుతున్నాయి. ఇటీవలే మున్సిపాలిటీలకు దాదాపు రూ.48 కోట్లు మేర నిధులను పంపిణీ చేశారు. ఐదంతుస్తుల అపార్ట్‌మెంట్‌ అనుమతులను మున్సిపాలిటీలకే అప్పగించారు. కానీ పట్టణాలకు ఆనుకుని ఉన్న పంచాయతీల్లో వ్యక్తిగత నిర్మాణాలు, అపార్ట్‌మెంట్‌లకు ఈడా అనుమతి తప్పనిసరి. ఇప్పటికీ పంచాయతీలకు సంబంధిత నిధులు ఇవ్వలేదు. లేఅవుట్‌ అనుమతుల విషయం కూడా పంచాయతీలకు తెలియడం లేదు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని జిల్లాకు ప్రత్యేకంగా భీమవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఉండాలన్న వాదన బలంగా వినిపించింది.

ఇదివరకే నివేదిక

ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడాది క్రితం తణుకు వచ్చినపుడు జిల్లా కలెక్టర్‌ భీమవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ కోసం విన్నవించారు. ప్రభుత్వం నివేదిక కోరగా అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ కోసం భీమవరం మున్సిపాలిటీ ప్రాజెక్ట్‌ నివేదికను పంపింది. చైర్మన్‌తో పాటు, అధికారి, 8 మంది సిబ్బంది అవసరం అవుతారని, నిర్వహణ ఖర్చులకు ఏటా రూ.1.10 కోట్లు అవసరం కానుందని అంచనా వేశారు. ఆ మేరకు ప్రభుత్వానికి ప్రతి పాదనలు పంపారు. అప్పటి నుంచి అనుమతుల కోసం ఎదురుచూస్తున్నారు. భీమవరం డెవలప్‌ మెంట్‌ అథారిటీ ఏర్పాటైతే ఇక్కడ కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా చైర్మన్‌ను నియమించనుంది. జిల్లాలో పట్టణాలతో పాటు, రూర్బన్‌ పంచాయతీలు అధికంగా ఉన్నాయి. పట్టణాలకు ఆనుకుని ఉన్న పంచాయతీలు కూడా రూర్బన్‌గా రూపాంతరం చెందాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అర్బన్‌ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఇక్కడే ఉన్నాయి. అవన్నీ ఈడా పరిధిలో ఉండడంతో ఇక్కడ ప్రజాప్రతినిధులకు ప్రత్యేకత లేకుండా పోయింది. దీనిని దృష్టిలో ఉంచుకుని భీమవరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ డిమాండ్‌ తెరపైకి వచ్చింది. అందుకు తగ్గట్టుగానే మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది.

పుష్కర ఘాట్‌ల అభివృద్ధికి రూ. 210 కోట్లు

నరసాపురం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి గోదావరి జిల్లాలో 238 స్నానాల రేవుల అభివృద్ధి, నిర్మాణాలకు గురువారం జరిగిన కేబినేట్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో పాటు రూ.210 కోట్లకు పరిపాలనా అనుమతి ఇచ్చింది. ఇందులో జిల్లాలో నిర్మించే 34 స్నానాల రేవులు కూడా ఉన్నాయి. చంద్రబాబు అద్యక్షతన గురువారం జరిగిన కేబినేట్‌ సమావేశంలో పుష్కర అభివ్థృద్ధి పనులపై కూడా చర్చ జరిగింది. ఇందులో పశ్చిమ, ఏలూరు, పోలవరం, కోనసీమ, రాజమండ్రి, కాకినాడ జిల్లాలో ప్రస్తుతం ఉన్న రేవులు, అదనంగా నిర్మించే కొత్త ఘాట్లు ఉన్నాయి. కొన్ని ఘాట్లను విస్తరించే పనులు కూడా ప్రతిపాదించారు. అత్యధికంగా రాజమహేంద్రవరం జిల్లాలోని రాజమండ్రి, కొవ్వూరు ప్రాంతాల్లోని పుష్కర ఘాట్లు ఉన్నాయి. తరువాత ఏలూరు, పోలవరం జిల్లాలో కూడా కొన్ని స్నానాల రేవుల్ని ప్రతిపాదించారు. పశ్చిమలో నరసాపురం ప్రాంతాల్లో 12, పాలకొల్లు 13, ఆచంటలో తొమ్మిది ఘాట్లు ఉన్నాయి. వీటికి రూ.30 కోట్లు ఖర్చు అవుతుందని అంచనాలు వేశారు. వీటిలో నరసాపుంలోని వలంధర్‌, యలమంచిలి మండలంలో లక్ష్మీపాలెం, పెనుగొండ మండలంలోని సిద్ధాంతం రేవుల్ని విస్తరించనున్నారు. ప్రస్తుతం వలంథర్‌ రేవు 40 మీటర్లు ఉంది. దీన్ని 100 మీటర్లకు పెంచనున్నారు. సిద్ధాంతంలో మూడు రేవులు ఉన్నాయి. మూడింటిని కలిపి 80 మీటర్ల రేవుగా అభివృద్ధి చేస్తున్నారు. లక్ష్మిపాలెం రేవును కూడా ఇదే తరహాలో నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపారు.

టెక్నికల్‌ అనుమతి...తరువాత టెండర్లు

ప్రతిపాదించిన పనులకు కేబినెట్‌ ఆమోదం వేయడంతో ఇక టెక్నికల్‌ అనుమతులు మాత్రమే మిగిలాయి. చేపట్టే ప్రతి పని డిజైన్‌కు ఇంజనీరింగ్‌ విభాగం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రేవు విస్తీర్ణం, దానికి అవుతున్న ఖర్చు నివేదిక తయారు చేసి నీటి పారుదలశాఖ ఇంజనీరింగ్‌ చీఫ్‌కు పంపాల్సి ఉంటుంది. అప్పుడే టెండర్లు పిలిచేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ లభిస్తుంది. టెక్నికల్‌ ఆమోదం తీసుకుని టెండర్లు పిలిచేందుకు ఏటిగట్టు శాఖల అధికారులు సిద్ధం అవుతున్నారు.

Updated Date - Aug 06 , 2026 | 11:48 PM