బెట్టింగ్ భూతం
ABN , Publish Date - Apr 14 , 2026 | 12:21 AM
బెట్టింగ్ భూతం యువతను మింగేస్తోంది. కష్టపడి సంపాదించే అలవాటును పక్కన పెట్టి ఈజీమనీకి ఆశపడ్డ యువత అడ్డదారులు తొక్కుతోంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా నెట్‌వర్క్ ఉన్న బుకీలు గ్రామాల్లోకి వచ్చేశారు.
మింగేస్తున్న క్రికెట్ జూదం
అప్పుల ఊబిలో యువత
మే నెల చివరి వరకూ
ఐపీఎల్ మ్యాచ్‌లు
టెలిగ్రాం చానల్ పేరుతో బాల్‌టు బాల్ అప్‌డేట్
బుకీల కోసం రంగంలోకి ప్రత్యేక బృందాలు
ఏలూరు క్రైం, ఏప్రిల్ 13(ఆంధ్రజ్యోతి): బెట్టింగ్ భూతం యువతను మింగేస్తోంది. కష్టపడి సంపాదించే అలవాటును పక్కన పెట్టి ఈజీమనీకి ఆశపడ్డ యువత అడ్డదారులు తొక్కుతోంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా నెట్‌వర్క్ ఉన్న బుకీలు గ్రామాల్లోకి వచ్చేశారు. అమాయకుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఐపీఎల్ సీజన్ బెట్టింగ్ రాయుళ్లకు అడ్డాగా మారింది. మే నెలాఖరు వరకూ ఈ సీజన్ సాగనుంది. టాస్ నుంచి చివరి బాల్ వరకూ బెట్టింగ్ సాగుతూనే ఉంటుంది. బెట్టింగ్ యాప్‌లపై బ్యాన్ ఉన్నా యువతను ఆకర్షించేందుకు ఫేస్‌బుక్, ఇన్‌స్టా వేదికలుగా చేసుకుని బుకీలు, ఇన్‌ఫ్లుయన్సర్ల విచ్చల విడి ప్రచారం బంపర్ ఆఫర్‌లు యువతను చెడుమార్గాల వైపు మళ్లిస్తున్నాయి. పోలీసుల నిఘా కొరవడడంతో బెట్టింగ్ మాఫియా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతోందని విమర్శలు వస్తున్నాయి.
తాడేపల్లిగూడెంలోని ఓ ప్రైవేటు ఉద్యోగి గతంలో జరిగిన మ్యాచ్‌లలో సొమ్ము పోగొట్టుకున్నాడు. ఒక ప్రిడిక్షన్ చానల్ ఫాలో అయి రెండు మ్యాచ్‌ల్లో సంపా దించుకున్నాడు. తరువాత అదే చానల్‌ను ఫాలో అయి కాసిన ప్రతీ పందెం పొగొట్టుకున్నాడు. సుమారు రూ.6 లక్షలు సమర్పించుకున్నాడు. ఆ సొమ్మంతా అప్పులు చేసి కాసిందే.. చివరికి అప్పుల వాళ్లు ఇంటి దగ్గరకు, ఆఫీస్ దగ్గరకు వెళ్లి గొడవ పడటంతో ఉద్యోగం తీసేశారు. ఇంట్లో వాళ్లు ఈ పరిస్థితి చూసి ఏం చేసుకుంటాడో అని ఇల్లు తాకట్టుపెట్టి డబ్బులు సర్దుబాటు చేశారు. ఆ యువకుడు ఇప్పుడు హైద్రాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌కు వాచ్‌మేన్‌గా వెళ్లిపోయాడు. ఇంటి అప్పు తీర్చేందుకు ఆ కుటుంబం నానా తంటాలు పడుతోంది.
గతంలో బుకీలు తాము ఉండే ప్రాంతం లో టీవీ పెట్టుకుని క్రికెట్ మ్యాచ్ చూస్తూ సెల్‌ఫోన్ల ద్వారా ఎవరు ఎంత అమౌంట్ పందెం కడుతున్నారో తెలు సుకునేవారు. ఈ సమాచారం తెలిస్తే పోలీసులు దాడి చేసేవారు. నేడు క్రికెట్ మ్యాచ్‌లు తమ చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌లోనే కనిపిం చడంతో వారు సుదూర ప్రాంతాలకు వెళ్లి ఈ బెట్టింగులను తమ అనుచరుల ద్వారా నిర్వహిస్తు న్నారు. కొంతమంది అరకు, ఊటీ వంటి ప్రాంతాలకు వెళ్లి అక్కడ నుంచే తమ కార్యకలాపాలను నిర్వహిస్తూ యువ తను బెట్టింగ్ ఉచ్చులోకి దింపుతున్నారు. మరికొంతమంది పర్యాటక ప్రాంతా లకు వెళ్లి అక్కడ ఉన్న లాడ్జీలలో దిగి ఈ బెట్టింగ్ దందా సాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఎక్కువ మంది బుకీలు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి ప్రాంతాల నుంచి జిల్లాలోని కొంత మంది ఏజెంట్లను పెట్టుకుని దందా కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. పోలీసులు పాతవారిపైనే దృష్టి పెడు తున్నారే తప్ప కొత్తగా బెట్టింగులు నిర్వహించే వారిపై దృష్టి పెట్టకపోవడంతో వారు పోలీసు లకు చిక్క కుండా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నా రనే ఆరోపణలున్నాయి.
వారే నేడు బుకీల అవతారం
ఒకప్పుడు క్రికెట్ బెట్టింగుల్లో పందేలు కట్టినవారే నేడు బుకీలుగా అవతారం ఎత్తేశారు. బుకీలు ఏ విధంగా పర్సంటేజీలు వీరి వద్ద తీసు కున్నారో అదేవిధంగా పర్సంటేజీలు తీసుకుంటూ వారే ఈ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. గతంలో క్రికెట్ బెట్టింగు లు జరుగుతున్నట్టు అనుమానం వస్తే అనుమానితులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారణ చేసేవారు. నేడు అలాంటి వారు జిల్లాలో ఉండడం లేదు. పోలీసులు కూడా జిల్లాలో బెట్టింగులు జరగడం లేదనే ప్రాథమిక నిర్ధారణకు వచ్చేస్తున్నారు. ఏలూరులో గతంలో ఒక బుకీని అరెస్టు చేయగా అతని ఇంట్లో ఉన్న నగదును లెక్కించేందుకు పోలీసులు కరెన్సీ కౌంటింగ్ మిషన్లు వినియోగించారంటే బెట్టింగులు ఏస్థాయిలో జరుగుతున్నా యో అర్థం చేసుకోవచ్చు.
డిజిటల్ పేమెంట్లు
ప్రస్తుతం డిజిటల్ పేమెంట్లు రావడంతో ఫోన్‌పే, గూగుల్ పే ద్వారానే చెల్లింపులు జరుపుతూ బెట్టింగులను నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా తమ అకౌంట్లకు డిజిటల్ పేమెంట్లు జరపకుండా బుకీలు జాగ్రత్త పడుతున్నారు. కొంతమంది చిరు వ్యాపారులు, కిళ్లీ షాపులు వంటి వారికి ఫోన్‌పే చేయించి అక్కడ నుంచి నగదు రూపంలో డబ్బు లను తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీనికి ప్రతిఫలంగా వారికి కొంత పర్సంట్ ఇస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రిడిక్టర్ల ఉచ్చులో కొందరు
నన్ను నమ్మండి మీరు నేను చెప్పే జట్టు గెలుస్తుందని పందెం కట్టండి గెలవకపోతే మీరు పోగొట్టుకున్న మనీ తిరిగి ఇచ్చేస్తాను అంటూ ఇన్‌స్టాలో వందలాది మంది ప్రిడిక్షన్ పేరుతో అమాయక ప్రజలను ఐపీఎల్ బెట్టింగ్ లకు ఉసుగొల్పుతున్నారు. ‘‘గత సీజన్‌లో 46 మ్యాచ్‌లకు 44 గెలిపించి చూపించాను..కావాలంటే నా చానల్‌లో చూడండి..నేను చెప్పింది జరగకపోతే నేను ప్రిడిక్షన్ చెప్ప ను.. ఇక నా చానల్ డిలీట్ చేస్తా..’’ ఐపీఎల్ మ్యాచ్‌లపై పందేలు కాయాలంటూ యువతను ఆకర్షిస్తూ బెట్టింగ్‌లు కాసేందుకు కారణం అవుతున్నారు.
పోలీస్‌శాఖ అప్రమత్తం
ఎస్పీ కేపీఎస్ కిశోర్ ఆదేశాల మేరకు జిల్లాలోని పోలీసులు తమ స్టేషన్ల పరిధిలో క్రికెట్ బుకీలపై నిఘా ఉంచారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆదివారం గతంలో క్రికెట్ బెట్టింగుల వల్ల నష్టపోయిన బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఒకట్రెండు రోజుల్లోనే బుకీల భరతం పట్టేందుకు జిల్లా పోలీసులు సన్నద్ధమవుతున్నారు.
ముదినేపల్లిలో బెట్టింగ్.. ఎనిమిది మంది అరెస్టు
ముదినేపల్లి, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): ముదినేపల్లి లోని గురజ రోడ్డు సెంటర్‌లో ఆదివారం రాత్రి క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతుండగా ఎస్‌ఐ వీరభద్రరావు ఆధ్వ ర్యంలో ఆకస్మికంగా దాడిచేసి ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.4,500 నగదు, ఏడు సెల్‌ఫోన్లను స్వాఽధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. బెట్టింగులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుం టామని ఎస్‌ఐ హెచ్చరించారు.