వచ్చే విద్యాసంవత్సరానికి ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ ప్రారంభించాలి
ABN , Publish Date - Jan 21 , 2026 | 12:58 AM
వచ్చే విద్యాసంవత్సరానికి (2026–27) ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకునేందుకు ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్‌ను ఇప్పటినుంచే ప్రారంభించాలని పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు(కాకినాడ ఆర్జేడీ) జి.నాగమణి కోరారు.
కాకినాడ ఆర్జేడీ నాగమణి
ఏలూరుఅర్బన్, జనవరి20(ఆంధ్రజ్యోతి) : వచ్చే విద్యాసంవత్సరానికి (2026–27) ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకునేందుకు ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్‌ను ఇప్పటినుంచే ప్రారంభించాలని పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు(కాకినాడ ఆర్జేడీ) జి.నాగమణి కోరారు. పీఎంశ్రీ పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధుల వినియోగం, బిల్లుల అప్‌లోడ్‌కు సంబంధించి కొత్తగా అమల్లోకి తెచ్చిన సంస్కరణలు, టెన్త్ విద్యార్థులకు వంద రోజుల కార్యాచరణ అమలు, ప్రాథమిక తరగతుల విద్యార్థులకు జీఎఫ్‌ఎల్‌ఎన్ ప్రోగ్రాం అమలుపై మంగళవారం స్థానిక సుబ్బమ్మదేవి మున్సిపల్ హైస్కూలులో ఏలూరు జిల్లాలోని అన్ని మండలాల ఎంఈవోలు, సంబంధిత పాఠశాలల హెచ్‌ఎంలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి విడుదల చేసిన నిధులతో చేపట్టిన పనులకు బిల్లులను తక్షణమే అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. టెన్త్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రభుత్వం నిర్ధేశించిన కార్యాచరణ హైస్కూళ్లలో అమలయ్యేలా దత్తత అధికారులుగా నియమించిన పలు శాఖల స్థానిక అధికారులు, ఎంఈవోలు రోజూ కనీసం రెండు పాఠశాలలనైనా సందర్శించి పరిశీలించాలన్నారు. తెలుగు, ఇంగ్లీషు, గణితం సబ్జెక్టుల్లో ప్రాథమిక తరగతుల బాలబాలికలు కనీస సామర్థ్యాలను సాధించ డానికి 75 రోజులపాటు అమలయ్యేలా చేపట్టిన ఎఫ్‌ఎల్‌ఎన్ ప్రత్యేక బోధనా తరగతులు పాఠశాలల్లో ఎలా జరుగుతున్నదీ పరిశీలించి నివేదికలివ్వాలని సూచించారు. డీఈవో వెంకటలక్ష్మమ్మ, సమగ్రశిక్ష జిల్లా ఏపీసీ పంకజ్‌కుమార్, డీవైఈవోలు, ఎంఈవోలు, సమగ్రశిక్ష సెక్టోరల్ అధికారులు, పీఎం శ్రీ పాఠశాలల హెచ్‌ఎంలు పాల్గొన్నారు.
డీఈవో ఫిర్యాదుపై ఆర్జేడీ విచారణ
డీఈవో కార్యాలయంలో ఓ అధికారి దుష్ప్రవర్తన, అవాంఛనీయ దూషణలపై పాఠశాలవిద్య డైరెక్టర్‌కు డీఈవో వెంకటలక్ష్మమ్మ పంపిన ఫిర్యాదుమేరకు కాకినాడ ఆర్జేడీ నాగమణి మంగళవారం ఏలూరు డీఈవో కార్యాలయంలో విచారణ నిర్వహించారు. వివాదాస్పద అధికారిపైవచ్చిన అభియోగాలు, ఆరోపణలకు సంబంధించి సుమారు 21 ప్రశ్నలతో కూడిన ప్రశ్నవళిని రూపొందించి డీఈవో, ఏడీ–2 మొదలుకుని కార్యాలయ సిబ్బంది వరకు అందరినుంచి వేర్వేరుగా లిఖితపూర్వక సమాధానాలను తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కార్యాలయంలో నెలకొన్న పరిస్థితులపై రచ్చకెక్కడాన్ని సీరి యస్‌గా తీసుకున్న ఆర్జేడీ ఒకింత తీవ్రస్థాయిలోనే అందరినీ మందలించినట్టు సమాచారం. డీఈవో స్థాయినే దిగజార్చేలా మాట్లాడుతుండడం, తదితర పరిణా మాలపై ఉద్యోగులంతా సంతకాలు చేసిన ఫిర్యాదును విద్యాశాఖ డైరెక్టరేట్‌కు డీఈవో వెంకటలక్ష్మమ్మ గతేడాది నవంబరులో పంపించారు. విచారణ నివేదికను త్వరలో డైరెక్టర్‌కు అందజేయనున్నారు.