స్థానిక సమరానికి సమాయత్తం
ABN , Publish Date - Aug 19 , 2026 | 01:13 AM
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కూటమి ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తోంది. ఓ వైపు కార్పొరేషన్, మునిసి పాలిటీల్లో మేయర్ చైర్ పర్సన్‌లను ప్రజలే నేరుగా ఎన్నుకునేలా అసెంబ్లీలో చట్టం చేస్తోంది.
ప్రత్యక్షంగా.. పురపోరు
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కూటమి ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తోంది. ఓ వైపు కార్పొరేషన్, మునిసి పాలిటీల్లో మేయర్ చైర్ పర్సన్‌లను ప్రజలే నేరుగా ఎన్నుకునేలా అసెంబ్లీలో చట్టం చేస్తోంది. మరోవైపు బీసీలకు పెద్ద పీట వేసేలా మంత్రి మండలి నిర్ణయించింది. సర్పంచ్‌లు,
మండల పరిషత్, జిల్లా పరిషత్‌లో 34 శాతం, మునిసిపాలిటీ, కార్పొ రేషన్‌లలో మూడో వంతు స్థానాలను బీసీలకు కేటాయించనుంది. వచ్చే అక్టోబరులోగా మునిసిపల్ ఎన్నికల ప్రక్రియ, మిగిలినవి ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయనుంది.
(ఏలూరుసిటీ–ఆంధ్రజ్యోతి):
సీఎం చంద్రబాబునాయుడి ప్రభుత్వం బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల హామీలు ఇవ్వటం తోనే ఆగిపోకుండా వాటిని అమలు చేసి చూపిస్తు న్నట్లు సీఎం చంద్రబాబు సమావేశాల్లో పేర్కొన్నారు. గత ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లలో చేసిన అన్యాయాన్ని సరిచేయ టానికి ప్రత్యేక కేబినేట్ సమావేశం ఏర్పాటు చేసి, ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. బీసీలకు రాజకీయంగా మరింత ప్రాధాన్యత కల్పించటానికి గ్రామీణ స్థానిక సంస్థల్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 13 జిల్లా పరిషత్‌లు ఉన్నాయి. రాబోయే రోజుల్లో 28 జడ్పీలు ఏర్పడనున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ ఇకపై ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి జిల్లా పరిషత్‌లుగా ఆవిర్భవించనున్నాయి. బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ కోటాను ప్రభుత్వం ఖరారు చేయడంతో గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు అక్టోబరు నెలాఖరులోగా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆర్థిక సంఘ నిధులు రావాలంటే స్థానిక సంస్థల ఎన్నికలను త్వరిత గతిన పూర్తిచేయాలి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏర్పాటు చేసిన డెడికేషన్ కమిషన్ యూనిఫైడ్ ప్యామిలీ సర్వే ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు ఎన్ని సీట్లు కేటాయించాలో సిఫార్సు చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలో 27.66 శాతం బీసీల కోటా కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవటం కోసం 34 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించింది. దీనిపై కూటమి నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
స్థానిక సంస్థలలో బీసీలకు ప్రాధాన్యం
ఉమ్మడి జడ్పీలో 48 జడ్పీటీసీలుండగా 2021 ఎన్నికలలో తొమ్మిది స్థానాలు బీసీలకు కేటాయించారు. బీసీ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఈ స్థానాల సంఖ్య 11కు పెరిగాయి. 34 శాతం రిజర్వేషను కోటా ఇస్తే ఈ స్థానాలు మరింత పెరుగు తాయి. 2021లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 863 ఎంపీటీసీలు వుండగా బీసీలకు 202 కేటాయించారు. బీసీ కమిషన్ సిఫార్సుల మేరకు 2026లో 872 ఎంపీటీసీలలో 197 స్థానాలను బీసీలకు కేటాయిస్తూ సిఫార్సు చేశారు. తాజాగా నిర్ణయంతో ఈ స్థానాలు మరింత పెరుగుతాయి. ఏలూరు జిల్లాలో 547 గ్రామ పంచాయతీలు వున్నాయి. 2021లో 544 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే బీసీలకు 99 రిజర్వు చేశారు. తాజాగా జిల్లాలో 547 పంచా యతీలకు 99 పంచాయతీలనే ఇవ్వాలని బీసీ కమిషన్ సిఫారసు చేసింది. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయంతో బీసీలకు కేటాయించే సర్పంచ్ పద వులు పెరగనున్నాయి. దీని ప్రకారమే వార్డు మెంబర్లు బీసీలకు ఎక్కువగా కేటాయిస్తారు.
పంచాయతీల్లో ఓటర్ల గుర్తింపు షెడ్యూల్ ఇలా..
ఇంటింటా సర్వే.. : ఆగస్టు 18 నుంచి 22 వరకు
ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల మార్కింగ్ : 23 నుంచి 24 వర కు
ఓటర్ల ప్రచురణ : 25న. అభ్యంతరాల స్వీకరణ : 26–28 మధ్య
అభ్యంతరాలు పరిశీలన : 29 నుంచి సెప్టెంబరు 2 వరకు
గ్రామసభల్లో ఓటర్ల నిర్ధారణ : సెప్టెంబరు 3 నుంచి 6 వరకు
తుది జాబితా ప్రచురణ : సెప్టెంబరు 7
పాత పద్ధతిలోనే నేరుగా మేయర్, చైర్‌పర్సన్ల ఎన్నిక
సెప్టెంబరు 3న ఓటర్ల జాబితా
అక్టోబరు నాటికి పాలకవర్గాల ఏర్పాటు
ప్రత్యక్ష ఎన్నికలపై సర్వత్రా హర్షం
(ఏలూరు–ఆంధ్రజ్యోతి):
నగరాలు, పట్టణాల్లో మేయర్లు, చైర్మన్లు ఇప్పటి వరకు పరోక్ష పద్ధతిలో ఎన్నికయ్యేవారు. పార్టీల పరంగా డివిజన్లు, వార్డుల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పోటీ చేసేవారు. ఏ పార్టీకి ఎక్కువ మంది గెలిస్తే.. వారంతా కలిసి మేయర్, చైర్మన్‌లను ఎన్నుకునేవారు. ఈ ప్రక్రియలో పాలనాపరంగా, రాజకీయంగా ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న సీఎం చంద్రబాబు వీరిని కూడా సర్పంచ్‌ల మాదిరి ప్రజలే ప్రత్యక్షంగా ఓటు వేసి ఎన్నుకునే విధాన పరమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది.ఈ ప్రత్యక్ష విధానంలో నగరం, పట్టణంలోని ప్రజలందరూ ఓట్లు వేయాల్సి రావడంతో గెలిచిన మేయర్, చైర్మన్లు అన్ని వార్డుల అభివృద్ధిపైన దృష్టి కేంద్రీకరిస్తారు. పట్టణ స్థానిక సంస్థల ఆదాయాల్లో ప్రతీ వార్డు, డివిజన్‌కు నిర్ధేశిత మొత్తాలను ఖర్చు చేయడానికి అధికారం ఉంటుంది. ఐదేళ్లపాటు మేయర్, చైర్మన్ల పదవి ఢోకా ఉండదు.
టీడీపీ హయాంలో ప్రత్యక్ష ఎన్నికలు
20 ఏళ్ల క్రితం జరిగిన పాత విధానాన్ని పునరుద్ధరించినట్లు అయ్యింది. టీడీపీ హయాంలో పుర పోరు ప్రత్యక్షంగానే సాగింది. 1995, 1999లో జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలు టీడీపీనే గెలుచుకుంది. ఏలూరులో వరుసగా ఉప్పాల జగదీష్‌బాబు పిళ్లంగోళ్ల రంగారావు (కాంగ్రెస్)పైన, మఽధ్యాహ్నపు ఈశ్వరి బలరామ్ లక్ష్మీ సుశీల (కాంగ్రెస్)పైన భారీ మెజారిటీతో గెలుపొందారు. 2005లో ఏలూరు కార్పొరేషన్‌గా అవతరించిన తర్వాత కాంగ్రెస్ హయాంలో ఇద్దరు అభ్యర్థులు పరోక్ష పద్ధతిలో కారే బాబూరావు, తాడిగడప రామారావు మేయర్లుగా పనిచేశారు. తర్వాత రెండు ద ఫాలు నూర్జ హాన్ పదేళ్లపాటు మేయర్‌గా కొనసాగారు.
కూటమి పార్టీల్లో ఉత్కంఠ
మేయర్, చైర్మన్ల పదవులకు ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో జరగనుండటంతో కూటమి పార్టీల మధ్య పోటీ నెలకొంది. తమ పార్టీలకు ఎక్కువ స్థానాలు ఆశించడంతోపాటు మేయర్, చైర్మన్ల పదవులకు ఒత్తిడి తెస్తున్నారు. ఏలూరు కార్పొ రేషన్‌తోపాటు జంగారెడ్డిగూడెం, నూజివీడుల్లో అభ్యర్థుల వేట మొదలైంది. ఆశావహులు చాలా మంది ఉన్నప్పటికీ ప్రత్యక్ష ఎన్నికల ఖర్చు ప్రధాన మేయర్, చైర్మన్లకు తడిసి మోపెడయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ తట్టుకునే వారు, ప్రజల్లో పేరున్న అభ్యర్థులు ఆచితూచి బరిలో దింపేందుకు పార్టీలు వ్యూహ రచన చేస్తున్నారు.
ఎన్నికలకు వేగంగా అడుగులు
కార్పొరేషన్లు, మునిసిపాలిటీలకు అక్టోబరు లోగా ఎన్నికలు నిర్వహించేందుకు ఓ వైపు ప్రభుత్వం, మరోవైపు ఎన్నికల సంఘం యం త్రాంగాలను అప్రమత్తం చేశాయి. సెప్టెంబరు మూడో తేదీ నాటికి వార్డులు, డివిజన్‌ల వారీ ఫోటో ఓటర్లతో జాబితాలను ప్రదర్శించేందుకు మున్సిపల్ కమిషనర్లు, టౌన్‌ప్లానింగ్ అధికారులు సమాయత్తవుతున్నారు. ఓటర్ల జాబితాల ప్రదర్శన తర్వాత రిజర్వేషన్ల ప్రక్రియ కొలిక్కి వస్తుంది.
ఏలూరులో 50 డివిజన్లకే..
ఏలూరు కార్పొరేషన్‌లో డివిజన్ల రిజర్వేషన్లపై కోర్టుకు ఎక్కడంతో ఈ సారికి 50 డివిజన్లకే ఎన్నిక లు జరుగుతాయని సమాచారం. వాస్త వంగా 62 డివిజన్లగా పునర్విభజన చేస్తూ ప్రతి పాదనలు వెళ్లాయి. నూజివీడులో 36 వార్డులు, జంగారెడ్డిగూడెంలో 32 వార్డులకు పెరగనున్నా యి. ఈ నెల 25లోగా డివిజన్ల, వార్డుల పెంపు పై తుది నివేదిక వెలువడనుంది. చింతలపూడి నగర పంచాయతీ ఎన్నికపై ప్రభుత్వం ముందుకు వెళుతుందా? అన్న ఆసక్తి నెలకొంది. ఇక్కడ ఎన్నికలపై కోర్టులో స్టే ఉండటంతో దీనిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది.
ప్రత్యక్ష పద్ధతిని స్వాగతిస్తున్నాం
‘కాంగ్రెస్ హయాం లో ప్రలోభాలకు గురి చేసి పరోక్ష ఎన్నికలకు పాల్పడేవారు. ఈ విధానానికి స్వస్తి పలికి ప్రత్యక్ష ఎన్నికల నిర్వహణకు చంద్రబాబు ధైర్యంగా నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నాం. దీనిద్వారా నగరంలో అన్ని డివిజన్లకు నిధుల పంపిణీలో సమన్యాయం జరుగు తుంది’ అని మాజీ చైర్మన్ ఉప్పాల జగదీష్‌బాబు అన్నారు.
ప్రజలకు ఎంతో మేలు
ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, చైర్మన్ల ఎన్ని కల వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది. మా హయాంలో అన్ని వార్డులకు నిధుల వి డుదల, అభివృద్ధి విషయాల్లో అందరిని కలుపుకుని ముందుకు వెళ్లాం. కార్పొరేషన్ భవనం, వంతెన నిర్మాణాలు చేపట్టాం’ అని మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ మధ్యాహ్నపు ఈశ్వరి తెలిపారు.