అంతర్జాతీయ అందాల పోటీల్లో ఏలూరు యువతికి కిరీటం
ABN , Publish Date - Oct 18 , 2026 | 12:31 AM
ఖండాలు దాటి తెలుగు కీర్తిని చాటిన ఏలూరు యువతి సాన్వి పాలెం అంతర్జాతీయ అందాల వేదికపై విజయకేతనం ఎగురవేసింది.
ఏలూరు రూరల్, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి) : ఖండాలు దాటి తెలుగు కీర్తిని చాటిన ఏలూరు యువతి సాన్వి పాలెం అంతర్జాతీయ అందాల వేదికపై విజయకేతనం ఎగురవేసింది. ఇటీవల అమెరికాలో జరిగిన రీజెన్సీ అంతర్జాతీయ అందాల పోటీలు – 2026లో జూనియర్ మిస్ యునైటెడ్ స్టేట్స్ రీజెన్సీ కిరీటాన్ని కైవసం చేసుకుంది. పోటీదారుల మధ్య తన ప్రతిభను చాటడంతో పాటు మరో రెండు పురస్కారాలను సొంతం చేసుకుంది. ఏలూరు రామచంద్రరావుపేటకు చెందిన రూపాశేషాద్రి పాలెం కుమార్తె సాన్వి, అమెరికాలో ప్రతిష్టాత్మక రీజెన్సీ అంతర్జాతీయ అందాల పోటీలు – జూనియర్ టీన్ మిస్ యునైటెడ్ స్టేట్స్ రీజెన్సీ కిరీటాన్ని కైవసం చేసుకుంది. టెక్సాస్లోని హ్యూస్టన్లో జరిగి ఈ పోటీల్లో 160 మంది పాల్గొనగా, సాన్వి జూనియర్ టీన్ విభాగంలో ద్వితీయ రన్నరప్తో పాటు పీపుల్స్ చాయిస్, ఇంటర్నేషనల్ అంబాసిడర్ – 2026 పురస్కారాలను కూడా గెలుచుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో న్యూయార్క్లో జరిగే ఫ్యాషన్ వీక్లో ప్రముఖ డిజైనర్ మార్క్ దేఫాంగ్ రూపొందించే ఫ్యాషన్ ప్రదర్శనలో మోడల్గా సాన్వి అరంగ్రేటం చేయనుంది.