వైభవంగా బలుసులమ్మ జ్యోతి ఊరేగింపు
ABN , Publish Date - Mar 21 , 2026 | 12:47 AM
తాడేపల్లిగూడెంలో శుక్రవారం రాత్రి అమ్మవారి జ్యోతి ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు.
యాగశాలలో శ్రీచక్రార్చన
9వ రోజుకు జాతర ఉత్సవాలు
తాడేపల్లిగూడెం, మార్చి 20(ఆంధ్రజ్యోతి): తాడేపల్లిగూడెంలో శుక్రవారం రాత్రి అమ్మవారి జ్యోతి ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు. భక్తులు వారివారి ఇంటి వద్ద నుంచి మట్టి మూకిడిలో జ్యోతిని వెలిగించుకుని బస్టాండు వద్ద ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా బలుసులమ్మ ఆలయానికి చేరుకున్నారు. కన్నుల పండువగా జ్యోతి ఊరేగింపు సాగింది. జాతర ఉత్సవాలు శుక్రవారం తొమ్మిదో రోజుకు చేరాయి. జాతరలో భాగంగా యాగశాల వద్ద ఉదయం శ్రీచక్రార్చన నిర్వహించారు. అమ్మవారి ఆలయం వద్ద ధూపసేవ, బలిహరణలో భాగంగా పెసరపప్పు, పులగం కలిపిన అన్నం (కృసరాన్నం) నివేదన చేశారు. దీనివల్ల పరస్పర మైత్రీభావం, వ్యాపారాభివృద్ధి, శత్రుప రిహారం, అతివృష్టి, అనావృష్టి, భౌతిక భయ నివారణ జరుగుతాయని విశ్వాసం. మధ్యాహ్నం అన్నసమారాధన నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.