Share News

వైభవంగా బలుసులమ్మ జాతర ప్రారంభం

ABN , Publish Date - Mar 13 , 2026 | 12:35 AM

తాడేపల్లిగూడెంలో బలుసులమ్మ జాతర గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈనెల 22 వరకు ఉత్సవాలు నిర్వహించేందుకు కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

వైభవంగా బలుసులమ్మ జాతర ప్రారంభం

ప్రధాన వీధులు, సెంటర్లలో విద్యుత్‌ కాంతులు

పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ దంపతులు

తాడేపల్లిగూడెం, మార్చి12(ఆంధ్రజ్యోతి):తాడేపల్లిగూడెంలో బలుసులమ్మ జాతర గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈనెల 22 వరకు ఉత్సవాలు నిర్వహించేందుకు కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధాన రోడ్లు, సెంటర్లలో విద్యుత్‌ దీపాల అలంకరణ చేశారు. ఉత్సవాలను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌, అనురాధ దంపతుల ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తొలిరోజు భక్తులు పోటెత్తడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. శుక్రవారం భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారని తొక్కిసలాట జరగకుండా ప్రత్యేక బారికేడ్లను ఏర్పాటు చేశామని ఉత్సవ కమిటీ నిర్వాహకుడు శ్రీరంగం అంజి తెలిపారు.

సనాతన ధర్మ పరిరక్షణకే జాతర : బొలిశెట్టి

సనాతన ధర్మపరిరక్షణ కోసమే బలుసులమ్మ జాతరను నిర్వహిస్తు న్నామని ప్రభుత్వ విప్‌ బొలిశెట్టి శ్రీనివాస్‌ తెలిపారు. తొలుత ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ దంపతులు అమ్మవారికి పట్టు వస్ర్తాలను సమర్పించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌ 50గ్రాములు, మారిశెట్టి పోతురాజు 15గ్రాములు, ఎన్‌.మణికంఠ 10 గ్రాముల బంగారంతో మొత్తం 75 గ్రాములతో అమ్మవారికి శ్రీచక్ర సహిత బంగారు కంఠాభరణాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014లో మునిసిపల్‌ చైర్మన్‌గా ఉన్నప్పుడు జాతర నిర్వహించానని, మళ్లీ 12 ఏళ్ల తరువాత అమ్మవారి కటాక్షంతో ఎమ్మెల్యే స్థానంలో జాతర నిర్వహించడం నేను చేసుకున్న పుణ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఈవో చంద్రశేఖర్‌, ఉత్సవ కమిటీ నిర్వాహకుడు శ్రీరంగం అంజి, మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.ఏసుబాబు, డీఎస్‌పీ విశ్వనాఽథ్‌, బొలిశెట్టి రాజేష్‌, మారిశెట్టి పోతురాజు కుటుంబ సభ్యులు, తోట రాజా, ఈతకోట తాతాజీ, పాలూరి వెంకటేశ్వరరావు, వర్తనపల్లి కాశీ, గొర్రల శ్రీధర్‌, చాపల రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2026 | 12:35 AM