క్రీడల్లో ప్రావీణ్యం సాధిస్తే ఒత్తిడి నుంచి దూరం కావచ్చు
ABN , Publish Date - Jul 18 , 2026 | 12:12 AM
అవకాశాలను అందిపుచ్చుకుని క్రీడాకారులు ఏదో ఒక క్రీడలో మంచి ప్రావీణ్యాన్ని సాధిస్తే మానసిక ఒత్తిడి నుంచి దూరం కావచ్చని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ కేఆర్ కల్పశ్రీ సూచించారు.
పశ్చిమ గోదావరి జిల్లా జేసీ కల్పశ్రీ
భీమవరం రూరల్, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : అవకాశాలను అందిపుచ్చుకుని క్రీడాకారులు ఏదో ఒక క్రీడలో మంచి ప్రావీణ్యాన్ని సాధిస్తే మానసిక ఒత్తిడి నుంచి దూరం కావచ్చని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ కేఆర్ కల్పశ్రీ సూచించారు. శుక్రవారం భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సాగి రామకృష్ణంరాజు మెమోరియల్ పేరిట ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కం బ్యాడ్మింటన్ సెలక్షన్స్ చాంపియన్‌షిప్–2026 ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి క్రీడల ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ సీహెచ్.హరిమోహన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు గతంలో మానసిక ఒత్తిళ్లు ఉండేవి కావన్నారు. చక్కగా చదువుకుని ఏదో ఒక ఆటలో సేదతీరేవారన్నారు. ప్రస్తుతం టీవీ, సెల్‌ఫోన్, ఇంటర్నెట్ చాటింగ్‌లు వచ్చిన తర్వాత విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒత్తిడిని జయించాలంటే కష్టపడి చదవాలి, ఆటల్లో నైపుణ్యం పెంచుకోవాలన్నారు. తాను అప్పుడప్పుడూ స్ట్రెస్ ఫ్రీ కోసం బ్యాడ్మింటన్ ఆడుతుంటానన్నారు. కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్‌వర్మ మాట్లాడుతూ తమ కళాశాలలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.జగపతిరాజు, ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ మురళీకృష్ణంరాజు, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సీహెచ్. దిలీప్ చక్రవర్తి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎం.వంశీకృష్ణ మాట్లాడారు. తణుకుకు చెందిన ఎస్.హేమంత్‌శ్రీ అనే క్రీడాకారుడు ఆసియా గేమ్స్‌లో చైనాలో మనదేశం తరఫున ఆడిన సందర్భాన్ని పురస్కరించుకుని అతడిని ఘనంగా సత్కరించారు.