ఆటోమేషన్. పరేషాన్!
ABN , Publish Date - Feb 26 , 2026 | 01:01 AM
పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ సిబ్బంది నియామకాల్లో ఈ ఏడాది కొత్తగా అమల్లోకి తెచ్చిన ఆటోమేషన్ విధానం ఆదిలోనే క్షేత్రస్థాయిలో హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులకు ముచ్చెమటలు పుట్టిస్తోంది.
పది పరీక్షల అధికారులకు విధుల కేటాయింపులో గందరగోళం
హెచ్‌ఎంలు, టీచర్ల నుంచి నిరసనలు
ఏలూరు అర్బన్, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ సిబ్బంది నియామకాల్లో ఈ ఏడాది కొత్తగా అమల్లోకి తెచ్చిన ఆటోమేషన్ విధానం ఆదిలోనే క్షేత్రస్థాయిలో హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులకు ముచ్చెమటలు పుట్టిస్తోంది. ప్రస్తుతం పని చేస్తున్న స్కూలు ప్రాంతం నుంచి 50 నుంచి 60 కిలోమీటర్ల దూరం వరకు టెన్త్ పరీక్షల నిర్వహణకు విధులు కేటా యిస్తూ బుధవారం పాఠశాల విద్య కమిషనరేట్ నుంచి నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. విద్యాశాఖ నిర్వహిస్తున్న లీప్ యాప్ నుంచే నేరుగా సంబంధిత హెచ్‌ఎంలు, టీచర్ల మొబైల్ ఫోన్లకు జారీ అయిన అపాయింట్‌మెంట్ ఆర్డర్లు చూసుకుని లబోదిబోమంటు న్నారు. ఇక మరికొద్ది రోజుల్లో జరగనున్న ఇన్విజిలేటర్ల నియామకాల పైనా ఆటోమేషన్ ప్రభావం ఎలా ఉంటుం దోనన్న ఆందోళన టీచర్లలో నెలకొంది.
సీఎస్, డీవోల నియామకాలన్నీ గందరగోళమే
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జరగనున్నాయి. జిల్లాలో ఈ పరీక్షలకు మొత్తం 24,019 మంది బాలబాలికలు దరఖాస్తు చేసుకోగా, పరీక్షలు 133 కేంద్రాల్లో జరగనున్నాయి. ప్రతీ పరీక్ష కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్ (సీఎస్), డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ (డీవో)లను నియ మిస్తారు. పరీక్ష నిర్వహణలో వీరిద్దరిదీ కీలకపాత్ర. పరీక్ష కేంద్రంలో సమగ్ర ఏర్పాట్లను చేసుకోవడం, పరీక్షలు జరిగే రోజుల్లో విద్యాశాఖ రోజువారీ నిర్వహించే సెట్ కాన్ఫరెన్సుకు హాజరుకావడం, ఉన్నతాధికారులిచ్చే సూచనలు, ఆదేశాల అమలుకు కేంద్రంలో ఏర్పాట్లు చేసుకోవడం, ముఖ్యంగా పరీక్ష ప్రారంభ సమయానికి ముందుగా సంబంధిత పోలీసుస్టేషన్‌కు వెళ్లి ప్రశ్నపత్రాల బండిళ్లను పరీక్ష కేంద్రానికి భద్రంగా తీసుకురావడంలో వ్యక్తిగత బాధ్యత తీసుకోవడం, పరీక్ష నిర్వహణ సిబ్బంది అయిన ఇన్విజిలేటర్ల నుంచి వివరాలు తీసుకోవడం, మిగ తా శాఖలైన పోలీసు, వైద్యఆరోగ్యశాఖ, శానిటేషన్, మున్సి పల్/పంచాయతీరాజ్ సిబ్బంది విధులను పర్యవేక్షించడం, సమన్వయం చేసుకోవడం తదితర విధులన్నీ సీఎస్, డీవో లు చూసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రకారం పరీక్ష కేంద్రాని కి మిగతా సిబ్బంది కంటే ముందుగా సీఎస్, డీవోలే చేరుకోవడం, పరీక్ష ముగిసిన తర్వాత జవాబుపత్రాల బండిళ్లను పోస్టాఫీసులో పార్సిల్ చేసే వరకు వీరిద్దరూ ఒకరికొకరు సమన్వ యంతో బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. దీనికను గుణంగానే పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 6 నుంచి 7 గంటల్లోగా వీరు కేంద్రానికి చేరుకోవాలి. ఇన్ని కీలక బాధ్యతలున్న సీఎస్, డీవోలను సాధా రణంగా ప్రస్తు తం పనిచేస్తున్న స్కూలు ప్రాంతం నుంచి గరిష్ఠంగా 30 కిలోమీటర్ల దూరానికి లోబడి నియమిస్తుంటారు. దీనికి భిన్నంగా విద్యాశాఖ ఈ ఏడాది నుంచి టెన్త్ పరీక్షల సిబ్బందికి విధుల కేటాయింపునకు ప్రవేశ పెట్టిన ఆటోమేషన్ విధానం పూర్తిగా మార్చివేసింది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా తనవద్దవున్న టీచర్ల సమాచారం (టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం–టిస్) ఆధారం గా జిల్లా విద్యాశాఖతో సంబంధం లేకుండా, క్షేత్ర స్థాయిలో దూరాభారంతో నిమిత్తం లేకుండా అపాయింట్‌మెంట్ ఆర్డర్లు జారీ చేయడంతో ఒక్క సారిగా నిరసనలు తలెత్తాయి. టిస్ సమాచారం ఆధారంగా పరీక్షల సిబ్బంది నియామకాలను ర్యాండమ్‌గా చేసినపుడు క్షేత్రస్థాయిలో దూరాభారా లను పరిగణనలోకి తీసుకుంటే ఈ దుస్థితి వచ్చేదికా దని ఉపాధ్యాయవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా యి.
దిద్దుబాటలో విద్యాశాఖ
సీఎస్, డీవో/ఏడీవోల నియామకాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను గమనించకుండా బుధవారం అపాయిం ట్‌మెంట్ ఆర్డర్లు జారీ చేయడాన్ని నిరసిస్తూ ఏపీ హెచ్‌ఎంల సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్లపట్ల మురళీకృష్ణ, ఫ్యాప్టో జిల్లా చైర్మన్ గగ్గులోతు మోహన్ డీఈవో వెంకటలక్ష్మమ్మను, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ఆశను కలుసుకుని అభ్యంతరాలను తెలిపారు. లోపాలను సరిదిద్దాలని డిమాండ్ చేశారు. ఇదే విషయమై ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ఆశను వివరణ కోరగా.. ‘సుదూర ప్రాంతాలకు సీఎస్, డీవోల నియామకాలు జరిగాయని మా దృష్టికి వచ్చింది. ఇటువంటివి పరిశీలించేందుకు గురువారం సాయంత్రం 5 గంటల్లోగా తగిన ఆధారాలతో డీఈవో కార్యాల యానికి అభ్యర్థనలు పంపాలని సూచించాం. సహేతుకంగా వున్న అభ్యర్థనలను సరిదిద్దేందుకు ఉన్నతాధికారులకు నివేదిస్తా’మన్నారు.