Share News

కోరుకొల్లులో ఏటీఎస్‌ సెంటర్‌

ABN , Publish Date - Jun 26 , 2026 | 12:43 AM

పశ్చిమ గోదావరి జిల్లాకు ఆటోమేటిక్‌ టెస్టింగ్‌ స్టేషన్‌ (ఏటీఎస్‌)ను పాలకోడేరు మండలం కోరుకొల్లులో ఏర్పాటు చేయనున్నారు.

కోరుకొల్లులో ఏటీఎస్‌ సెంటర్‌
కోరుకొల్లులో నిర్మాణంలో ఉన్న ఏటిఎస్‌ సెంటర్‌

పశ్చిమలో వాహన తనిఖీ కేంద్రం

అమలాపురం, ఏలూరు,

మచిలీపట్నం వెళ్లే బాధ తప్పింది

మాన్యువల్‌కి చెక్‌.. ఇకపై ఆటోమెటిక్‌ టెస్టింగ్‌లు.. ప్రమాదాలకు చెక్‌

పాలకోడేరు, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లాకు ఆటోమేటిక్‌ టెస్టింగ్‌ స్టేషన్‌ (ఏటీఎస్‌)ను పాలకోడేరు మండలం కోరుకొల్లులో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటి వరకు జిల్లావాసులు కోనసీమ జిల్లా అమలాపురం, ఏలూరు, మచిలీపట్నం వెళ్లాల్సి వచ్చేది. ఇకపై వాహనదారులకు ఆ తిప్పలు తప్పనున్నాయి. కోరుకొల్లులో రెండు ఎకరాలకు పైగా వున్న విస్తీర్ణంలో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఆటోలు, వ్యాన్లు, బస్సులు, లారీలు ఇలా ప్రతీ వాహనాన్ని తనిఖీ చేసి సర్టిఫికెట్‌ ఇస్తారు. వచ్చే నెలలో దీనిని ప్రారంభిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.

ఏటీఎస్‌ సెంటర్‌ అంటే..

వాహనాల ఫిట్‌నెస్‌ను అత్యాధునిక యంత్రాల సాయంతో శాస్త్రీయంగా పరీక్షించే కేంద్రం ఏటీఎస్‌. పరీక్షల్లో పొరపాట్లకు తావు లేకుండా తద్వారా రోడ్డు ప్రమాదాలను నియంత్రించే ఉద్దేశంతో ఈ విధానాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందుబాటులోకి తెచ్చాయి. ఫిట్‌నెస్‌ లేని వాహనాలు రోడ్డు ఎక్కితే ప్రమాదాలు జరిగి ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. అందుకే వాహనాల ఫిట్‌నెస్‌ పరీక్షలపై ఆటోమేటిక్‌ టెస్టింగ్‌ స్టేషన్ల ద్వారా మాత్రమే వాహన సామర్థ్య పరీక్షలు చేసేలా కొత్త విధానం రూపొందించాయి. గతంలో వాహనాల కాలుష్యం, బ్రేకులు, ఇతర భద్రతా ప్రమాణాలను బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్లు తనిఖీ చేసేవారు. ఆ సమయంలో కొందరు తమ వాహనాలకు ఏదో రకంగా కండీషన్‌లో ఉన్నాయంటూ ధ్రువీకరణ పత్రాలు పొందేవారు. ఇకపై ఏటీఎస్‌ల ద్వారానే వీటిని నిర్వహిస్తున్నారు. ప్రతీ వాహనాన్ని ఆటోమెటిక్‌ టెస్టింగ్‌ సెంటర్‌లో ఉంచి ఇంజన్‌, చాస్‌ నెంబరు, స్కాన్‌ చేసి కంప్యూటర్‌కు అనుసంధానం చేస్తారు. కంప్యూటరైజ్డ్‌ ద్వారా ఇంజన్‌ పరిస్థితి, వాహనాల కండీషన్‌లను బట్టే ధ్రువీకరణ చేయనున్నారు. ఇందులో ఎటువంటి లోపం ఉన్నా సర్టిఫికెట్‌ ఇవ్వడం కుదరదు. ఈ సెంటరుకు చెకింగ్‌ కోసం వచ్చే సమయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ముందు, వెనుక ఏర్పాటు చేసిన నెంబరు ప్లేట్లు, వాహనాలకు ఏర్పాటు చేసిన అద్దాలు ఉండి తీరాలి. ఇవన్నీ ఏటీఎస్‌ ద్వారా తనిఖీ చేసి సర్టిఫికెట్‌ ఇస్తారు.

అభివృద్ధి దిశగా పాలకోడేరు

ఇప్పటికే భీమవరం జిల్లా కేంద్రంగా ఏర్పడింది. తర్వాత దీనిని ఆనుకొని వున్న పాలకోడేరు మండలం విస్సాకోడేరులో ఐసీడీఎస్‌ పీడీ కార్యాలయం, వన్‌స్టాప్‌ కౌన్సెలింగ్‌ కేంద్రాలు వెలిశాయి. తాజాగా కోరుకొల్లులో ఏటీఎస్‌ సెంటర్‌ ప్రారంభానికి సిద్దంగా వుంది. గొల్లలకోడేరులో టీడీపీ కార్యాలయం రానుండడంతో మండలం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది.

Updated Date - Jun 26 , 2026 | 12:43 AM