ఆశీలు దందా!
ABN , Publish Date - Feb 27 , 2026 | 12:33 AM
జం గారెడ్డిగూడెం మునిసిపాలిటీ పరిధిలో ఆశీలు దందా కొనసాగుతోంది. చిరు వ్యాపారులపై జులుం ప్రద ర్శిస్తూ రశీదులు ఇవ్వకుండా నిబంధనలకు విరు ద్ధంగా అసలు కంటే ఎక్కువగా చిరువ్యాపారుల వద్ద ఆశీలు వసూలు చేస్తున్నారు.
చిరు వ్యాపారులపై కాంట్రాక్టర్ అనుచరుల జులుం
నిత్యం రూ.50–100 చెల్లించాల్సిందే..
జంగారెడ్డిగూడెం మునిసిపాలిటీలో కొనసాగుతున్న వ్యవహారం
మార్చి 31తో ముగియనున్న కాంట్రాక్టు
జంగారెడ్డిగూడెం, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): జం గారెడ్డిగూడెం మునిసిపాలిటీ పరిధిలో ఆశీలు దందా కొనసాగుతోంది. చిరు వ్యాపారులపై జులుం ప్రద ర్శిస్తూ రశీదులు ఇవ్వకుండా నిబంధనలకు విరు ద్ధంగా అసలు కంటే ఎక్కువగా చిరువ్యాపారుల వద్ద ఆశీలు వసూలు చేస్తున్నారు. రోడ్లపక్కన బండ్లు పెట్టుకుని పలు రకాల వ్యాపారాలు చేసే చిరు వ్యాపారులు, సైకిళ్లు, ద్విచక్ర వాహనాలపై పండ్లు, కూరగాయలు, కొబ్బరి బొండాలు, ఆకుకూరలు అమ్ముకునే చిరు వ్యాపారుల వద్దకు ఆశీలు వసూలు చేసేవారు ఉదయమే వచ్చి బోణీ అవ్వకపోయినా ముందు వారికి పన్ను కట్టాల్సిందేనని జులుం ప్రద ర్శించడంతో చేసేదిలేక చెల్లిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు, మూడు గంటలు రాగి జావ అమ్ముకునే వారి నుంచి రూ.50 వసూలు చేస్తు న్నారు. బయట నుంచి పట్టణానికి సరుకు దింపడా నికి వచ్చే పార్శిల్ లారీలు, ఆటోలు, ఇసుక, గ్రావెల్ లారీల వంటి వాటి నుంచి నిబంధనలకు విరుద్ధంగా రూ.300 నుంచి రూ.400 వరకు వసూలు చేస్తున్నా రు. నిజానికి 20 చక్రాల లోడు లారీకి రూ.250 వసూలు చేయాలని గెజిట్‌లో పొందుపర్చగా ఆశీలు కాంట్రాక్టరు 12 చక్రాల లారీకే రూ.400 రశీదును తయారు చేసి అక్రమంగా వసూలు చేస్తున్నారు. మొక్కజొన్నపొత్తులు అమ్ముకునే గూడ్స్ ఆటోకు గెజిట్ ప్రకారం రూ.45 వసూలు చేయాల్సి ఉండగా రూ.80 వసూలు చేసి 12 చక్రాల లారీకి ఇచ్చే రూ.400 రశీదుపై రూ.ఎనభై అని రాసి ఇవ్వడం కొసమెరుపు. కూరగాయల బండికి రూ.25 వసూలు చేయాల్సి ఉండగా రూ.50 వసూలు చేస్తున్నారు. తినుబండారాల బళ్లకు రూ.25 వసూలు చేయాల్సి ఉండగా వారి నుంచి రూ.50 వసూలు చేస్తున్నారు.
యూనియన్‌లో ఉంటే రూ.పది చెల్లిస్తే చాలు..
స్థానిక తోపుడుబళ్ల వర్తక సంఘం యూనియన్ సభ్యత్వం తీసుకున్నవారికి ప్రతిరోజు రూ.10 మాత్రమే పన్ను వసూలు చేస్తుండగా సభ్యత్వం లేని చిరు వ్యాపారులెవరైనా సరే రూ.50 నుంచి రూ.100 చెల్లించాల్సిందే. ఇటువంటి దందా పట్టణంలో కొనసాగుతున్నా అఽధికారులు కనీసం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణంలో ఏ చిరు వ్యాపారి ఎంతపన్ను కట్టాలో తెలిపే బోర్డులు పట్టణంలో ఎక్కడా కన్పించవు.
రూ.43.12 లక్షలకు ఆశీలు పాట
2025–26 ఆర్థిక సంవత్సరానికి పట్టణానికి చెందిన గంటా వెంకట సూర్యనారాయణ సుమారు రూ.33.12 లక్షలు, ఇతర చార్జీలు మరో రూ.పది లక్షలతో కలిపి రూ.43.12 లక్షలకు ఆశీలు పాట వేలంలో దక్కించుకున్నారు.కాని వేలం దక్కించుకున్న వ్యక్తి కాకుండా వేరే వ్యక్తులు ఆశీలు వసూలు చేస్తున్నట్టు సమాచారం. గెజిట్ ప్రకారం చిరు వ్యాపారుల వద్ద తీసుకోవాల్సిన దానికంటే అదనంగా వసూలు చేస్తునట్టు బాధితులు చెబుతున్నారు. మార్చి31తో ప్రస్తుతం ఉన్న పాటదారుడి గడువు ముగియనుండడంతో మార్చి5న 2026–27 ఆర్థిక సంవత్సరానికి వేలం నిర్వహించనున్నట్టు కమిషనర్ ఇప్పటికే ప్రకటన విడుదల చేశారు.
భారంగా ఉంది..
నా భర్త ఇటీవల అనారోగ్యానికి గురై పనికి వెళ్లలేకపోవడంతో కుటుంబ పోషణ భారమైం ది. ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఉదయం రాగిజావ, ఉడకబెట్టిన కోడి గుడ్లు, ఫ్రూట్ సలాడ్ విక్రయిస్తున్నాను. మునిసిపాలిటీ పన్ను అని చెప్పి రోజూ నా నుంచి రూ.50 వసూలు చేస్తున్నారు. భారంగా ఉంది. రశీదులు ఇవ్వరు.
– హారిక, చిరు వ్యాపారి
రశీదు ఇవ్వరు..
పట్టణంలో 20 మందికి పైగా ఉన్న మేము వేర్వేరు గ్రామాలనుంచి కొబ్బరి బొండాలను ద్విచక్ర వాహనంపై తెచ్చి అమ్ముకుంటాం. ప్రతిరోజూ మునిసిపాలిటీ పన్ను నిమిత్తం రూ.50, గురువారం రూ.60 వసూలు చేస్తారు. దేనికీ రశీదు ఇవ్వరు. వ్యాపారం ఉన్నా లేకపోయినా పన్ను చెల్లించకపోతే ఊరుకోవడం లేదు.
– ఎం.సువర్ణరాజు/బొమ్మగాని శ్రీను, కొబ్బరి బొండాల వ్యాపారులు
పన్ను కట్టాల్సిందే..
నాకొచ్చే ఆదాయం రోజుకు రూ.300 మించదు.. ఒక్కొక్కసారి అదీ రాదు. నిత్యం రూ.50 పన్ను చెల్లిస్తున్నాను. అందరం కలి సి అధికారులను మా సమస్య చెబుదా మంటే రోడ్డుమీద బండి పెట్టుకోనివ్వరే మోనని భయపడి ఎవరూ రావడం లేదు.
–వేమా రమేష్, కూరగాయల బండి
విచారణ జరుపుతాం..
పట్టణంలో చిరు వ్యాపారుల వద్ద నుంచి గెజిట్ ప్రకారం కాకుండా నిబంధనలకు విరుద్ధంగా రశీదులు ఇవ్వకుండా అదనంగా ఆశీలు వసూలు చేస్తున్నట్టు నా దృష్టికి రాలేదు. విచారణ చేసి నిజమని తేలితే ఆశీలు పాటదారుడి లైసెన్సు రద్దు చేసి అతనిపై చర్యలు తీసుకుంటాం.
– కెవి.రమణ, కమిషనర్, జంగారెడ్డిగూడెం