శుభకార్యాలకు విరామం..
ABN , Publish Date - Jul 14 , 2026 | 12:03 AM
ఆషాఢ మాసాన్నే శూన్యమాసం అని కూడా అంటారు. ఆషాఢం మంచిది కాదనే భావన చాలామందిలో ఉంది. ఈ మాసంలో వివాహాలు, ఇతర శుభకార్యాలు జరపడానికి ఇష్టపడరు. అయితే దైవారాధన, జపం, తపస్సు, వ్రతాలు, గురు పూజలకు మాత్రం ఈ మాసం అత్యంత శ్రేష్టమైంది.
శుభకార్యాలకు విరామం..
– ద్వారకాతిరుమల/గణపవరం : ఆషాఢ మాసాన్నే శూన్యమాసం అని కూడా అంటారు. ఆషాఢం మంచిది కాదనే భావన చాలామందిలో ఉంది. ఈ మాసంలో వివాహాలు, ఇతర శుభకార్యాలు జరపడానికి ఇష్టపడరు. అయితే దైవారాధన, జపం, తపస్సు, వ్రతాలు, గురు పూజలకు మాత్రం ఈ మాసం అత్యంత శ్రేష్టమైంది. ఈ సమయంలో రైతులంతా వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు. వర్షాల కారణంగా ప్రయాణాలు, శుభకార్యాల నిర్వహణ కష్టంగా ఉండేది. అందుకే ఈ నెలలో శుభకార్యాలకు విరామమిచ్చారు. అంతే తప్ప ఆషాఢం చెడ్డదని కాదు.. సూర్యుడు మిధునరాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. దీంతో ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి దక్షిణాయనం మొదలవుతుంది. ఆషాఢం జూలై 15 పాడ్యమి నుంచి ప్రారంభమై ఆగస్టు 12 అమావాస్యతో ముగుస్తుంది.
జ్యోతిష్యశాస్త్రం ఏం చెబుతుంది ?
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆషాఢాన్ని దక్షిణాయన ప్రారంభమాసంగా పేర్కొంటారు. తెలుగు మాసాల్లోని నాలుగో నెల వర్షాలు ప్రారంభానికి సంకేతం ఈ మాసం. ఈ నెలలో శ్రీమహావిష్ణువుకు ఎంతో ఇష్టమైన తొలి ఏకాదశి పర్వదినం మొదలవుతుంది. ఆషాఢం నుంచి శ్రీమహావిష్ణువు యోగ నిద్రలో ఉండటంతో ఈ మాసంలో వచ్చే ఏకాదశిని శయన ఏకాదశి లేదా తొలి ఏకాదశి అంటారు. ఈ నెలలో శ్రీమహావిష్ణువు దేవశయని ఏకాదశి రోజున నిద్రలోకి వెళ్తారని నమ్మకం. అందుకే ఈ సమయం నుంచి ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు.
గోరింటాకు విశిష్టత ఏంటి?
ఈ మాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకునే సంప్రదాయం ఉంది. వేసవి ముగిసి వానాకాలం మొదలయ్యే మధ్యలో వచ్చే ఆషాఢాన్ని సంధిమాసం అని కూడా అంటారు. ఆషాఢంలో వర్షాలు కురవడం వల్ల వచ్చే మార్పులతో క్రిమి కీటకాలు విజృంభించి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి ఈ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు. ఇది పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం.
ఆషాఢంలో చేయకూడని పనులు
ఆషాడంలో సూర్యుని గమనం వల్ల వాతావరణంలో మార్పులు వస్తాయి. అందుకే ఆషాఢంలో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, తలనీలాలు తీయడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఈ మాసంలో దేవతలు నిద్రావస్థకు చేరుకుంటారు. అందువల్ల ఈ సమయంలో చేసే శుభకార్యాలకు దైవ ఆశీస్సులు లభించవని నమ్ముతారు. ఆషాఢం నెల రోజుల పాటు కొత్తగా పెళ్లయిన జంటలు దూరంగా ఉండేలా జాగ్రత్త పడతారు. అత్తాకోడళ్లు ఎదురు పడకూడదని ఒకే గడప దాటకూడదనే ఆచారం ఉంది. అయితే దీని వెనుక కూడా శాస్త్రీయ పరమైన కారణాలున్నాయని పెద్దలు చెబుతారు. ఆషాఢంలో నూతన వధువును పుట్టింటికి తీసుకెళ్లే ఆచారం ఇప్పటికీ ఉంది. దీనికి ప్రధానకారణం ఈ నెలలో స్త్రీ గర్భం ధరిస్తే 9 నెలల తర్వాత మార్చి, మే మధ్యకాలంలో ప్రసవం జరుగుతుంది. ఈ సమయంలో ఎండలు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. పుట్టిన శిశువుకు శ్రేయస్కరం కాదని ఈ ఆచారాన్ని ఇప్పటికీ ఆచరిస్తున్నారు.
ఆషాఢంలో వచ్చే ముఖ్యమైన పండుగలు
ముదినేపల్లి/ద్వారకాతిరుమల : ఆషాఢ శుద్ధ విదియనాడు ఒరిస్సాలోని పూరిలో ఎంతో ప్రసిద్ధి చెందిన జగన్నాథ రథయాత్ర కన్నుల పండువగా జరుగుతుంది. ఈ నెల 16 నుంచి ప్రారంభమై 9రోజుల పాటు జరుగుతుంది. ఈ క్రమంలో ద్వారకాతిరుమలలోని పురాతన ఆలయం లక్ష్మీపురంలోని జగన్నాథ వెంకటేశ్వర స్వామి ఆలయంలోనూ అదే రోజున రథయాత్ర నిర్వహించనున్నారు.. ఏటా పూరీ క్షేత్రంలో నిర్వహించిన విధంగానే శ్రీవారి దేవస్థానం వైభవంగా నిర్వహించనుంది. పూరీ నుండి తెచ్చిన సుభద్ర, బలభద్ర, జగన్నాథుల దారు విగ్రహాలు ఉత్సవక్రతువులో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. దక్షిణపూరీగా ప్రసిద్ధి గాంచిన ముదినేపల్లి మండలం వడాలి గ్రామంలోని సుభద్ర బలరామసహిత జగన్నాథస్వామి దేవస్థానంలో ఈ నెల 16న రథయాత్ర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒరిస్సాలోని పూరి జగన్నాథుడి రథయాత్ర ముగింపు రోజున ఏటా వడాలిలో రథయాత్ర నిర్వహిస్తారు. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ వీరమల్లు రత్నకుమారి, సభ్యులు, ఈవో సింగనపల్లి శ్రీనివాసరావు రథయాత్ర ఏర్పాట్లపై సోమవారం సమీక్షించారు. ఈ సారి తొలి ఏకాదశి 25వ తేదీన జరుపుకోనున్నారు. ఈ తొలి ఏకాదశి పర్వదినం నాడు విష్ణువును నిష్టతో పూజిస్తారు. ఉపవాసాలు ఉండి విష్ణుసహస్రనామాలు పఠిస్తారు. అలాగే ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపౌర్ణమి జరుపుకుంటారు. వేదవ్యాసుడు ఈ గురుపౌర్ణమి రోజునే జన్మించారని, వేదాలను విభజించారని చెప్పుకుంటారు. ఈ నెల 29న గురుపౌర్ణమి జరుపుకోనున్నారు.