రొయ్య రైతులు రోడ్డెక్కారు..
ABN , Publish Date - May 23 , 2026 | 12:33 AM
భీమవరం– పాల కొల్లు రహదారిలో పూలపల్లి వైజంక్షన్ వద్ద ఆక్వా రైతుల శుక్రవారం తమ చెర్వుల్లోని రొయ్యలను తీసుకొచ్చి రోడ్డుపై పారబోసి నిరసన వ్యక్తం చేశారు. ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాలకు చెందిన రైతులు మండు టెండలో మానవహారం నిర్వహించారు.
రోడ్డుపై రొయ్యలు పారబోసి నిరసన
పాలకొల్లులో మండుటెండలో ఆందోళన
పాలకొల్లు మే 22(ఆంధ్రజ్యోతి) :‘‘ఆక్వా రంగంలో సిండికేట్ వ్యవస్ధ రాజ్యమేలుతోంది. ఆరుగాలం శ్రమిస్తున్న మాకు అన్నీ నష్టాలే.. ఒక పక్క మేత ధరలు పెంపు, మరోపక్క రొయ్య ధర కిలోకు రూ.50 తగ్గింపుతో రోజు రోజుకు ఆర్థికంగా నష్టపోతున్నాం.. ఇక ఆత్మ హత్యలే శరణ్యం..’’ అంటూ శుక్రవారం మండు టెండలో భీమవరం– పాల కొల్లు రహదారిలో పూలపల్లి వైజంక్షన్ వద్ద ఆక్వా రైతుల తమ చెర్వుల్లోని రొయ్యలను తీసుకొచ్చి రోడ్డుపై పారబోసి నిరసన వ్యక్తం చేశారు. ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాలకు చెందిన రైతులు మానవహారం నిర్వహించారు. సిండికేట్ వ్యవస్థపై చర్యలు తీసుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటూ మెడకు ఉరితాళ్లు బిగించుకుని నిరసన తెలిపారు. పాలకొల్లు జైభారత్ క్షీరారామ ఆక్వా సంఘం చైర్మన్ గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు మాట్లాడుతూ ఆక్వా ఫీడ్, సీడ్ ప్యాక్టరీలు, ప్రోసెసింగ్ యూనిట్లు, కొనుగోలుదారుల సిండికేట్ వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కిలో రూ.270 ఉంటే రూ.220లకు కొనుగోలు చేస్తున్నారని కిలోకు రూ.50 నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీడ్ కంపెనీలు తరచూ ఽధరలు పెంచడంతో ఆక్వా సంఘాలు ఆందోళన చేస్తుంటే ఽధరలు తగ్గించినట్టు తగ్గించి మళ్లీ వారానికో పదిహేను రోజులకో పెంచేస్తున్నారని మళ్లీ ఇప్పుడు టన్నుకు రూ.8 వేలు ధర పెంచడం రైతుకు భారంగా మారిందన్నారు.భవిష్యత్తులో ఆక్వా సాగు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడనున్నదని ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సంఘ నాయకులు బోనం చినబాబు, గుంటూరి చంటిరాజు, మేడిద జాన్ డేవిడ్‌రాజు, రుద్రరాజు సత్యనారాయణ రాజు, కనపర్తి చిన్న, పెన్మెత్స సత్యనారాయణరాజు, ఆక్వా రైతులు పాల్గొన్నారు.