Share News

మంచినీటి చెరువుల్లో దర్జాగా ఆక్వా సాగు..!

ABN , Publish Date - May 24 , 2026 | 01:07 AM

కైకలూరు మండలం లో కొల్లేరు గ్రామాలకు తాగునీరందించే పెంచికలమర్రు లోని సీపీడబ్ల్యూఎస్‌ స్కీమ్‌లో 40 ఎకరాల్లో అక్రమంగా చేపలు, రొయ్యల సాగు నిరాటకంగా సాగిపోతోంది.

మంచినీటి చెరువుల్లో దర్జాగా ఆక్వా సాగు..!
పెంచికలమర్రులో అక్రమంగా ఆక్వా సాగు చే స్తున్న చెరువులు

పట్టుబడుల్లో వారికీ వాటాలు..?

కలెక్టర్‌కు తప్పుడు రిపోర్టు ఇచ్చారంటూ విమర్శలు

ఏలూరు, మే 23 (ఆంధ్రజ్యోతి):కైకలూరు మండలం లో కొల్లేరు గ్రామాలకు తాగునీరందించే పెంచికలమర్రు లోని సీపీడబ్ల్యూఎస్‌ స్కీమ్‌లో 40 ఎకరాల్లో అక్రమంగా చేపలు, రొయ్యల సాగు నిరాటకంగా సాగిపోతోంది. మంచినీటి చెరువు పరిసరాల్లో ఆక్వా కల్చర్‌ చేయ కూడదు. ఈ విషయంలో కలెక్టర్‌ కె.వెట్రిసెల్వికి ఈనెల 4న పీజీఆర్‌ ఎస్‌ ద్వారా ఒక వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీనిపై తూతూ మంత్రంగా ఈనెల 15న ఆర్‌డబ్ల్యూఎస్‌, ఇతర అధికారు లు పరిశీలించి అక్కడ ఆక్వా సాగు జరగడం లేదని నివేదిక ఇచ్చారు. దీనిపై 18న ఫిర్యాదు దారుడు తాను చేసిన ఫిర్యాదు వాస్తవమేనని, లేనిపక్షం లో తనపై చర్యలు తీసుకోవచ్చని మరోమారు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో శనివారం జిల్లా ఫిషరీస్‌ జేడీ రాజ్‌కుమార్‌, ఏలూరు ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ కడియాల శ్రీనివాసరావు, తహసీల్దార్‌ పరిశీలించి ఇక్కడ సాగు జరగట్లేదని, వరదల సమయంలో వచ్చిన రొయ్యలే అంటూ నివేదిక ఇచ్చినట్టు తెలిసింది.

అక్రమ సాగుదారుడు వాటాల పంపిణీ ?

ఇదిలా ఉండగా అధికారులు శనివారం విచారణకు వస్తారని సమాచారం అందుకున్న అక్రమంగా సాగు చేస్తున్న వ్యక్తి భారీగా రొయ్యల పట్టుబడిని శుక్రవారం చేపట్టాడు. ఇందులో రూ.15 లక్షల పైబడి అందరికి వాటాలు పంచి గుట్టుచప్పుడు కాకుండా చెరువు ఖాళీ చేసినట్టు సమాచారం. వాస్తవాలు వెలికితీయాల్సిన అధి కారులకూ వాటాలు పంచారన్న ఆరోపణలు వ్యక్తమవు తున్నాయి. కొల్లేరులోని పలుగ్రామాలకు 60 ఎకరాల్లో విస్తరించిన మూడు చెరువుల ద్వారా నీటి సరఫరాను చేయాల్సి ఉండగా, కేవలం 20 ఎకరాల ఒక చెరువు ద్వారానే లంకగ్రామాలకు నీటి సరఫరాకు శుద్ధి చేసి పంపుతున్నారు. మిగిలిన 40 ఎకరాల విస్తీర్ణంలో రెండు చెరువులకు గాను ఒక చెరువులో చేపలు, రెండో చెరువు లో రొయ్యల సాగు చేసున్నారు. తాజాగా శనివారం విచారణలో కొందరు వ్యక్తులు అధికారులపై నిలదీత పర్వం చేపట్టారు. తాము సాగు చేయట్లేదని బుకాయిం చినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై కలెక్టర్‌ వెట్రిసెల్వి ఏ చర్యలు తీసుకుంటారో అన్నది ఆసక్తి కరంగా మారిం ది. విచారణకు వచ్చే సమయంలో అందుబాటులో ఉండాల్సిన కైకలూరు డివిజన్‌ ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ సెలవులో ఉండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - May 24 , 2026 | 01:07 AM