ఆక్వా రైతులు ఎక్కడ?
ABN , Publish Date - Feb 16 , 2026 | 12:04 AM
జిల్లా వ్యాప్తంగా 1,31,436 ఎకరాల్లో ఆక్వా సాగు విస్తరించి ఉంది. 90వేల ఎకరాల్లో రొయ్య, 41 వేల ఎకరాలకు పైగా చేపల సాగు చేస్తున్నారు.
గడువు ముగిసినా అప్సడా రిజిస్ట్రేషన్లు పెండింగ్
ఇప్పటివరకు 71 వేల ఎకరాలు నమోదు
25 వేల ఎకరాలకు నిబంధనలు అడ్డు
కొల్లేరు కాంటూరు, ఉప్పుటేరు బెడ్ కారణం
ఆక్వా చెరువులను అప్సడాలో రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. గడచిన ఏడాది నుంచి మత్స్యశాఖకు లక్ష్యాన్ని నిర్దేశిస్తూ వస్తోంది. కలెక్టర్ నాగరాణి సైతం పదే పదే సమీక్షలు నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్‌కు గడువు పెంచుతూ వచ్చారు. చివరకు ఫిబ్రవరి పది లోపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినా ఆక్వా రైతులు అందు బాటులో లేరు. కొందరు హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం తదితర నగరాల్లో స్థిరపడితే మరి కొందరు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుం టున్నారు. ఫలితంగా ఆక్వా చెరువుల రిజిస్ట్రేషన్ కష్టతరమవుతోంది.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
జిల్లా వ్యాప్తంగా 1,31,436 ఎకరాల్లో ఆక్వా సాగు విస్తరించి ఉంది. 90వేల ఎకరాల్లో రొయ్య, 41 వేల ఎకరాలకు పైగా చేపల సాగు చేస్తున్నారు. సాగు ఏదైనా అప్పడాలో ఆక్వా చెరువుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 71,884 ఎకరాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. భవిష్యత్ లో ప్రభుత్వం అందించే రాయితీలు వర్తించాలంటే రిజిస్ట్రేషన్ ఉండాల్సిందే. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై కృతనిశ్చయంతో ఉంది. జిల్లా అధికారులు రిజిస్ట్రేషన్‌పై దృష్టి సారించినా రైతులు స్థానికంగా లేకపోవడంతో లక్ష్యం చేరలేదు.
క్షేత్రస్థాయిలో సబ్ లీజు రైతులు
అప్సడాలో నమోదు కావాలంటే దస్తావేజులు ఉండాలి. ప్రస్తుతం లీజుదారులు అందుబాటులో ఉంటున్నారు. కొన్ని చెరువులను లీజుదారులే సబ్ లీజుకు కూడా ఇచ్చేశారు. ఫలితంగా దస్తావేజులు అందుబాటులో ఉండడం లేదు. దీనితో మత్స్యశాఖ అధికారులు రైతులను రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. రైతులంతా అందుబాటులో ఉండాలి లేదా దస్తావే జులు ఇవ్వాలి. జాయింట్ ఎల్‌పి నంబర్లు ఎంతో అవసరం. అయినా భూయజమానులు దీనిపై శ్రద్ధ చూపడం లేదు.
కాంటూరు పరిధిలో ఉంటే..?
కొల్లేరు కాంటూరు, ఉప్పుటేరు బెడ్‌లో విస్తరించి ఉన్న ఆక్వా చెరువులు రిజిస్ట్రేషన్‌కు నిబంధనలు అడ్డంకిగా మారాయి. కొల్లేరు ఐదో కాంటూరు, ఉప్పుటేరు బెడ్‌లో 25వేల ఎకరాలు విస్తరించి ఉన్నాయి. కాంటూరును కుదిస్తేనే రిజిస్ట్రేషన్‌కు అవ కాశం ఉంటుంది. మరోవైపు ఉప్పుటేరు బెడ్‌ను పరిరక్షించడా నికి మత్స్యశాఖ ప్రయత్నాలు చేస్తోంది. మొగల్తూరు, భీమవరం మండలాల పరిధిలోని ఉప్పుటేరు బెడ్‌లో మడ అడవులను పెంచేలా చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో దాదాపు 1000 ఎకరాల్లో మడ అడవులు విస్తరించి ఉన్నాయి. వాటిని మరింత అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో అటవీ శాఖ రెవెన్యూ శాఖ కు ప్రతిపాదన పంపింది. అటవీ శాఖ పరిధిలోకి మడ అడవులను అప్పగించాలని కోరింది. అటవీ శాఖ ప్రయత్నాలు ఫలిస్తే జిల్లాలోని సముద్ర తీరం, ఉప్పుటేరు తీర ప్రాంతంలో మడ అడవులు విస్తరణకు అవకాశం ఉంటుంది. తీర ప్రాంతం లో రొయ్య, ఆక్వా సాగుతోపాటు, పశ్చిమ డెల్టా పరిరక్షణకు మడ అడవులు దోహద పడనున్నాయి. ఆ దిశగా మత్స్యశాఖ చర్యలు తీసుకుంటోంది. ఒకవైపు రిజిస్ట్రేషన్‌కు ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు ఉప్పుటేరు బెడ్‌లో చెరువులకు బదులుగా మడ అడవుల పెంపకంపై మత్స్యశాఖ ప్రణాళిక రచించింది.