Share News

నిట్‌.. హిట్‌ అయ్యేనా ..

ABN , Publish Date - Aug 04 , 2026 | 12:18 AM

ఆంధ్ర రాష్ట్రానికే ఆభరణంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఏపీ నిట్‌) 11 వసంతాలు పూర్తి చేసుకుంది.ఎనిమిదో బ్యాచ్‌ బీటెక్‌, ఎంటెక్‌ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసేందుకు మంగళవారం నిర్వహించే స్నాతకోత్సవానికి నిట్‌ ముస్తాబైంది.

నిట్‌.. హిట్‌ అయ్యేనా ..

రెగ్యులర్‌ డైరెక్టర్‌ నియామకంతోనే పూర్వ వైభవం

వెంటాడుతున్న అధ్యాపకులు, నిధుల కొరత

విద్యార్థులు ప్లేస్‌మెంట్స్‌లో సత్తా చాటుతున్నా..

పడిపోతున్న సీట్ల సంఖ్య.. ఏపీ విద్యార్థులకు నష్టం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి..

నేడు ఎనిమిదో స్నాతకోత్సవం..

సమస్యల పరిష్కారంపై స్పష్టత వచ్చేనా..

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

ఆంధ్ర రాష్ట్రానికే ఆభరణంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఏపీ నిట్‌) 11 వసంతాలు పూర్తి చేసుకుంది. రాష్ట్ర పునర్విభజన చట్టం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం 2015వ సంవత్సరం తాడేపల్లిగూడెంలో 31వ నిట్‌గా 172.6 ఎకరాల విస్తీర్ణంలో దీనిని స్థాపించింది. బీటెక్‌, ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సులను ఆఫర్‌ చేస్తోంది. ఎనిమిదో బ్యాచ్‌ బీటెక్‌, ఎంటెక్‌ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేసేందుకు మంగళవారం నిర్వహించే స్నాతకోత్సవానికి నిట్‌ ముస్తాబైంది. కొన్నేళ్లుగా రెగ్యులర్‌ డైరెక్టర్‌ లేకపోవడంతో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ వెనుకబడుతోంది.

బీటెక్‌, ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సులు

బీటెక్‌, ఎంటెక్‌, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు వున్నాయి. అండర్‌ గ్రాడ్యుయేట్‌ (బీటెక్‌)లో సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌, కెమికల్‌ ఇంజనీరింగ్‌, మెటలర్జికల్‌ మెటీరియల్స్‌ ఇంజనీరింగ్‌, బయో టెక్నాలజీ కోర్సులు, పోస్టు గ్రాడ్యుయేట్‌ (ఎంటెక్‌)లో కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ర్టానిక్స్‌, పవర్‌ ఎలక్ర్టానిక్స్‌, థర్మల్‌ ఇంజనీరింగ్‌, స్ట్రక్చరల్‌ ఇంజనీరింగ్‌ తదితర విభాగాలు వున్నాయి. పీహెచ్‌డీ, ఎంఎస్‌ (రీసెర్చ్‌) ప్రోగ్రామ్స్‌ వున్నాయి. బీటెక్‌ సీట్లను జేఈఈ మెయిన్‌ ర్యాంక్‌ ఆధారంగా జోసా/ సీఎస్‌ఏబీ కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేస్తారు. దేశంలోని వేర్వేరు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఇందులో చేరేందుకు పోటీపడ తారు. ఈ కారణంగా భిన్న సంస్కృతుల సమ్మేళనంగా క్యాంపస్‌ కనిపిస్తుంది. ఎనిమిది కోర్సులతో ప్రారంభమై.. ఇప్పటివరకు ఎనిమిది బ్యాచ్‌లు ఇంజనీరింగ్‌ డిగ్రీలను పూర్తి చేశాయి. అనతి కాలంలోనే నిట్‌ దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. దక్షిణాదిలోనే నెంబర్‌–1 విద్యా సంస్థగా 2021 విద్యా సంవత్సరంలో అవార్డును సొంతం చేసుకుంది. బోధన, అధ్యయన రంగంలో ప్రగతిపథంలో పయనిస్తోంది.

ప్లేస్‌మెంట్‌ల్లో రికార్డు

విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్‌ ఇవ్వడంలోనే తనదైన ముద్ర వేసుకుంది. సగటు ప్యాకేజీ సంవత్సరానికి రూ.7 లక్షల నుంచి రూ.45 లక్షలతో విద్యార్థులు ఉద్యోగాలు పొందారు.ఇక్కడి విద్యార్థులు. నిట్‌లో చదువుకున్న ప్రతి విద్యార్థికి ఉద్యోగం సాధించేలా ప్లేస్‌మెంట్‌ సెల్‌ కృషి చేస్తోంది. విద్యార్థులు ప్రధానంగా అమెజాన్‌, డెలైటీ, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, ఎల్‌అండ్‌టీ, అక్సెన్‌చర్‌, కేప్‌ జెమిని, ఏఎండీ మొదలైన ఐటీ, కోర్‌ ఇంజనీరింగ్‌ సంస్థల్లో ఉద్యోగాలు సాధించారు.

డైరెక్టర్‌ లేకపోవడంతో..

నిట్‌కు రెగ్యులర్‌ డైరెక్టర్‌ లేకపోవడం.. దీని అభివృద్ధికి అవరోధంగా మారింది. నిధులు, సీట్లు,భవనాల నిర్మాణం, ప్లేస్‌మెంట్స్‌ వంటివి సరిగా జరకపోవడం పెద్ద సమస్యగా మారింది. రెగ్యులర్‌ డైరెక్టర్‌ లేకపోవడం వల్ల నాలుగేళ్ల క్రితం కేంద్రం మంజూరు చేసిన అధ్యాపక పోస్టులను ఇప్పటికీ భర్తీ చేయలేదు. అకడమిక్‌ భవనాలు, హాస్టల్స్‌, ఫ్యాకల్టీ భవనాలు, పరిశోధన కేంద్రాలు నిర్మించేందుకు రూ.400 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదించినా కేంద్రం మంజూరు చేయలేదు. నిట్‌ 750 సీట్ల వరకు వెళ్లి 480 సీట్లకు పడిపోయింది. ఫ్యాకల్టీ లేకపోవడం, హాస్టల్‌ వసతి వంటి సమస్యలతో ఈ సీట్లను కుదించారు. ఈ ఏడాది రూ.27 కోట్లు మంజూరుచేశారు. ల్యాబ్‌ల అభివృద్ధికి వాటిని వెచ్చించ నున్నారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నేషనల్‌ ఇనిస్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ప్రేమ్‌ వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) ర్యాంకింగ్స్‌లోను కాస్త వెనుకబాటు కనిపిస్తోంది. రెగ్యులర్‌ డైరెక్టర్‌ నియామకం లేకపోవడం వల్ల ఇలా నిట్‌ను అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. కేంద్రం ఇటీవల డైరెక్టర్‌ నియామకానికి ఇప్పటికే ఇంటర్వ్యూలు పూర్తిచేసింది. త్వరలోనే నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో రెగ్యులర్‌ ఫ్యాకల్టీని, అవసరమైన నిధులను మంజూరు చేసినప్పుడే దీనికి పూర్వవైభవం సంతరించుకుంటుంది. ఎనిమిదో స్నాతకోత్సవానికి సిద్ధమవుతున్న ఈ విద్యా సంస్థపై కేంద్రం, రాష్ట్రం ప్రత్యేక దృష్టి సారించాలని విద్యార్థులు కోరుతున్నారు.

Updated Date - Aug 04 , 2026 | 12:18 AM