Share News

ఎరువుల యాప్‌

ABN , Publish Date - Jun 08 , 2026 | 12:25 AM

వ్యవసాయ రంగంలో రైతులకు చేయూతనిచ్చేవిధంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది.

ఎరువుల యాప్‌

అమ్మకాలలో పారదర్శకత

యాప్‌లో రైతుల సాగు వివరాలు

అవసరమైన ఎరువుల కోటా నిర్ణయం

ప్రస్తుత సార్వా నుంచి కొత్త విధానం

భీమవరం రూరల్‌, జూన్‌ 7(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ రంగంలో రైతులకు చేయూతనిచ్చేవిధంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇప్పుడు సాగుకు ఉపయోగించే ఎరువులు అందించడంలో పారదర్శకతను తీసుకువచ్చింది. ఎరువుల అమ్మకాలలో తప్పుదోవ పట్టకుండా రైతులకు సరిపడా అందించేలా నూతన విధానం అందుబాటులోకి తెచ్చింది. దానిని ఈ సార్వా పంట నుంచి అమలు చేయనుంది. ఎరువుల విక్రయాలకు ఒక యాప్‌ను రూ పొందించారు. జిల్లాలో ఉన్న 291రైతు సేవా కేంద్రాలు (ఆర్‌ఎస్‌కే) 450 ప్రైవేట్‌ ఎరువుల షాపులకు ఏపీ అగ్రి కల్చర్‌ ఇన్ఫర్మేషన్‌ మోనటరింగ్‌ సిస్టమ్‌ (ఏపీఏఐఎంఎస్‌) యాప్‌ను అందుబాటులోకి తెస్తారు. దానిలో వరిసాగు, ఇతర పంటలకు సంబంధించిన 1.30 లక్షల రైతుల వివరాలు నమోదై ఉంటాయి. రైతు ఆధార్‌ నెంబర్‌ యాప్‌లో నమోదు చేస్తే సాగు విస్తీర్ణం, పంట తెలుస్తుంది. సాగుకు ఏ కోటాకు ఎంత ఎరువులు ఇవ్వాలనేది యాప్‌లో చూపిస్తుంది. అన్ని ఎరువులు సంబంధిత ఆర్‌ఎస్‌కే, ప్రైవేట్‌ షాపుల ద్వారా విక్రయించాలి. ఎక్కువ ఇవ్వడానికి, తగ్గించి ఎరువులు ఇవ్వడం వీలుకాదు. ఈ విధానం వల్ల రైతులకు సాగుకు కావలసిన ఎరువులు సరిపడగా అందుకోవడనికి అర్హులుగా నిలుస్తారు.

సబ్సిడీ పక్కదారి పట్టకుండా

పలు రకాల పంటలు పండించే రైతన్నలకు చేయూతనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఎరువులపై వేల రూపాయలు సబ్సిడీ ఇస్తోంది. ఎరువుల అమ్మకాలలో సబ్సిడీ పక్కదారి పరిపాటిగా మారింది. అవసరమైన ఎరువుల కొరతతో రైతులు కంగారు పడుతున్నారు. యాప్‌ సబ్సిడీ పక్కదారి పట్టడం కట్టడి అవుతుంది. జిల్లా యంత్రాంగం చొరవతో రైతులకు సరిపడా యూరియా అందింది. ఏపీ ఏఐఎంఎస్‌ యాప్‌ ఇబ్బందులు రాకుండా చేస్తుంది.

ఎప్పుడూ కొనుగోలు చేసే దుకాణాల్లోనే..

వ్యవసాయం, ఇతర పంటలు పండించే రైతులు వారికి అందుబాటులో ఉండే షాపులు, ఆర్‌ఎస్‌కేలలోనే ఎరువులు కొనుగోలు చేస్తారు. కొత్తగా వచ్చిన యాప్‌తో వారికి కావలసిన షాపులో ఎరువులు కొనుగోలు చేయవచ్చు. గతంలో ఎరువులు తీసుకున్న షాపులోని యాప్‌లో రైతు వివరాలు ఉంటాయి. నిర్ణయించిన చోటనే కొనుగోలు చేయాలని లేదు. దీనితో రైతుకు సరిపడా ఎరువులు వారు అనుకున్న షాపులో కొనుగోలు చేసుకోవచ్చు. రైతులకు సంబంధించిన స్టాకు ఆ షాపుకు పంపించడం జరుగుతుంది.

సార్వాకు అవసరమైన ఎరువులు

జిల్లాలో ఈ ఏడాది 2.2 లక్షల ఎకరాల్లో సార్వా సాగు జరగనుంది. సాగుకు కోటాల వారీగా ఎరువులు వేస్తారు. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం యూరియా 17,391 టన్నులు, డీఏపీ 1530 టన్నులు, 14–35–14, 28–28–0 వంటి కాంప్లెక్స్‌ ఎరువులు 16,127 టన్నులు అవసరం. వాటితోపాటు పొటాష్‌ 4177 టన్నులు, సూపర్‌ 4100 టన్నులు, అల్యూమినియం సల్ఫేట్‌ 335 టన్నులు కావాలి.

సార్వా సీజన్‌ నుంచే..

ఏపీ ఏఐఎంఎస్‌ యాప్‌ ద్వారా ఈ సార్వా పంట నుంచి ఎరువులు అమ్మకాలు జరుగుతాయి. దానిలో రైతులు చేసే సాగును బట్టి ఎరువులు ఎన్ని తీసుకోవాలి నిర్ణయిస్తారు. ఎరువులు పక్కదారి పట్టకుండా రైతులకు సక్రమంగా ఎరువులు అందడానికి ఈ యాప్‌ ఉపయోగపడుతుంది. అన్ని షాపులు ఆర్‌ఎస్‌కేలలో యాప్‌ ద్వారానే ఎరువులు రైతులకు అందించాలి.

జడ్డు వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ శాఖాధికారి

Updated Date - Jun 08 , 2026 | 12:25 AM