Share News

పశు ఆరోగ్యం.. పోషకులు సుభిక్షం!

ABN , Publish Date - Jan 18 , 2026 | 12:23 AM

పాడిరంగంలో అభివృద్ధి సాధించా లంటే పశువులు ఆరోగ్యంగా ఉండాలి.

పశు ఆరోగ్యం.. పోషకులు సుభిక్షం!

19 నుంచి 31 వరకు ఉచిత పశు ఆరోగ్య వైద్యశిబిరాలు

ప్రతి గ్రామంలో నిర్వహణ.. రైతులకు సూచనలు, సలహాలు

అవసరమైన పరీక్షలు.. మందులు పంపిణీ

ఏలూరుటూటౌన్‌, జనవరి 17 (ఆంధ్ర జ్యోతి): పాడిరంగంలో అభివృద్ధి సాధించా లంటే పశువులు ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే ఉత్పాదకత పెరిగి రైతు ఆర్థికంగా బలోపేతం అవుతాడు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలో పేతం చేసే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా ఈనెల 19వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గ్రామాల్లో ఉచిత పశు వైద్యఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తోంది. పశుపోషకుల సం క్షేమమే ప్రధాన లక్ష్యంగా ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. పశుపోషకులకు నాణ్యమైన వైద్యసేవలు, వ్యాధి నివారణ, అవగాహన కార్యక్రమాలు ఉచితంగా అందిస్తారు. ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలకు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు, ఇంజక్షన్లు ఉచితంగా ఇస్తారు. ఈ వైద్యశిబిరాల్లో గర్భకోశ వ్యాధులకు చికిత్స, నట్టల నివారణ మందులు, వ్యాధి నిరోధకటీకాలు, వ్యాధి నిర్ధారణ పరిక్షలు, శాస్త్రీయ పశుపోషణపై రైతులకు అవగాహన కల్పిస్తారు. పశువుల ఆరోగ్యం కాపాడడం, రైతులకు వైద్యఖర్చుల భారం తగ్గించడం, ఉత్పాదకతను పెంచడమే శిబిరాల ముఖ్య ఉద్దేశం. జిల్లాలో గణాంకాల మేరకు ఆవులు 1,21,574, గేదెలు 4,80,015, గొర్రెలు 5,71,231, మేకలు 2,34,793 ఉన్నాయి.

రైతులకు ఎంతో మేలు

రైతులకు ఈ శిబిరాల వల్ల ఎంతో మేలు జరుగుతుంది. గ్రామానికే పశుసంవర్థక శాఖ సిబ్బంది వచ్చి శిబిరాలు నిర్వహిస్తారు. అక్కడికి పశువులను తీసుకొచ్చి పరీక్షలు చేయించుకోండి. ఏదైనా వ్యాధి నిర్ధారణ అయితే మందులు, ఇంజక్షన్లు ఉచితంగా ఇస్తాం. వ్యాధులు రాకుం డా ముందస్తుగా వ్యాధి నిరోధక టీకాలు వేస్తారు.

– గోవిందరాజు, డిప్యూటీ డైరెక్టర్‌

Updated Date - Jan 18 , 2026 | 12:23 AM