Share News

పట్టణాలకు అమృత్‌ జలాలు

ABN , Publish Date - Jan 28 , 2026 | 01:12 AM

ఏలూరు నగర పాలక సంస్థతోపాటు నూజివీడు, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలు, చింతలపూడి నగర పంచాయతీలకు రూ.464.28 కోట్ల అమృత్‌ 2.0 నిధులు మంజూరయ్యాయి.

పట్టణాలకు అమృత్‌ జలాలు

ఏలూరుకు తాగునీరు, భూగర్భ డ్రెయిన్‌కు రూ.291.57 కోట్లు

నూజివీడుకు రూ.13.87 కోట్లు, జంగారెడ్డిగూడెంకు రూ.101.16 కోట్లు

చింతలపూడికి రూ.57.68 కోట్లు.. టెండర్ల ఆహ్వానం.. త్వరలోనే పనులు

తీరనున్న తాగునీటి సమస్య

జగన్‌ హయాంలో 20 శాతం నిధులు ఇవ్వకపోవడంతో ఐదేళ్లుగా జాప్యం

ఏలూరు టూ టౌన్‌, జనవరి 27(ఆంధ్ర జ్యోతి):ఏలూరు నగర పాలక సంస్థతోపాటు నూజివీడు, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలు, చింతలపూడి నగర పంచాయతీలకు రూ.464.28 కోట్ల అమృత్‌ 2.0 నిధులు మంజూరయ్యాయి. వీటితో తాగునీటి సరఫరా, భూగర్భ డ్రెయిన్లు నిర్మిస్తారు. పనులు ప్రారంభానికి టెండర్లు పిలిచారు. త్వరలో పనులు ప్రారంభమవుతాయి. మంజూరైన ఈ నిధుల్లో కేంద్ర ప్రభుత్వం 50 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 20, స్థానిక సంస్థలు 30 శాతం నిధులు భరించాలి. అమృత్‌ 2.0 పథకం 2021లోనే ప్రారంభం కావాలి. అప్పటి జగన్‌ ప్రభుత్వం 20 శాతం నిధులు భరించ లేకపోవడంతో కేంద్రం నిధులు మంజూరు చేయలేదు. ఫలితంగా ఐదేళ్లపాటు పథకం నిలిచిపోయింది. కూటమి ప్రభు త్వం అధికారంలోకి రాగానే కేంద్ర ప్రభుత్వంతో సంప్రది ంపులు జరిపి రాష్ట్ర వాటా భరిస్తామని చెప్పి నిధులు మంజూరు చేయించుకుంది. తాను వెంటనే డీపీఆర్‌లు తయారు చేసి ప్రభుత్వ ఆమోదం పొందిన తర్వాత టెండర్లు పిలిచారు. టెండర్ల పనులు పూర్తికాగానే వెంటనే పనులు ప్రారంభిస్తారు. ప్రభుత్వం పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌కు బాధ్యతలు అప్పగిస్తూ, మున్సిపల్‌ అధికారులు, సిబ్బందిని భాగస్వాములను చేసింది.

ఏ పట్టణానికెంత ?

నూజివీడు ప్రజల తాగునీటి కోసం రూ.13.87 కోట్లు మంజూరు చేసింది. కొండపల్లి నుంచి కృష్ణా కాల్వ నీళ్లు తీసుకొచ్చేందుకు ఏడు కిలోమీటర్ల మేర పైపులైన్లు నిర్మిస్తారు.

జంగారెడ్డిగూడెం ప్రజల తాగునీటి కోసం రూ.101.16 కోట్లు మంజూరు చేశారు. 72 కిలోమీటర్ల పైపులైన్లు నిర్మిస్తారు. 13 ఎంఎల్‌డీ కెపాసిటీతో వాటర్‌ ట్రిట్‌మెంట్‌ ప్లాంట్‌, ఐదు వాటర్‌ ట్యాంకులు, ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు నిర్మిస్తారు.

చింతలపూడి ప్రజల తాగునీటి సరఫరా కోసం రూ.57.68 కోట్లు మంజూరయ్యాయి. వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు, ఓవర్‌ హెడ్‌ ట్యాంకులతోపాటు 110 కిలోమీటర్ల మేర పైపులైన్లు నిర్మిస్తారు. 2817 కుళాయి కనెక్షన్లు ఇస్తారు.

తాగునీరు, భూగర్భ డ్రెయిన్లకు..

ఏలూరుకు తాగునీరు, భూగర్భ డ్రెయిన్‌లకు రూ.291.57 కోట్లు కేటాయించారు. నగరంతోపాటు ఏడు విలీన గ్రామాల్లో తాగునీటి సరఫరాకు రూ.143.13 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో పోణంగిలో 60 ఎకరాల్లో వెయ్యి ఎంఎల్‌ కెపాసిటీతో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు, రెండు వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు, ఐదు ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు నిర్మిస్తారు. 73 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేస్తారు. 4,600 ఇళ్లకు కుళాయిలు ఇవ్వనున్నారు. అలాగే మరో రూ.148.44 కోట్లతో 50 కిలోమీటర్ల మేర నగర ప్రజల చిరకాల వాంఛ అయిన భూగర్భ డ్రెయిన్‌ నిర్మించనున్నారు. పోణంగిలో 15 ఎంఎల్‌డీ కెపాసిటీతో సెప్టేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నిర్మిస్తారు.

తీరనున్న ప్రజల దాహార్తి

మంజూరైన అమృత్‌ నిధులతో ప్రజల దాహార్తిని తీర్చబోతున్నాం. ప్రజల చిరకాల వాంచ అయిన అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి చేస్తాం. తాగునీటి సరఫరాకు అవసరమైన పైపులైన్ల మరమ్మతులు, నూతన పైపులైన్లు నిర్మిస్తాం. టెండర్లు పిలిచాం. ఇది పూర్తి కాగానే పనులు ప్రారంభిస్తాం.

– పబ్లిక్‌ హెల్త్‌ ఈఈ ఫణిభూషణ్‌

Updated Date - Jan 28 , 2026 | 01:12 AM