Share News

ఏది ముందు ?

ABN , Publish Date - Aug 20 , 2026 | 12:18 AM

పురపాలక సంఘానికి మంజూరైన నిధులతో ముందుగా ఏ పని చేపట్టాలన్న అంశంపై అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు.

ఏది ముందు ?

అమృత్‌ పైప్‌లైన్లు.. పుష్కర బీటీ రహదార్లా ?

గతంలో పైప్‌లైన్‌ల కోసం రోడ్లు ధ్వంసం..

ఏంచేయాలా అని అధికారుల తర్జనభర్జన

నరసాపురం, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): పురపాలక సంఘానికి మంజూరైన నిధులతో ముందుగా ఏ పని చేపట్టాలన్న అంశంపై అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. అమృత్‌ 2.0 పథకం కింద నరసాపురం మునిసిపాలిటీకి రూ.120 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో పట్టణంలో సుమారు 40 కిలోమీటర్ల మేర కొత్త పైప్‌లైన్‌ చేపట్టనున్నారు. ఇదే క్రమంలో పురపాలక సంఘానికి పుష్కర నిధుల కింద రూ.15 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో సుమారు 29 పనుల్ని ప్రతిపాదించారు. వాటిలో అత్యధికంగా పట్టణంలో బీటీ, సీసీ రహదార్లే ఉన్నాయి. ముందుగా పైప్‌లైన్‌ పనులు చేపడితే వేసిన కొత్త రోడ్‌ కట్‌ చేయన వసరం ఉండదు. రహదారి ముందుగానే వేస్తే పైప్‌లైన్‌ కోసం వేసిన రోడ్డును ధ్వంసం చేయాల్సి ఉంటుంది. గత పుష్కరాల్లో ఇదే జరిగింది. దీంతో అధికారులు ఆనాటి అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఏ పని ముందు చేయాలి ? ఎక్కడ పని మొదలు పెట్టాలన్న దానిపై తర్జనభర్జన పడుతున్నారు. అయితే ఇంతవరకు ఈ రెండు పనులు ప్రారంభానికి నోచుకోలేదు. ఇటీవల పుష్కర పనులకు సంబంధించి టెండర్‌ ప్రక్రియ పూర్తిచేశారు. ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. కాంట్రాక్టర్‌కు వర్క్‌ ఆర్డర్‌ ఇస్తే పనులు చేపడతారు. ఇటు అమృత్‌ స్కీమ్‌కు ఇంకా శంకుస్థాపన నోచుకోలేదు. మూడు రోజుల క్రితం చేయాల్సి ఉంది. ఇదీ వాయిదా పడింది. ఈ నెల 24న చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ రెండు పనులు ఒకేసారి మొదలు పెడితే ఏది ముందు చేయాలన్నదానిపై సందిగ్ధం నెలకొంది. అమృత్‌ పథకాన్ని పురపాలకంలోని పబ్లిక్‌ హెల్త్‌కు అప్పగించారు. పుష్కర పనులు పుర పాలక సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్నారు. ఈ రెండు శాఖల సమన్వయంతో ఒక నిర్ణయం తీసుకుంటే గాని ఈ ఆంశం కొలిక్కి వచ్చే సూచనలు కనిపిచడం లేదు. దీనిపై డీఈ ప్రసాద్‌ మాట్లాడారు. ‘‘ పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీర్లతో చర్చిస్తాం..వేసిన రోడ్‌ కట్టింగ్‌ లేకుండా రెండు శాఖల సమన్వయంతో పనులు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. గత పుష్కర అనుభవాలను పరిగణలోకి తీసుకుంటాం.’’ అని వివరించారు.

Updated Date - Aug 20 , 2026 | 12:18 AM