Share News

ప్రగతి రథం అమృత్‌ భారత్‌

ABN , Publish Date - Mar 16 , 2026 | 12:51 AM

కామాఖ్య–చర్లపల్లి అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈశాన్య రాష్ట్రాలను దక్షిణ భారతానికి కలిపే ప్రగతి వారధి అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు.

ప్రగతి రథం అమృత్‌ భారత్‌
తణుకులో అమృత్‌ భారత్‌కు పచ్చ జెండా ఊపుతున్న వర్మ, రాధాకృష్ణ

తణుకులో రైలుకు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ గ్రీన్‌ సిగ్నల్‌

తణుకు/భీమవరం టౌన్‌, మార్చి 15(ఆంధ్రజ్యోతి): కామాఖ్య–చర్లపల్లి అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈశాన్య రాష్ట్రాలను దక్షిణ భారతానికి కలిపే ప్రగతి వారధి అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన హైస్పీడ్‌ ప్రయాణాన్ని తక్కువ ధరకు అందించడానికి ఈ రైలు రూపొందించడం జరిగిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన కామాఖ్య – చర్లపల్లి అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు ఆదివారం తణుకు, భీమవరం స్టేషన్‌లలో స్వాగతం పలికారు. తణుకు రైల్వే స్టేషన్‌లో కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యే ఆరి మిల్లి రాధాకృష్ణతో కలిసి రైలుకు జెండా ఊపారు. కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ ప్రయాణికులతో కలిసి భీమవరం టౌన్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. భీమవరంలో ఎమ్మెల్యే పుల పర్తి అంజిబాబు, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, ఏపీఐ ఐసీ చైర్మన్‌ మంతెన రామరాజు, జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో వందే భారత్‌, అరుణాచలం ప్రత్యేక రైలు, అమృత్‌ భారత్‌ వంటి ఆధునిక రైల్వే సర్వీసులు తీసుకువచ్చిన కేంద్రమంత్రి వర్మ కృషిని ఎమ్మెల్యేలు ఆరిమిల్లి రాధాకృష్ణ, పులపర్తి అంజిబాబు అభినందించారు. విశాఖ – హైదరాబాద్‌ వందే భారత్‌కు తాడేపల్లిగూడెంలో హాల్ట్‌, నరసాపురం నుంచి విశాఖపట్నం పగటిపూట ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు శ్రీనివాసవర్మ తెలిపారు.

Updated Date - Mar 16 , 2026 | 12:51 AM