Share News

ఏఎంసీ.. జోష్‌

ABN , Publish Date - Apr 19 , 2026 | 12:16 AM

జిల్లాలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు అంచనాలకు మించి లక్ష్యాన్ని చేరుకున్నాయి.సెస్‌ రూపంలో పెద్దమొత్తంలోనే ఆదాయం సమకూ రింది.

ఏఎంసీ.. జోష్‌

మార్కెట్‌ కమిటీల్లో

లక్ష్యానికి మించి ఆదాయం

అధికారుల్లో ధీమా

ధాన్యం సెస్‌ విడుదల

ఖాతాలోకి రూ.84 కోట్లు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

జిల్లాలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు అంచనాలకు మించి లక్ష్యాన్ని చేరుకున్నాయి.సెస్‌ రూపంలో పెద్దమొత్తంలోనే ఆదాయం సమకూ రింది. ఆక్వా రంగం ఒడిదుడుకులతో సాగడంతో ఒక దశలో భీమవరం, ఇతర మార్కెట్‌ కమిటీలు ఈ ఏడాది లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమేనన్న భావనకు వచ్చేశాయి, అనూహ్యంగా పౌరసరఫరాల కార్పొరేషన్‌ ఆదుకుంది. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన సెస్‌ విడుదల చేసింది. మార్కెట్‌ కమిటీల ఖాతాలో జమచేసింది. ఫలితంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఒకటి రెండు మార్కెట్‌ కమిటీలు మినహా మిగిలనవన్నీ వంద శాతానికి పైగా లక్ష్యాన్ని సాధించాయి. అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలో ఉన్న పది మార్కెట్‌ కమిటీల నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.68.09 కోట్లు రాబట్టాలి. అంతకు మించి సెస్‌ లభించింది. సుమారు రూ. 84.03 కోట్లు ఆదాయం లభించింది.

ఆక్వా, వరిపైనే ఆధారం

జిల్లాలో మార్కెట్‌ కమిటీలకు ఆక్వా, వరి ఉత్పత్తుల ద్వారానే సెస్‌ లభిస్తోంది. ఇటీవల రొయ్య సాగు దెబ్బతింది. చేపల సాగు అంతంత మాత్రంగానే ఉంటోంది. దాంతో భీమవరం, ఆకివీడు, ఉండి, నర్సాపురం మార్కెట్‌ కమిటీల నుంచి ఆదాయం గణనీయంగా పడిపోయింది. లక్ష్యాన్ని చేరుకోలే మంటూ అధికారులు చేతులెత్తేశారు. సదరు మార్కెట్‌ కమిటీల పరిధిలో వరిసాగు నామమాత్రంగానే ఉంది. అయినా సరే పౌర సరఫరాల కార్పొరేషన్‌ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సెస్‌ జమ చేసింది. గతంలో ప్రైవేటు కొనుగోళ్లు జరిగేవి. మిల్లర్లు సెస్‌ చెల్లించేవారు. ప్రభుత్వం కొనుగోళ్లు ప్రారంభించిన తర్వాత పౌరసరఫరాల కార్పొరేషన్‌ సెస్‌ జమ చేస్తోంది. దాంతో మార్కెట్‌ కమిటీలకు ఏక కాలంలో సెస్‌ వచ్చి పడుతోంది. ఈ ఏడాది మార్చిలో జమ చేయడంతో జిల్లాలోని అన్ని మార్కెట్‌ కమిటీలకు అనూహ్యంగా ఆదాయం పెరిగింది.

నిధులపైనే పాలకవర్గాల ఆశలు

అంచనాలకు మించి ఆదాయం రావడంతో పాలకవర్గాల్లో ఆశలు చిగురించాయి. ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకు నిధులు మంజూరు చేస్తుందని ఆశిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని పలు మార్కెట్‌ కమిటీల నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. పుంత రహదారులకు నిధులు కేటాయించాలంటూ చైర్మన్‌లు పట్టుబడుతున్నారు. గత ప్రభుత్వంలో గోదాముల నిర్మాణం చేపట్టారు. తెలుగుదేశం హయాంలోనే గతంలోనూ పుంత రహదారులకు నిధులు మంజూరు చేశారు. ఈసారి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్న ఆశలు పెట్టుకున్నాయి.

మార్కెట్‌ కమిటీలు లక్ష్యం ఆదాయం

(రూ.కోట్లలో)

ఆకివీడు 6.58 5.16

అత్తిలి 2.25 3.28

భీమవరం 15.42 16.73

పాలకొల్లు 6.65 8.87

పెనుగొండ 2.75 4.42

తాడేపల్లిగూడెం 7.00 12.14

తణుకు 7.54 9.35

ఉండి 13.77 16.12

ఆచంట 1.77 3.40

నర్సాపురం 4.36 4.58

Updated Date - Apr 19 , 2026 | 12:16 AM