Share News

జయహో అమరావతి

ABN , Publish Date - Apr 03 , 2026 | 12:28 AM

ఆంధ్రరాష్ట్ర రాజధానిగా అమరావతికి జిల్లాలో జై కొట్టారు. కూటమి శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా బాణసంచా కాల్పులతో హోరోత్తించారు. కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించి తమ ఆనందాన్ని పంచుకున్నారు.

జయహో అమరావతి
తాడేపల్లిగూడెంలో అఖండ జ్యోతితో ర్యాలీ నిర్వహిస్తున్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌, కూటమి నాయకులు

రాజధానికి మద్దతుగా కూటమి ఆధ్వర్యంలో సంబరాలు

కేక్‌ కటింగ్‌లు..బాణసంచా కాల్పులు..కొవ్వొత్తులతో ర్యాలీలు

ఆలయాల్లో పూజలు ..దీపారాధనలు

భీమవరంటౌన్‌ , నరసాపురం టౌన్‌ , తాడేపల్లిగూడెం, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి) : ఆంధ్రరాష్ట్ర రాజధానిగా అమరావతికి జిల్లాలో జై కొట్టారు. కూటమి శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా బాణసంచా కాల్పులతో హోరోత్తించారు. కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించి తమ ఆనందాన్ని పంచుకున్నారు. అమరావతికి సంపూర్ణ మద్దతు పలికారు. భీమవరం ప్రకాశ్‌ చౌక్‌లో ఎమ్మెల్యే అంజిబాబు, పొలిట్‌ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి నేతృత్వంలో మానవహారం నిర్వహించారు. తణుకులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ నాయకత్వంలో కార్యకర్తలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేక్‌ కట్‌ చేశారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వలవల బాబ్జి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పాలకొల్లులో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌రావు ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. నర్సాపురంలో టీడీపీ ఇన్‌ఛార్జ్‌ పొత్తూరి రామరాజు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆకివీడు, గణపవరంలోనూ కూటమి శ్రేణులు సందడి చేశాయి. దాదాపు అన్ని మండలాల్లోనూ అమరావతికి మద్ధతుగా నిలిచారు.

ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీక : అంజిబాబు

అమరావతి రాజధాని 5 కోట్ల ప్రజల ఆకాంక్ష అని రాష్ట్ర పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ చైర్మన్‌, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరం ప్రకాశం చౌక్‌లో గురు వారం రాత్రి కూటమి నాయకులు సంబరాలు నిర్వహించారు. జై అమరావతి.. జై జై అమరావతి నినాదాలతో ప్రకాశం చౌక్‌ సెంటర్‌ మారుమోగింది. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ రైతుల త్యాగానికి, ప్రజల ఆకాంక్షలకు దక్కిన గౌరవం అమరావతి అని.. ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మీ మాట్లాడుతూ అంధకారంలో పడిన అమరావతి భవిష్యత్‌ ఇక దేదీప్యమానంగా ప్రకాశించేందుకు మార్గం సుగమమైందన్నారు. ఏఎంసీ చైౖర్మన్‌ కలిదిండి సుజాత,మెంటే పార్ధసారధి, కోళ్ళ నాగేశ్వరరావు, మెరగాని నారాయణమ్మ, బండి రమేష్‌, వబిలిశెట్టి రామకృష్ణ కూటమి నాయకులు పాల్గొన్నారు.

దేశం గర్వించే విధంగా రాజధాని : నాయకర్‌

దేశం గర్వించే విధంగా అమరావతి రాజధాని నిర్మించేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌లు నిరంతరం కృషి చేస్తున్నారని విప్‌ నాయకర్‌ అన్నారు. గురువారం జనసేన పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు, మత్స్యకార ఆభివృద్ధి చైర్మన్‌ కొల్లు పెద్దిరాజులతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో రాష్ర్టాన్ని గందరగోళానికి గురి చేసింద న్నారు. ఏపీకి రాజధాని లేని లేకుండా పోయిందన్నారు.రామరాజు మాట్లాడుతూ అమరావతికి చట్టభద్రత కల్పించి, గొప్ప రాజధాని నిర్మించాలన్నదే కూటమి లక్ష్యమన్నారు. ఏఎంసీ చైర్మన్‌ జక్కం శ్రీమన్నారాయణ, కొప్పాడ రవి, మునికోటి వెంకటేశ్వరావు, గంగాధర్‌, కొలచన పద్మ, అరుణ పాల్గొన్నారు.

గత ప్రభుత్వం రాజధాని లేకుండా చేసింది : బొలిశెట్టి

తాడేపల్లిగూడెం పట్టణంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం పోలీస్‌ ఐలాండ్‌ వద్ద పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్‌ కట్‌ చేసి, స్వీట్లు పంచారు. బాణసంచా కాల్చారు. విజయానికి సూచికగా జ్యోతి పట్టుకుని కూటమి నాయకులు పెద్ద శివాలయానికి వెళ్లి పూజలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం రాష్ర్టానికి రాజధాని లేకుండా చేసిందన్నారు. రాజధానిగా అమరావతి వద్దంటూ వైసీపీ పార్లమెంట్‌ సభ్యులు అడ్డుకున్న తీరు సభ్య సమాజం తలదించుకునేలా చేసిందన్నారు. ఈతకోట తాతాజీ, పసల కొండ, పుల్లా బాబి, అడపా ప్రసాద్‌, దువ్వా శ్రీనివాస్‌, తేజా, దాసరి కృష్ణవేణి, కట్టుబోయిన కృష్ణప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రతీ ఆంధ్రుడు గర్వించదగ్గ రోజు : కలెక్టర్‌

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆంధ్రుడు ఎంతో గర్వించదగ్గ మంచి రోజని కలెక్టర్‌ నాగరాణి అన్నారు. భీమవరం జువ్వలపాలెం రోడ్డులోని అల్లూరి సీతారామరాజు స్మృతివనం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొన్నారు.అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించార ు. ప్రాంగణంలో అమరావతి రాజధాని రంగవల్లిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఎస్పీ అద్నాన్‌ నయీమ్‌ అస్మి, జేసీ రాహుల్‌ కుమార్‌ రెడ్డి కేక్‌ కట్‌ చేసి స్వీట్స్‌ పంచారు.

ఆలయాల్లో అమరావతికి స్వాగత వేడుకలు

పాలకొల్లు అర్బన్‌/ భీమవరం టౌన్‌ ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తించిన నేపఽథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రముఖ ఆల యాల్లో దీపాలు వెలిగించారు. అఖండ జ్యోతి వెలిగించారు. పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో గురువారం రాత్రి పాలకవర్గ చైర్మన్‌ మీసాల రామచంద్రరావు (రాము) అఖండ జ్యోతి వెలిగించారు. మేళ తాళాలతో అఖండ జ్యోతిని ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు.ఈవో శ్రీనివాసరావు, ట్రస్టీలు, భక్తులు పాల్గొన్నారు. జై అమరావతి అంటూ నినాదాలిచ్చారు.

జూ గునుపూడి సోమేశ్వరస్వామి ఆలయం వద్ద జై అమరావతి..మన రాజధాని – మన విజయం అని ముగ్గులు వేశారు. దీపాలు వెలిగించి సంబరాలు చేశారు దేవస్ధానం చైౖర్మన్‌ చింతలపాటి బంగ్రారాజు, ఈవో రామకృష్ణంరాజు, ధర్మకర్తలు, అర్చకులు పాల్గొన్నారు.

జూ మావుళ్లమ్మ ఆలయం వద్ద ముగ్గులతో అలంకరించారు. అమరావతికి అనుకూలంగా నినాదాలు చేశారు. దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ హరి సూర్యప్రకాష్‌, సహాయ కమిషనర్‌ బుద్ధామహాలక్ష్మి నగేష్‌, ఆలయ చైర్మన్‌ బొండాడ నాగ భూషణం, ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రధానార్చకుడు మద్దిరాల మల్లిఖార్జున శర్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2026 | 12:28 AM