నానికి తుది వీడ్కోలు
ABN , Publish Date - Sep 18 , 2026 | 12:55 AM
మాజీ ఉప ముఖ్యమంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని) అంత్యక్రియలు గురు వారం అధికారిక లాంఛనాలతో ముగిశాయి.
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. పార్థివదేహానికి మంత్రి లోకేశ్ నివాళులు
అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రులు కొలుసు, నిమ్మల, డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు
ఏలూరు, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి):మాజీ ఉప ముఖ్యమంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని) అంత్యక్రియలు గురు వారం అధికారిక లాంఛనాలతో ముగిశాయి. నగరంలోని శ్రీరామ్‌నగర్‌లో గల ఆయన నివాసం వెనుక ఖాళీ స్థలంలో అభిమానులు, ప్రజల అశ్రు నయనాల నడుమ అంతిమ సంస్కారాలు నిర్వ హించారు. పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించగా, చితికి ఆయన పెద్ద కుమారుడు మణిచంద్ర తలకొరివి పెట్టారు. వర్షం కురవడంతో అంత్య క్రియలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ హాజరై ఆళ్ల నాని పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాని సతీమణి ఫణిరేఖ, కుమారులు మణిచంద్ర, ఆశిష్‌లను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ ‘నాని అకాల మరణం తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది. ఆయన రూపంలో రాష్ట్రం ఒక మహోన్నత వ్యక్తిని కోల్పోయింది. రాజ కీయాల్లో రాజనీతి ఉండాలని బలంగా నమ్మిన నేత. ఆయన సేవలు చిరస్మరణీయం. కొవిడ్ సమ యంలో ఆరోగ్య శాఖ మంత్రిగా విశేష సేవలందిం చారు. ఆయన కుటుంబానికి భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలి’ అని కోరారు. మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ‘పదవిని ఎన్నడూ స్వార్థానికి వాడు కోకుండా, ఉన్నత విలువల కోసం నిలబడిన ఆయన మరణం పార్టీకి తీరని లోటు’ అని అన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లా డుతూ వివాదాలకు దూరంగా ఉంటూ, ఇచ్చిన బాధ్యతలను నిబద్ధతతో నెరవేర్చి ప్రజలకు న్యాయం చేసిన ప్రత్యేకత కలిగిన రాజకీయ నాయకుడ’ని కొనియాడా రు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు మాట్లాడుతూ ‘నవ్వుతూ, ఎంతో ఆప్యాయంగా పలకరించే స్నేహశీలి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునే ఆయన ఇంత చిన్న వయసులో మరణించడం దురదృష్టకరం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కొలుసు పార్థ సారథి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, ఎస్పీ ప్రతాప్ శివకిశోర్, డీఎస్పీ శ్రావణ్‌కుమార్, ఆర్డీవో లక్ష్మీప్రసన్న తదితర అధికారులు పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు.
పోటెత్తిన నేతలు, అభిమానులు
ప్రియతమ నేతను కడసారి చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్, ఎమ్మెల్యే బడేటి చంటి, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయు డు, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు, సొంగా రోషన్‌కుమార్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు, కార్మిక బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, మాజీ ఎమ్మెల్యే మరడాని రంగారావు, టీడీపీ నేతలు మంచెం మైబాబు, బొద్దాని శ్రీనివాస్, వైసీపీ ఏలూరు నగర అధ్యక్షుడు మామిళ్లపల్లి జయప్రకాశ్, డాక్టర్ దిరిశాల వరప్రసాద్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.