ఆకివీడు ఎందుకిలా..
ABN , Publish Date - Jul 10 , 2026 | 12:16 AM
ఆకివీడు నగర పంచాయతీ అవినీతికి అడ్రస్‌గా మారింది. టెండర్ల ప్రక్రియలో అక్రమాలు, నిధులు దుర్వినియోగం జరుగుతున్నాయి.
నగర పంచాయతీలో నిధులు దుర్వినియోగం.. కౌన్సిలర్ల మండిపాటు
కాంట్రాక్టర్లు అధికారుల బినామీలు !
సరుకులు రాకున్నా లక్షల్లో బిల్లులు..
పనులు పనిచేయకున్నా మస్తర్లు
ఆకివీడు, జూలై 9(ఆంధ్రజ్యోతి): ‘ఆకివీడు నగర పంచాయతీ అవినీతికి అడ్రస్‌గా మారింది. టెండర్ల ప్రక్రియలో అక్రమాలు, నిధులు దుర్వినియోగం జరుగుతున్నాయి. లక్ష రూపాయలకు పైబడిన టెండర్లను ఆన్‌లైన్‌లో పెట్టకుండా అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. పారిశుధ్య పనులు, వీధిలైట్ల నిర్వహణ పేరుతో అధికారులు లక్షల్లో బిల్లులు పెడుతున్నా క్షేత్రస్థాయిలో పనులు జరగడం లేదు. బ్లీచింగ్ వేలకు వేలు టన్నులు కొనుగోలు చేస్తున్నా.. వార్డుల్లో ఎక్కడా కనిపించడం లేదు. సచివాలయాల్లో స్టాఫ్ ఉండరు. శానిటేషన్ వర్కర్లకు కనీసం చీపుర్లు కూడా ఇవ్వడం లేదు. అధికారులు బినామీల పేర్లతో నిధులు దుర్వినియోగం చేస్తున్నారు. మేం ఫోన్ చేసినా కనీసం ఆన్సర్ చేయరు’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆకివీడు నగర పంచాయతీ కౌన్సిలర్లు. ఆంధ్రజ్యోతితో వారి ఆవేదన.. వారి మాటల్లోనే..
బినామీ పేర్లతో దోపిడీ
నగర పంచాయతీని అధి కారులు బినామీల పేరుతో దోచుకుంటున్నారు. అనధికారంగా రూ.20 లక్షల వరకూ బాక్స్ టెండర్లు వేసుకున్నారు. లక్ష దాటితే ఆన్‌లైన్ ద్వారా వేయాలి. కాని అలా జరగడం లేదు. శానిటేషన్ వర్కర్లు సరిగా రాక డ్రైయిన్లు అధ్వానంగా ఉన్నాయి. వారి మస్తర్లు పుల్‌గా ఉంటున్నాయి. వేలకు వేల టన్నులు బ్లీచింగ్ కొనుగోలు చేసినట్లు బిల్లులు పెడుతున్నా వార్డుల్లో పెద్దగా చల్లడం లేదు.
– బొల్లా వీరశ్వేత, టీడీపీ ప్లోర్ లీడర్
పనులు జరగడం లేదు
బోర్డు ఏర్పడిన దగ్గర నుంచి పనులు సక్రమంగా జరగడం లేదు. పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. దుర్వాసన వస్తోంది. కొన్ని వార్డుల్లో కొత్త పైపు కనెక్షన్లు ఇచ్చి తాగునీరు సరఫరా చేయడం లేదు. అడిగితే సమాధానం చెప్పరు. కుక్కలతో అందరూ ఇబ్బందులు పడుతున్నారు.
– నేరెళ్ళ ప్రసన్న, జనసేన కౌన్సిలర్
అజెండా.. ఆశ్చర్యం
నగర పంచాయతీ పను ల విషయంలో అజెండా ఆశ్చర్యంగా ఉంది. జూన్‌లో జరిగే సమావేశంలో 22 వర్కులు బాక్స్ టెండర్లు చేస్తున్నట్లు ఉంది. వీధి లైట్లకు సంబంధించి ఎనిమిది లక్షల వర్కులను ఎనిమిది భాగాలుగా విడదీసి బాక్స్ టెండర్లు వేయడం దారుణం. బ్లీచింగ్ ఆరు బాగాలుగా విడదీశారు. నచ్చిన కాంట్రాక్టరుకు ఇచ్చుకొనేందుకే ఈ విధంగా చేస్తున్నారు. దీనిని డిప్యూటీ స్పీకర్ దృష్టికి తీసుకెళతాం.
– గంధం ఉమా, టీడీపీ పట్టణ అధ్యక్షులు
రోడ్లు ఎప్పుడు వేస్తారు?
ఆకివీడులో సీసీ రోడ్ల నిర్మాణానికి డస్ట్ పరిచి 3 నెలలు అవుతున్నా నేటికి పనులు చేపట్టలేదు. మూడేళ్ల క్రితం జనరల్ ఫండ్స్ మంజూరయ్యాయి. ఏడాది క్రితం కాంట్రాక్ట్‌ను రద్దు చేసి వేరొకరిని నియమించినా ఫలితం కనిపించడం లేదు.
నిమ్మల నాగు, వైసీపీ కౌన్సిలర్, ఆకివీడు
డబ్బులొచ్చే పనులపైనే..
టౌన్ ప్లానింగ్ ఆయు ధంతో మురుగు డ్రైన్లపై ఇళ్లు నిర్మించుకొనేలా అధికారులు చేస్తున్నారు. కోర్టుల్లో వున్న స్థలాలకు పైపు, కరెంట్, వసతులు కల్పిస్తున్నారు. ఆదాయం వచ్చే పనులే చేసుకుంటున్నారు. ప్రజా ప్రయోజనాలు అధికారులకు పట్టడంలేదు. డ్రైన్లు పూడుకుపోవడంతో వర్షాలకు పట్టణం ముంపుబారిన పడుతుంది.
బొల్లా శేషుబాబు, టీడీపీ వార్డు ఇన్‌ఛార్జ్
ఆరోపణలు అవాస్తవం
పనులకు టెండర్లు వేసేం దుకు ఎవరూ ముందుకు రావడం లేదు. బాక్స్ టెండర్లు వేసుకుంటే అరువు తెచ్చుకోవచ్చునని కౌన్సిలర్లే చెప్పారు. అవసరం మేర బాక్స్ టెండర్లు వేసుకుంటున్నాం. ఈ విషయాలు అన్నీ డిప్యూటీ స్పీకర్ రఘురామ దృష్టికి తీసుకెళ్లాం. ఆయన ధరలన్నీ పరిశీలించి పద్ధతిగానే ఉందన్నారు. మాపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం. అవన్నీ అపోహలే.
– జి.కృష్ణమోహన్, నగర పంచాయతీ కమిషనర్