మిగిలిందైనా కాపాడుకుందాం
ABN , Publish Date - Jul 17 , 2026 | 12:39 AM
తాడేపల్లిగూడెం కొండాలమ్మ గుడి నుంచి ఏపీ నిట్‌కు వెళ్లే రహదారికి ఓ వైపు విమానాశ్రయ భూముల్లో గట్లు వేస్తున్నారు’ అంటూ ఇటీవల ఓ వ్యక్తి సోషల్ మీడియా పెట్టిన పోస్టు వైరలైంది.
విమానాశ్రయ భూములు 600 నుంచి 131 ఎకరాలకు..
గత ప్రభుత్వంలో క్రికెట్ స్టేడియానికి ప్రతిపాదనలు
అక్కడ గట్టు వేస్తున్నారంటూ వీడియో వైరల్
రెవెన్యూ అధికారుల అలర్ట్.. క్షేత్రస్థాయిలో పరిశీలన
రికార్డులు పరిశీలన.. హైకోర్టు కేసులపైనా ఆరా
‘తాడేపల్లిగూడెం కొండాలమ్మ గుడి నుంచి ఏపీ నిట్‌కు వెళ్లే రహదారికి ఓ వైపు విమానాశ్రయ భూముల్లో గట్లు వేస్తున్నారు’ అంటూ ఇటీవల ఓ వ్యక్తి సోషల్ మీడియా పెట్టిన పోస్టు వైరలైంది. మరోవైపు విమానాశ్రయ భూముల్లోని ఆరు ఎకరాల్లో క్రికెట్ స్టేడియం కోసం ప్రతిపాదించిన భూమిలోనే గట్లు వేస్తున్నారని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. దీనిపై రెవెన్యూ అధికారులు స్పం దించారు. ఆ భూమి తమ ఆధీనం లోనే ఉందని, ఎటువంటి అన్యాక్రాంతం కాలేదని క్షేత్రస్థాయిలో పరిశీలించి పేర్కొన్నారు. భూముల రికార్డులను, హైకోర్టులో పెండింగ్ కేసులపైన ఆరా తీస్తున్నారు.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ప్రభుత్వ భూమి అందుబాటులో లేదు. ప్రతి సెంటు అవసరం కానుంది. ఎంతో విలువైన భూములను కాపాడుకోకపోతే భవిష్య త్‌లో కోట్లు పెట్టినా దొరకని పరిస్థితి ఏర్ప డుతుంది. తాడేపల్లిగూడెంలో విమానాశ్రయం కోసం బ్రిటీష్ కాలంలో రైతుల నుంచి 600 ఎకరాలకు పైగా కొనుగోలు చేశారు. ఇందులో ఏపీ నిట్‌కు 175 ఎకరాలు, రహదారుల విస్తరణకు 100 ఎకరాలు, ఏపీ టిడ్కోకు 54 ఎకరాలు, పేదలకు ఇళ్ల స్థలాల నిమిత్తం 50 ఎకరాలు ఇచ్చారు. సుమారు 90 ఎకరాలు అన్యాక్రాంతమైంది. ఇందులో నిర్మాణాలు వెలిశాయి. ఇలా ఎంతో విలువైన భూమి రోజురోజుకూ చిక్కిపోతోంది.
వైసీపీ అనాలోచిత చర్య
వైసీపీ హయాంలో నిట్ నుంచి ఎల్.అగ్రహారానికి వెళ్లే రహదారికి ఇరు వైపులా విమానాశ్రయ భూములను పేదల ఇళ్లకు పంచిపెట్టేశారు. ఇతర నియోజకవర్గాల మాదిరిగా భూసేకరణ నిర్వహించి స్థలాలు ఇవ్వలేదు. రహదారి విస్తరణ అవసరాలు వుంటాయన్న విషయాన్ని విస్మరించారు. నిట్ మీదుగా ఎల్.అగ్రహారం, టిడ్కో ఇళ్లకు వెళ్లే రహదారికి ఇరువైపులా సెంటు స్థలం వంతున ఇళ్లు మంజూరుచేశారు. ‘వ్యర్థంతో విద్యుత్ ప్లాంట్’ ఏర్పాటుకు మున్సిపాలిటీ ప్రతిపాదించిన భూమిని పేదలకు ఇచ్చేశారు. ఇలా విమానాశ్రయ భూములను పప్పు బెల్లాల్లా పంచిపెట్టారు. ఇప్పుడు ఏదైనా పరిశ్రమ ఏర్పాటు చేద్దామన్నా, ప్రాజెక్ట్ నెలకొల్పుదామన్నా ప్రభుత్వ భూమి అందుబాటులో లేదు. జిల్లాకు ఒక పారిశ్రామిక పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం సంకల్పించింది. భూమి అందుబాటులో లేకపోవడంతో కేవలం ఉండి, నర్సాపురంలోనే ఇండస్ర్టియల్ పార్క్ కోసం కేటాయించారు. భవిష్యత్తులో నిట్ విస్తరణకు భూమి అవసరం. ప్రభుత్వస్థాయిలో దీనిపై చర్చ జరుగుతోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు నడిబొడ్డున ఉన్న తాడేపల్లిగూడెం పట్టణానికి మంచి భవిష్యత్తు ఉందంటూ ప్రభుత్వ నేతలు చెబుతూ వస్తున్నారు. కొత్తగా గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు ప్రతిపాదన ఉంది. ఈ పరిస్థితుల్లో తాడేపల్లిగూడెంలో మిగిలిన విమానాశ్రయ భూములను అత్యంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. దీనిపై కలెక్టర్ నాగరాణి దృష్టి సారించారు.
టీడీపీ హయాంలో కన్వెన్షన్ సెంటర్
వైసీపీ హయాంలో ఆరెకరాల భూమిని క్రికెట్ స్టేడియం కోసం ప్రతిపాదన చేసినప్పటికి అది ఆచరణ సాధ్యం కాలేదు. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో తాడేపల్లిగూడెం నడి బొడ్డున ఉన్న మరో 11 ఎకరాల భూమిలో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు సంకల్పించారు. కోతి బొమ్మ సెంటర్ సమీపంలో సదరు భూమి ఉంది. వైసీపీ హయాంలో దీనిని కాజేసేందుకు పెద్ద ప్రణాళిక చేశారు. అయినా అది సాధ్యం కాలేదు. హైకోర్టు ఇదే భూమిని స్వాధీనం చేసుకోవాలంటూ రెవెన్యూ శాఖకు గతంలోనే ఆదేశాలు జారీచేసింది. అందుకు తగ్గట్టుగా గత కూటమి హయాంలోని సదరు భూమిలో కన్వెన్షన్ సెంటర్‌కు అప్పటి దేవదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ప్రయత్నాలు చేశారు. పర్యాటక శాఖ అధికారులు పలుమార్లు సందర్శించారు. ప్రభుత్వం నుంచి నిధులు కేటాయింపు లేకపోవడంతో ప్రతిపాదన మరుగనపడింది. ప్రస్తుత అధికారులకు వీటిపై అవగాహన లేదు. ఈ భూములపైనా అధికారులు దృష్టి పెట్టాలి. భావితరాల అవరాలకు తగ్గట్టు ప్రాజెక్ట్‌ల కోసమో, ఇతర ప్రజా అవసరాల కోసమో కేటాయించాలి.
విమానాశ్రయ భూముల లెక్క
మొత్తం భూములు 600 ఎకరాలు
ఏపీ నిట్‌కు 175 ఎకరాలు
రహదారుల విస్తరణకు 100 ఎకరాలు
ఏపీ టిడ్కో ఇళ్లకు 54 ఎకరాలు
పేదలకు ఇళ్ల స్థలాలకు 50 ఎకరాలు
అన్యాక్రాంతమైనది 90 ఎకరాలు
మిగిలింది 131 ఎకరాలు