Share News

అడ్మిషన్ల వేట

ABN , Publish Date - May 05 , 2026 | 12:57 AM

‘మీ బాబు పదవ తరగతి పరీక్షలు పాసయ్యాడంట కదా. మా కాలేజీలో జాయిన్‌ చేయించండి. ఇంటర్మీడియేట్‌లో మంచి ర్యాంక్‌లు సాధించేలా చదువు చెబుతాము.

అడ్మిషన్ల వేట

ఫీజుల్లో రాయితీలు ఇస్తామంటూ హామీలు

తల్లిదండ్రులు, బంధువులపై ఒత్తిళ్లు

జంగారెడ్డిగూడెం రూరల్‌, మే 4, (ఆంధ్రజ్యోతి) : ‘మీ బాబు పదవ తరగతి పరీక్షలు పాసయ్యాడంట కదా. మా కాలేజీలో జాయిన్‌ చేయించండి. ఇంటర్మీడియేట్‌లో మంచి ర్యాంక్‌లు సాధించేలా చదువు చెబుతాము. ఈ ఏడాది మా కాలేజీ విద్యార్థులు సాధించిన ర్యాంక్‌లు ఇవిగో. ఇదే మాదిరిగానే మీ అబ్బాయి/అమ్మాయి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ఫీజు సంగతి పక్కన పెట్టండి. ముందు అడ్మిషన్‌ తీసుకోండి. మిగిలిన వారి కంటే మీ దగ్గర తక్కువగానే ఫీజులు తీసుకుంటాం. మాది గ్యారంటీ..’ ఇదీ కొన్ని ప్రైవేట్‌ కళాశాలలు, స్కూళ్ల ప్రచార శైలి. ఎల్‌కేజీ నుంచి పై చదు వుల వరకు ఆయా కళాశాలలు పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల అడ్మిషన్ల కోసం వేస్తున్న గేలాలివి. ఆఫర్లతో తల్లిదండ్రులను ఏదో రూపంలో ఒప్పించేందుకే ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో 22,585 మంది పరీక్షలు రాశారు. పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇప్పుడు ప్రైవేట్‌ కళాశాలల దృష్టంతా వీరిపైనే పడింది. తమ కళాశాలలో చేరమంటే తమ కళా శాలలో చేరమని పోటాపోటీ ప్రచారాలకు తెర తీస్తున్నాయి. ఇళ్లకు వెళ్లి మరీ చేర్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ కళాశాలలు సాధించిన ఉత్తమ ఫలి తాలను ఏకరువు పెడుతూ ఫీజులను వివరిస్తూ అడ్మిషన్లు కోసం ఇంటింటా ప్రచారం జోరుగా సాగిస్తున్నాయి.ఆయా గ్రామాల్లో కళాశాల యాజమాన్యాల బంధువులు, స్నేహితు లు, పూర్వపు విద్యార్థులు, సామాజిక వర్గాల వారీగా విద్యార్థు లకు వలలు వేస్తున్నారు. కొన్ని స్కూళ్లు అయితే అడ్మిషన్ల కోసం ఏకంగా కొంతమంది సిబ్బందిని ప్రత్యేకంగా నియమిం చడం గమనార్హం. కొన్ని స్కూళ్లలో ఆయా గ్రామాల్లో తమ స్కూల్స్‌లో టీచర్స్‌గా పనిచేస్తున్న వారిపై ఒత్తిళ్లు తెచ్చి మరీ విద్యార్థులను చేర్పించేలా వ్యవహరిస్తున్నారు. నిప్పులు చెరిగే ఎండలో సైతం ఉదయం మొదలు కొని సాయంత్రం వరకు విద్యార్థుల అన్వేషణలో ప్రైవేటు టీచర్లు ఇంటింటికీ తిరుగుతున్నారు.

ఆఫర్లలోను వివక్ష

అడ్మిషన్ల కోసం ఇస్తున్న ఆఫర్లలోను ప్రైవేట్‌ పాఠశాలలు వివక్ష చూపుతు న్నాయి. వారే నేరుగా విద్యార్థుల ఇళ్లకు వస్తే ఒక ఫీజు...విద్యార్థులు నేరుగా స్కూళ్లు/ కళా శాలల వద్దకు వెళ్లి అడిగితే మరో ఫీజు చెబుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటితో పాటు ప్రజా ప్రతినిధులు, రాజకీయనాయకులు, అధికారుల పిల్లలకు మరికొన్ని ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నారు. డివిజన్‌ కేంద్రమైన జంగారెడ్డిగూడెంలో మూడు పదుల సంఖ్యలో ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. పట్టణాల్లో పెరిగిన ప్రైవేట్‌ పాఠశాలలు వాటి మధ్య పెరిగిన పోటీతో ఆఫర్ల జోరు పెరిగింది. పట్టణం నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరం వరకు బస్‌ సౌకర్యం కల్పిస్తున్నారు. కళాశాలలు, స్కూల్స్‌ యాజమాన్యాలు, ప్రతినిధులు ఒక్కొక్క విద్యార్థి, వారి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వారి రికార్డులతో విసుగు తెప్పించి మరీ అడ్మిషన్‌ను పొందుతున్నారు. ఒకానొక సమయంలో విద్యాసంస్థల ప్రతినిధులు వస్తున్నారంటే తల్లిదండ్రులు కన్పించకుండా తప్పించుకుంటున్నారంటే ఏస్థాయిలో వారిపై ఒత్తిళ్లు తెస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే అడ్మిషన్‌లు పొందిన తర్వాత మాత్రం ఆ ఆఫర్లు అమలు చేయడం లేదనే ఆరోపణలు కూడా లేకపోలేదు.

నూజివీడులో పోటాపోటీ..

నూజివీడు టౌన్‌ : నూజివీడులో ఆరు ప్రైవేటు కళాశాలతో పాటు ఒక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, మరో రెండు ప్లస్‌ టూ కళాశాలలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తు ఫలితాలను దృష్టిలో పెట్టుకుని 550 మార్కులు పైబడి వచ్చిన వారికి ఫీజుల రాయితీలు ప్రకటిస్తూ కళాశాలల యాజమాన్యాలు అడ్మి షన్లు పూర్తికి చర్యలు చేపట్టాయి. నూజివీడు ప్రాంతంలో సాధారణంగా ఇంటర్మీ డియట్‌ ఫీజులు 20 వేల నుంచి 50 వేల వరకు కాంపిటేటివ్‌ పరీక్షల కోణంలో ఉండగా వాటిలోనూ రాయితీలు ఇస్తూ విద్యార్థులను తమ ఖాతాలో వేసుకు నేందుకు కళాశాలల యాజమాన్యాలు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు.

Updated Date - May 05 , 2026 | 12:57 AM