ఎదురొచ్చిన మృత్యువు
ABN , Publish Date - May 03 , 2026 | 12:36 AM
స్వగ్రామం నుంచి విదేశానికి వెళుతూ కారు ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. మరో పది గంటల్లో విమానం ఎక్కాల్సి ఉండగా ఈ ఘోర ప్రమాదానికి గురికావడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
చినపాలపర్రు వద్ద లారీ–కారు ఢీ
విదేశానికి వెళ్తున్న ఎంఎస్ విద్యార్థి దుర్మరణం
ముదినేపల్లి, మే 2 (ఆంధ్రజ్యోతి): స్వగ్రామం నుంచి విదేశానికి వెళుతూ కారు ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. మరో పది గంటల్లో విమానం ఎక్కాల్సి ఉండగా ఈ ఘోర ప్రమాదానికి గురికావడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ముదినే పల్లి మండలం వణుదుర్రుకు చెందిన నవుడు భాను జయరామ్ ప్రకాష్ (29) మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఫ్రాన్స్‌లో ఎంఎస్ చేస్తు న్నాడు. నెల క్రితం సెలవుపై ఫ్రాన్స్ నుంచి స్వగ్రామం వచ్చాడు. తిరిగి వెళ్లేందుకు పది రోజుల క్రితం విమానం టిక్కెట్ బుక్ చేసుకు న్నాడు. అయితే ఈనెల 1న తన బాబాయి కుమార్తె వివాహం ఉన్నందున బంధువుల కోరిక మేరకు ఆగిపోయాడు. వివాహ కార్యక్రమం పూర్తి కావడంతో శనివారం తెల్లవారు జామున తన స్నేహితుడు నవీన్‌తో కలసి కారులో హైద రాబాదు వెళుతుండగా చినపాలపర్రు వద్ద ఎదురుగా వస్తున్న లారీ, కారు ప్రమాదవశాత్తు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయ పడిన జయరామ్ ప్రకాష్‌ను స్థానికులు గుడివాడ ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందాడు. కారును డ్రైవ్ చేస్తున్న అతని స్నేహితుడు నవీన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు జయరామ్ ప్రకాష్ శనివారం సాయంత్రం ఫ్రాన్స్ వెళ్లేందుకు హైదరాబాదులో విమానం ఎక్కాల్సి ఉంది. మృతుడి బాబాయి నాగరాజు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వీర భద్రరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వణుదుర్రులో విషాదఛాయలు
వణుదుర్రుకు చెందిన భాను జయరామ్ ప్రకాష్ విదేశాలకు వెళుతూ మార్గమధ్యలో కారు ప్రమాదంలో దుర్మరణం కావడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామం నుంచి కారులో బయలుదేరిన అరగంట వ్యవధిలోనే మృత్యువాత పడడం గ్రామస్థులను కలచి వేసింది. తండ్రి శ్రీనివాసరావు అతని చిన్న వయస్సులో మరణించగా, చదువుకుంటూ తల్లి దేవి, చెల్లెలు పుష్పను ఆప్యాయంగా చూసుకుంటూ ఉండేవాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎంఎస్ చేసేందుకు ఫ్రాన్స్ వెళ్లాడు. అక్కడ మంచి ఉద్యోగం సంపాదించి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తన చెల్లెల్ని ఆరోగ్యాన్ని బాగు చేయించాలన్న తపన జయరాం ప్రకాష్‌లో కనిపించేదని బంధువులు చెబుతున్నారు. ఈ లోగానే అతనిని మృత్యువు కబళించింది. అతని మృతితో బంధువులు, తల్లి, చెల్లి, తీవ్ర విషాదంలో మునిగిపోయారు.