బలికోరుతున్న బాణసంచా
ABN , Publish Date - Mar 01 , 2026 | 12:38 AM
నిబంధనలకు విరుద్ధంగా, అజాగ్రత్తగా బాణసంచా తయారీ నిల్వలు చేస్తుండటంతో ప్రతి ఏటా దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
కూలీలే సమిధులు
అనుమతులు లేకున్నా అక్రమంగా తయారీ
పశ్చిమలో గోదాముల్లో పరిమితికి మించి బాణసంచా
జాగ్రత్తలు తీసుకోని పరిస్థితుల్లో బాణసంచా ప్రాణాలను
బలి కోరుతోంది. ప్రస్తుతం సీజన్‌తో సంబంధం లేకుండా మందుగుండు సామగ్రి తయారీ సాగుతోంది. కాకినాడ జిల్లా వేట్లపాలెం తయారీ కేంద్రంలో భారీ పేలుడుతో 23 మంది మృత్యువాత పడిన ఘటనతో పశ్చిమలో పాత జ్ఞాపకాలు మరోసారి తెరమీదకు వచ్చాయి.
ఏటా బాణసంచా తయారీ కేంద్రాలు, వ్యాపార దుకాణాల్లో ఏదో చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో బాణసంచా వ్యాపారం చేసేవారికంటే తయారు చేసే కూలీలే ఎక్కవగా బలవుతున్నారు. కొందరి స్వార్థంతో కొన్ని కుటుంబాల్లో చీకట్లు అలముకుంటున్నాయి.
తాడేపల్లిగూడెం రూరల్/ఏలూరు క్రైం, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): నిబంధనలకు విరుద్ధంగా, అజాగ్రత్తగా బాణసంచా తయారీ నిల్వలు చేస్తుండటంతో ప్రతి ఏటా దుర్ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీపా వళి పండగ అంటేనే బాణసంచా కాల్చడం. ఆ పండుగ కోసం బాణ సంచా తయారీ కేంద్రాలకు పశ్చిమగోదావరి జిల్లాలో రెండేళ్లుగా లైసెన్స్‌లు ఇవ్వలేదు. దీంతో అనధికార తయారీ కేంద్రాలు నిర్వహి స్తున్నారు. ఇదిలా ఉంటే బాణసంచా మందుల విక్రయ దుకాణాలు లైసెన్స్‌లు పొందిన వారికంటే బాణసంచా విక్రయించే దుకాణాలే ఎక్కువ ఉన్నాయని విమర్శలు ఉన్నాయి.
పశ్చిమలో 50 విక్రయ కేంద్రాలు
పశ్చిమ గోదావరి జిల్లాలో దీపావళి బాణసంచా దుకాణాలు అధికా రికంగా 50 దుకాణాలకు ప్రభుత్వం అనుమతులు ఉన్నాయి. అయితే అనధికారికంగా నిర్వహించే కేంద్రాలే ఎక్కువ. ఇది అధికారుల కను సన్నల్లోనే నడుస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. తాడేపల్లిగూడెంలో అధికారికంగా 5 విక్రయ కేంద్రాలు ఉండగా అనధికారికంగా నిర్వహి ంచేవాటితో కలిపి 12 దుకాణాలు ఉన్నాయి. విక్రయ కేంద్రాలకు అనుమతి ఇచ్చిన బాణసంచా నిల్వ గోదాముల్లో పరిమితికి మించి నిల్వ ఉంచుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బాణసంచా తయారీ కేంద్రాల్లో పనిచేసే కార్మికులకు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల చిన్నపాటి ప్రమాదాలు సంభవించినా ప్రాణనష్టం తప్పడంలేదు.
అనధికార తయారీ కేంద్రాలు..
జిల్లాలో ఏటా బాణసంచా తయారీకేంద్రాల్లో జరుగుతున్న ప్రమా దాల దృష్ట్యా తయారీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ నాగరాణి గతేడాది నిలుపుదల చేశారు. ఈ సంవత్సరం కూడా అదే వరవడిని కొనసా గించారు. కానీ అనధికారిక తయారీ కేంద్రాల్లో మాత్రం బాణసంచా తయారు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాలతోపాటు హైదరాబాద్ ప్రాంతాలకు మన ప్రాంతాల నుంచే కొన్ని బాణసంచా సామగ్రి రవాణా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీనిపై అధికారులు చూసిచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే జిల్లాలు విడిపోయిన తరువాత సరిహద్దు ప్రాంతాల్లోని తోటలో పశ్చిమగోదావరి జిల్లా తయారీ దారులు బాణసంచా తయారు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఏలూరు జిల్లాలో..
ఏలూరు జిల్లాలో తయారీ కేంద్రాలు లేనప్పటికీ బాణసంచా నిల్వలు, విక్రయాల కేంద్రాలు 9 ఉన్నాయి. జిల్లాలో అత్యధికంగా పల్లెర్లమూ డిలోనే పెద్ద నిల్వలు బాణసంచా డిపో ఉంది. నూజివీడులో రెండు, ఏలూరు మెయిన్ బైపాస్ రత్నాస్ హోటల్ సమీపంలో ఒకటి, చింత లపూడిలో ఒకటి, భీమడోలులో మూడు, జంగారెడ్డిగూడెంలో ఒకటి చొప్పున బాణసంచా నిల్వల డిపో, విక్రయ కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో బాణసంచా నిల్వలు నివాస ప్రాంతాల్లో లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. కొంతమంది గతంలో దీపావళి సందర్భంగా మందుగుండు సామగ్రి విక్రయాలకు తాత్కాలిక లైసెన్సు తీసుకుని విక్రయించగా, కొన్ని ప్రాంతాల్లో రహస్యంగా నిల్వలు ఉంచిన ప్రాంతాలను కూడా గుర్తించారు. ఏలూరు నగరంలో జనవాసాల మధ్య ఇలాంటి నిల్వలు అనేకం పట్టుకున్నారు. ఇప్పటికైనా అధికారులు బాణసంచా నిల్వలు, తయారీ కేంద్రాలు ఎక్కడైనా ఉన్నా వాటిని పరిశీలించి రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంది.
పశ్చిమ, ఏలూరుల్లో ఘటనలు ఇలా..
పశ్చిమగోదావరి జిల్లాలో ఉంగుటూరు మండలం వెల్లమిల్లిలో 2009లో జరిగిన పేలుడులో 8 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు.
2011లో తాడేపల్లిగూడెం బాణసంచా తయారీ కేంద్రంలో ఒక వ్యక్తి మృతి చెందారు.
2022లో కడియద్దలో బాణసంచా తయారీ కేంద్రం వద్ద ముగ్గురు కూలీలు సజీవ దహనం అయ్యారు. వారి అవయవాలు కూడా దొరకని పరిస్థితి.
2022లో తణుకు మండలం దువ్వలో చిచ్చుబుడ్ల రాపిడితో సంభవించిన ప్రమాదం వల్ల ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెదారు.
2024లో ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంపై పిడుగుపడి నలుగురు మృతి చెందారు
ఏలూరు జిల్లాలో 2024లో ఏలూరు నగరంలో దీపావళి పండుగ నాడు ఒక వ్యాపారి ఉల్లిపాయల బాణసంచాను బస్తాలో వేసుకుని స్కూటర్ మధ్యలో పెట్టుకుని వెళ్తుతుండగా ఏలూరు తూర్పు వీధి పెద్ద దేవుని గుడి సమీపంలో స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ ఎగరడంతో బస్తాలో ఒత్తిడిపడి విస్పోటనం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్ర గాయాల పాలయ్యారు.
ఏలూరు పోణంగిరోడ్డులో రెండేళ్ల క్రితం ఇంట్లో ఎలాంటి అనుమ తులు లేకుండా బాణసంచా తయారు చేస్తుండగా విస్పోటనం సంభవించి ఒకరు మృతి చెందగా, ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు.
2012లో పెదపాడు మండలం ఏపూరులో బాణసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించి ముగ్గురు మృత్యువాత పడగా నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.