ఏసీబీ వలలో సర్వేయర్
ABN , Publish Date - Mar 18 , 2026 | 12:24 AM
తాడేపల్లిగూడెం మున్సిపల్ సర్వేయర్ రౌతు రామకృష్ణ రూ.50 వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు చిక్కారు.
సర్వే నివేదిక ఇచ్చేందుకు సొమ్ము డిమాండ్
ఏసీబీని ఆశ్రయించిన బాధితులు
రూ.50 వేలు తీసుకుంటూ చిక్కిన ఉద్యోగి
తాడేపల్లిగూడెం రూరల్, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): తాడేపల్లిగూడెం మున్సిపల్ సర్వేయర్ రౌతు రామకృష్ణ రూ.50 వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. తాడేపల్లిగూడేనికి చెందిన ఒక స్థలానికి సంబంధించి సర్వే రిపోర్ట్ ఇవ్వడానికి జాప్యం చేయడంతో పాటు రిపోర్ట్ ఇవ్వడానికి రూ.50 వేలు అడగడంతో యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు తాడేపల్లిగూడెంలోని సర్వేయర్ నివాసం వద్దే వలపన్ని పట్టుకున్నారు. తాడేపల్లిగూడేనికి చెందిన కమ్ముల రాఽధ, ఆమె కుమార్తె సుమల తలు తమ స్థలం కొలిచి సర్వే రిపోర్టు ఇవ్వాలని ఈ ఏడాది జనవరిలో దరఖాస్తు చేసుకున్నారు. సర్వేయర్‌ను పలు మార్లు కలిసినా నివేదిక ఇవ్వలేదు. సర్వే రిపోర్టు ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్ చేశారు. దీంతో వారు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం సర్వేయర్ ఇంట్లో రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రామకృష్ణను అరెస్ట్ చేసి రాజమండ్రి ఏసీబీ కోర్టుకు తరలించారు.
ఎక్కడ పనిచేసినా అక్రమాలకు అండ..
తాడేపల్లిగూడెం మున్సిపల్ సర్వేయర్‌గా విధులు నిర్వహిస్తూ ఏసీబీ అధికా రులకు చిక్కిన రామకృష్ణ 1992లో ఆఫీస్ సబార్డినేట్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించి 1994లో డిప్యూటీ సర్వేయర్‌గా, 2005లో సర్వేయర్‌గా ఉద్యోగోన్నతి పొందారు. తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయాలతో పాటు పెంటపాడు, తాడేపల్లి గూడెం తహసీల్దార్ కార్యాల యాల్లో డిప్యుటేషన్‌పై విధులు నిర్వహించారు. పెంటపాడు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు మండలాల్లో ఎక్కువ కాలం పనిచేశారు. ఈ సమయంలో రైతులను ఇబ్బంది పెట్టడంతో పాటు పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కున్నారు. వైసీపీ హయాంలో పెంటపాడు సర్వేయర్‌గా చేస్తూ డిప్యూ టేషన్‌పై తాడేపల్లిగూడెంలో విధులు నిర్వహించారు. ఈ సమయంలో విమానాశ్రయ భూముల విషయంలో కొందరు కబ్జాదారులతో చేతులు కలిపి వారికి అనుకూలంగా రిపోర్టులు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.