Share News

వన్‌ అండ్‌ సేమ్‌ సర్టిఫికెట్‌ జారీకి.. రూ.10 వేలు లంచం తీసుకుంటూ..!

ABN , Publish Date - Nov 28 , 2026 | 12:48 AM

ఒక వ్యక్తి ఇంటి పేరులో వచ్చిన స్పెల్లింగ్‌ మిస్టేక్‌ను మార్చడానికి అవసరమయ్యే వన్‌ అండ్‌ సేమ్‌ సర్టిఫికెట్‌ జారీ చేయడానికి ఏలూరు అర్బన్‌ తహసీల్దార్‌ శెట్టి వెంకట రవీంద్రనాథ్‌ పది వేల రూపాయలు బాధితుడి నుంచి లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేశారు.

వన్‌ అండ్‌ సేమ్‌ సర్టిఫికెట్‌ జారీకి..  రూ.10 వేలు లంచం తీసుకుంటూ..!
లంచం సొమ్ముతో ఏలూరు అర్బన్‌ తహసీల్దార్‌ శెట్టి వెంకట రవీంద్రనాథ్‌

ఏసీబీకి చిక్కిన ఏలూరు అర్బన్‌ తహసీల్దార్‌ వెంకట రవీంద్రనాథ్‌

పరారైన కార్యాలయ ఉద్యోగులు

అనధికార వ్యక్తులదే హవా

ఏలూరు క్రైం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఒక వ్యక్తి ఇంటి పేరులో వచ్చిన స్పెల్లింగ్‌ మిస్టేక్‌ను మార్చడానికి అవసరమయ్యే వన్‌ అండ్‌ సేమ్‌ సర్టిఫికెట్‌ జారీ చేయడానికి ఏలూరు అర్బన్‌ తహసీల్దార్‌ శెట్టి వెంకట రవీంద్రనాథ్‌ పది వేల రూపాయలు బాధితుడి నుంచి లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్టు చేశారు. ఏలూరు ఏసీబీ డీఎస్పీ జీవీ కృష్ణారావు తెలిపిన వివరాలివి..

ఏలూరు తంగెళ్లమూడి ద్వారకానగర్‌కు చెం దిన జంగం గోపాలం (జనగం గోపీ)కి చెందిన ఆధార్‌ కార్డులో జంగం గోపాలం అని ఉంది. అయితే దానిని జనగం గోపీగా మార్చుకోవ డానికి అవసరమైన ధ్రువీకరణ పత్రాలు డ్రైవింగ్‌ లైసెన్సు, స్కూలు సర్టిఫికెట్‌, బ్యాంక్‌ అకౌంట్‌ పలు ఉన్నాయి. అయితే ఆయన ఆధార్‌ కార్డులో మార్పుకు వెళ్లగా రిజెక్ట్‌ అయి పోవడంతో పబ్లిక్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా మార్చుకోవాలని ఆధార్‌ అథార్టీ వారు సూచిం చారు. దీంతో అందుకు అవసరమైన సర్టిఫికె ట్లను, సాక్ష్యులను, తన కుమారుల స్కూల్‌ సర్టిఫికెట్లు, తన రక్తబంధువుల సర్టిఫికెట్లు (జనగం అని ఇంటి పేరుతో ఉన్నవి) వాటిని ఈనెల 6న ఏలూరు మండల అర్బన్‌ తహసీ ల్దార్‌ కార్యాలయానికి దరఖాస్తు చేసుకుని వన్‌ అండ్‌ సేమ్‌ సర్టిఫికెట్‌ జారీ చేయాలని కోరారు. అయితే తహసీల్దార్‌ శెట్టి వెంకట రవీంద్రనాథ్‌ రూ.25 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్‌ చేశా రు. తాను అంత ఇచ్చుకోలేనని చెప్పినా రూ. 15 వేలైనా ఇవ్వాలని చెబుతూ చివరకు రూ.పది వేలు అయినా ఇవ్వాలని స్పష్టం చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని గోపీ ఈనెల 23న ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అదే కార్యాలయంలో అనధికారికంగా విధులు నిర్వ హిస్తున్న ఒక వ్యక్తి గోపీకి ఫోన్‌ చేసి లంచం సొమ్ము తీసుకురావాలని కోరారు. తహసీల్దార్‌ కూడా నేరుగా గోపీకి ఫోన్‌ చేసి లంచం సొమ్ము తేవాలని డిమాండ్‌ చేశారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం 12.20 నిముషాలకు ఏలూరు అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ రవీంద్రనాథ్‌కు రూ.పదివేలు ఇవ్వ డంతో ఆయన తీసుకుని జేబులో పెట్టుకు న్నారు. అప్పటికే నిఘా ఉంచిన ఏసీబీ డీఎస్పీ కృష్ణారావు, ఇన్‌స్పెక్టర్లు బాలకృష్ణ, కె.శ్రీనివాస్‌ సిబ్బంది కార్యాలయంపై దాడి చేసి తహసీ ల్దార్‌ను అరెస్టు చేసి కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. రవీంద్రనాథ్‌ 2000లో జూని యర్‌ అసిస్టెంట్‌గా రెవెన్యూశాఖలో చేరారు. అంచలంచెలుగా పదోన్నతి పొంది ఏలూరు అర్బన్‌ తహసీల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

అనధికారిక ఉద్యోగి పెత్తనం

ఇదిలా ఉండగా తహసీల్దార్‌ కార్యాలయంలో అనధికారికంగా ఒక వ్యక్తి ఏ పని అయినా చేస్తాడని, కొన్ని ఏళ్ల తరబడి అతని కనుసన్న ల్లోనే వ్యవహారాలన్నీ కొనసాగుతున్నట్టు ఆరోపణలున్నాయి. ఆ వ్యక్తే ఫోన్‌ చేసి లంచం సొమ్ము తీసుకురావాలని డిమాండ్‌ చేశాడని బాధితుడైన గోపీ చెబుతున్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో ఆ వ్యక్తి ఎన్నో ఏళ్లుగా అనధి కారిక కార్యాలయ ఉద్యోగిగా చలామణి అవుతు న్నాడు. చివరకు తహసీల్దార్‌ డిజిటల్‌ కీ కూడా తన ఆధీనంలోనే పెట్టుకుని ఉంటాడని చెబుతు న్నారు. అతనే కాకుండా మరికొంత మంది అనధికార ఉద్యోగులు కార్యాలయంలో ఉంటుం డగా, మరికొంత మంది కార్యాలయం ఆవరణ లో ఉన్న బల్లలపైన, సమీపంలోని రోడ్లపై తిష్టవేసి ఉంటున్నారు. ఎవరైనా పని మీద కార్యాలయం లోపలికి వెళ్లితే అక్కడ ఉన్న ఉద్యో గులు ఫలానా వారిని కలవండి ఇది ఎలా చేయించుకోవాలో చెప్తారంటూ సలహాలు ఇస్తుంటారు. దీంతో ఎవరికి ఎంత సొమ్ము ఎలా ఇవ్వాలో సలహాలు ఇస్తూ తామే ఆ పని చేసి పెడతామని సాయం చేస్తున్నట్టు మాట్లాడుతూ బుట్టలో వేసుకుంటున్నారని చెబుతున్నారు. తహసీల్దారే నేరుగా లంచం సొమ్ము తీసు కుంటున్నారంటే మిగిలిన ఉద్యోగుల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంతే కాకుండా ఏ తప్పు లేకపోతే ఆ ఉద్యోగులు ధైర్యంగా ఆఫీసులో ఉండేవారని, వారు పారిపోయారంటే కార్యా లయ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. సాయం త్రం ఏసీబీ అధికారులు తిరిగి వెళ్లేవరకు ఏ ఉద్యోగి తిరిగి కార్యాలయానికి చేరుకోలేదు.

Updated Date - Nov 28 , 2026 | 12:48 AM