పాలిసెట్‌కు 90 శాతం హాజరు
ABN , Publish Date - Apr 26 , 2026 | 12:49 AM
పాలి టెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు శనివారం ఏలూరు, నూజి వీడు, జంగారెడ్డిగూడెంలలో మొత్తం 15 కేంద్రాల్లో నిర్వ హించిన ఏపీ పాలిసెట్–2026 ప్రశాంతంగా ముగిసింది.
ఏలూరు అర్బన్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): పాలి టెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు శనివారం ఏలూరు, నూజి వీడు, జంగారెడ్డిగూడెంలలో మొత్తం 15 కేంద్రాల్లో నిర్వ హించిన ఏపీ పాలిసెట్–2026 ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో మొత్తం 5,355 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, బాలురు 2,999 మంది, బాలికలు 1,820 మం ది హాజరయ్యారు. గైర్హాజరైన 536 మందిలో బాలురు 283, బాలికలు 253 మంది ఉన్నారు. జవాబుపత్రాలను స్థానిక పోలీసుస్టేషన్‌లో భద్రపర్చారు. వీటిని సాయుధ పోలీసు బందోబస్తు నడుమ మూల్యాంకనం నిమిత్తం మంగళగిరి తరలిస్తారు. వారంరోజుల్లో ఫలితాలు విడుద లయ్యే అవకాశం ఉంది. జిల్లాలోని పరీక్షకేంద్రాలను పాలిసెట్ జిల్లా కో–ఆర్డినేటర్, జంగారెడ్డిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ పి.సుబ్రహ్మణ్యం, జిల్లా పర్యవేక్ష కుడు పి.జగన్ మోహనరావు, జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఎంవి.రమణ,ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశారు.
జంగారెడ్డిగూడెం : జంగారెడ్డిగూడెంలోని మూడు పరీక్షా కేంద్రాల్లో 1,272 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 1,149 మంది హాజరుకాగా 123 మంది గైర్హాజరైనట్టు జం గారెడ్డిగూడెం పాలిసెట్ కోఆర్డినేటర్ ఎస్‌ఎస్‌ఆర్. ప్రసాద్ తెలిపారు. స్థానిక పరీక్షా కేంద్రాలను పరిశీలించిన వారిలో తహసీల్దార్ స్లీవజోజీ, మునిసిపల్ కమిషనర్ కెవి.రమణ, అసిస్టెంట్ కోఆర్డినేటర్ సంఘర్షిణి ఉన్నారు.
నూజివీడు టౌన్: నూజివీడులో పాలిసెట్‌కు 765 మంది విద్యార్థులు హాజరయ్యారు. పట్టణంలో మూడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా బాలికోన్నత పాఠశాల లో 297 మందికి 266 మంది, ఎస్‌ఆర్‌ఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో 298 మందికి 275 మంది, సెయింట్ ఆన్స్ పాఠశాలలో 240 మందికి 224 మంది హాజరు కాగా మొత్తం 835 మందికి 70 మంది విద్యార్థులు గైర్హాజరవ్వగా 765 మంది హాజరయ్యారు.