రేపు ఏలూరుకు డీజీపీ రాక
ABN , Publish Date - Oct 06 , 2026 | 12:06 AM
రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్‌కుమార్‌గుప్త ఈనెల 7వ తేదీన ఏలూరు నగరానికి రానున్నారు.
ఆరు జిల్లాల ఎస్పీలతో సమీక్ష
స్థానిక ఎన్నికలు, గోదావరి పుష్కరాలకు సమాయత్తం
ఏలూరు క్రైం, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్‌కుమార్‌గుప్త ఈనెల 7వ తేదీన ఏలూరు నగరానికి రానున్నారు. ఏలూరు రేంజ్ పరిధిలోని ఆరు జిల్లాల ఎస్పీలతో ఆయన సమావేశాన్ని నిర్వహించ నున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలు, ముందస్తు పర్యవేక్షణ, ఆకతాయిలు, ట్రబుల్ మంగర్స్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలో, రౌడీషీటర్లు, ఇతర సంఘ వ్యతిరేక శక్తులను ఎలా కట్టడి చేయా లో వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. మరోవైపు వచ్చే ఏడాది జరుగనున్న గోదావరి పుష్కరాలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, ట్రాఫిక్ సమస్య ఏర్పడితే అందుకు ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాటు, అవసరమైన వాహనాలను ఏర్పాటు చేయడం, గస్తీ ముమ్మరం చేయడం వంటి వాటిపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. గతంలో జరిగిన ఎన్నికల్లో ఏఏ ప్రాంతాల్లో అల్లర్లు, విధ్వంసాలు జరిగాయి వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా బైండోవర్లు చేయడం, ఆ ప్రాంతాల్లో పోలీస్ మార్చిఫాస్ట్ నిర్వహించడం వంటి కీలక అంశాలను చర్చించడమే కాకుండా వీటిని తక్షణం ఈనెల 10వ తేదీ నుంచి అమలు చేయడానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. ఏలూరు నగరానికి ఈనెల 7వ తేదీన డీజీపీ రాకతో నగరంలో పోలీస్‌శాఖ ముందస్తుగా అప్రమత్త చర్యలు చేపట్టారు. ఏలూరురేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్, డీఎస్పీ డి శ్రావణ్‌కుమార్ ఇప్పటికే డీజీపీ హెచ్‌కె గుప్తా పర్యాటన ఏర్పాట్లపై నిమగ్నమయ్యారు.