Share News

71 గోవులకు బ్రూసెల్లోసిస్‌ వ్యాధి

ABN , Publish Date - Sep 23 , 2026 | 12:37 AM

శేషాచలంపై ఉన్న శ్రీవారి గోసంరక్షణశాలలోని పలు గోవులు బ్రూసెల్లోసిస్‌ వ్యాధి సోకి విలవిల్లాడు తున్నాయి. ఈ ఏడాది గోశాలలోని పశువులకు గర్భస్రావాలు ఎక్కువగా జరుగు తుండడంతో రక్షపరీక్షలు జరిపించారు.

71 గోవులకు బ్రూసెల్లోసిస్‌ వ్యాధి
బ్రూసెల్లోసిస్‌ వ్యాధి సోకిన పశువులు

శ్రీవారి గోశాలలో విలవిల్లాడుతున్న పశువులు

తరచూ గర్భస్రావంతో వెలుగులోకి వచ్చిన వైనం

దూరంగా ఉంచి చేపట్టిన సంరక్షణ చర్యలు

ద్వారకాతిరుమల, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): శేషాచలంపై ఉన్న శ్రీవారి గోసంరక్షణశాలలోని పలు గోవులు బ్రూసెల్లోసిస్‌ వ్యాధి సోకి విలవిల్లాడు తున్నాయి. ఈ ఏడాది గోశాలలోని పశువులకు గర్భస్రావాలు ఎక్కువగా జరుగు తుండడంతో రక్షపరీక్షలు జరిపించారు. ఇటీవల వచ్చిన నివేదిక ఆధారంగా అందులో 71 గోవులకు ఈ వ్యాధి ఉన్నట్టు నిర్దారణ జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వ్యాధి సోకిన పశువులను వేరుచేసి వాటికి వైద్యసదుపాయాలు కల్పిస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యాధి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పాడి రైతుల కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. సూడి పశువుల్లో చివరి త్రైమాసికంలో అంటే గర్భం దాల్చిన 7 నుంచి 9 నెలల కాలంలో గర్భస్రావం జరగడం ఈ వ్యాధి ప్రధానలక్షణం. గర్బస్రావం తర్వాత మాయ లోపలే ఉండి కుళ్లిపోతుంది. ఉమ్మడి పశ్చిమ జిల్లా వ్యాప్తంగా ఈ వ్యాధి విస్తరించి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాడిపశువుల్లో గర్భస్రావం సమస్యలు తలెత్తితే రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రక్త నమూనాల సేకరణ..

దాదాపు మూడు నెలలుగా కొండపై ఉన్న గోసంరక్షణ శాలలో పలు గోవులకు తరచూ గర్భస్రావం జరుగుతుండటాన్ని సిబ్బంది గుర్తించి ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు దృష్టికి తెచ్చారు. దీంతో ఆయన మండల పశువైద్యాధికారి అంగర సురేష్‌తో విసృతంగా చర్చించారు. ఈమేరకు ఇద్దరు ఏడీలు, ముగ్గురు పశువైద్యులతో కూడిన కమిటీ జూలై 16న వైద్యాఽధికారుల పర్యవేక్షణలో 358 ఆవులకు ఆరోగ్యపరీక్షలు జరిపారు. రక్తనమూనాలు సేకరించి ఏలూరు ఏడీడీఎల్‌ ద్వారా విజయవాడ వీబీఆర్‌ఐ ల్యాబ్‌కు పంపించారు. ఇటీవల వచ్చిన నివేదిక ప్రకారం 71 పశువులకు ఈ వ్యాధి సోకినట్లు గుర్తించారు. వీటిలో 68 ఆవులు, మూడు గిత్తలు ఉన్నాయి. ఇందులో భాగంగా గిరిజాతి గోవులు 21, కాంక్రోజ్‌ 3, ఒంగోలు 13, దేశవాళీ 24, జెర్సీ 9. నిమారి ఒకటిఇలా ముఖ్యమైన గోజాతులు వ్యాధి బారినపడ్డాయి. వీటిని గోసంరక్షణ శాల వెనుక ఉన్న వాకింగ్‌ ట్రాక్‌ ప్రాంతానికి తరలించి ప్రత్యేకంగా సంరక్షిస్తున్నారు. ఈ క్రమంలో వ్యాధి సోకిన గోవులను వేరే చోటుకు తరలించే క్రమంలో మండలంలోని తిమ్మాపుంలో ఉన్న దేవుని తోటలో భారీ షెడ్లను నిర్మిస్తున్నారు.

తొలి దేవస్థానం ఇదే..

రాష్ట్రంలో ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసిన తొలిసారి వైద్యుల పర్యవేక్షణలో 358 గోవులకు రక్తపరీక్షలు చేయించిన దేవస్థానంగా ద్వారకాతిరుమల స్థానం సంపాదించింది. ఆ తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం చేయించనట్టు సమాచారం.

ఇది అంటువ్యాధి ..

ఇది బ్రూసిల్లా అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే అంటువ్యాధి కావడంతో పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యుల సూచన. ఇది ప్రధానంగా ఆవులు, గేదెలు, మేకలు, పందులు వంటి పశుసంపదకు తీవ్ర నష్టం కలిగించే వ్యాధి. పశువుల నుంచే కాకుండా వాటి ద్వారా మనుషులకు సైతం వేగంగా వ్యాప్తి చెందుతుంది. దీనిని జూనోటిక్‌ వ్యాధి అంటారు. వ్యాధి సోకిన పశువుల పాలను కాచకుండా తాగడం, వాటితో చేసిన జున్ను తినడంవల్ల మనుషులకు సోకుతుంది. పశువులకు ఈనడంలో సహాయం చేసినప్పుడు లేదా గర్భస్రావ ద్రవాలను చేతులతో తాకడం వల్ల బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. విపరీతమైన చలిజ్వరం, కీళ్లనొప్పులు, నీరసం, పురుషులలో వృషణాలవాపు వీటి లక్షణాలు. వెంటనే వైద్యులను సంప్రదిస్తే మంచిది. పశువుల్లో అయితే ఇది పునరుత్పత్తి వ్యవస్థపై తీవ్రప్రభావాన్ని చూపుతుంది.

గోవులను కాపాడుకుంటున్నాం

మా గోశాలలోని గోవులు రెండునెలల క్రితం తరచూ గర్భస్రావాలకు గురవుతున్నాయి. ఈ ఏడాది మొత్తం గోవులన్నిటికీ రక్షపరీక్షలు చేయించాం. పదిరోజుల క్రితం 71 పశువులకు వ్యాధి నిర్దారణ అయ్యింది. వీటిని మందలో కలవకుండా తిమ్మాపురంలోని దేవుని తోటలో షెడ్లు వేయిస్తున్నాం.. అందులో ఉంచి కాపాడుకుంటాం. ఇతర జీవులకు వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.

– వేండ్ర త్రినాథరావు, శ్రీవారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి, ద్వారకాతిరుమల.

Updated Date - Sep 23 , 2026 | 12:37 AM