Share News

ఆకాశ వీధిలో..

ABN , Publish Date - Aug 04 , 2026 | 12:40 AM

తాడేపల్లిగూడెం విమానాశ్రయం ఏర్పాటుకు మూడు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.

ఆకాశ వీధిలో..

అందుబాటులో వేల ఎకరాలు.. కొత్తగా రెండు అలైన్‌మెంట్లు

కేంద్ర పౌర విమానయాన శాఖకు ఎమ్మెల్యే బొలిశెట్టి అందజేత

ఇక కేంద్ర నిర్ణయంపైనే ఆధారం

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

తాడేపల్లిగూడెం విమానాశ్రయం ఏర్పాటుకు మూడు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. గతంలో వెంకట్రామన్నగూడెం, జగన్నపేట గ్రామాల్లో రెవెన్యూ శాఖ 1123 ఎకరాలను గుర్తించింది. వాటిని కేంద్ర పౌర విమానయాన బృందం పరిశీలించింది. సదరు భూములకు ఆనుకుని తాడిపూడి కాలువ ఉంది. రన్‌ వే ఏర్పాటు చేస్తే కాలువ అడ్డుగా ఉంటోంది. మరోవైపు అక్కడ ఉద్యాన తోటలు, పంటలు అధికంగా ఉన్నాయి. దీనిని మార్పు చేసి ప్రతిపాదనలు పంపా లంటూ కేంద్ర బృందం సూచించింది. అందుకు అనుగుణంగా రెవెన్యూ అధికారులు మూడు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వాటిని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ పౌర విమానయాన శాఖకు అందించారు. కొద్దినెలల క్రితం వెంకట్రామన్న గూడెం–జగన్నపేట రెవెన్యూ భూములను పరిశీలించిన బృందం అటు రాజమండ్రి, ఇటు గన్నవరం ఎయిర్‌పోర్టుల విషయాన్ని ప్రస్తావించింది. దీనిపై ఎమ్మెల్యే బొలిశెట్టితో పాటు, అధికారులు ప్రతిపాదిత తాడేపల్లిగూడెం విమానాశ్రయ పరిధిలో 36 లక్షల జనాభా ఉందని వివరించారు. ఆక్వాతో పాటు, ఇతర కార్గో అవసరాలను తీర్చే విధంగా ఇక్కడ విమానాశ్రయం తోడ్పాటు నందిస్తుందని జిల్లా అభివృద్ధికి ఇది అవసరమని వారికి వివరించారు.

ప్రతిపాదనల్లో కాస్త మార్పు

తొలుత ప్రతిపాదించిన వెంకట్రామన్నగూడెం, జగన్నపేట భూముల డిజైన్‌లో కాస్త మార్పులు, చేర్పులు చేశారు. తాడిపూడి కాలువకు దూరంగా రన్‌వే ఉండేలా డిజైన్‌ చేశారు. అది కూడా 1123 ఎకరాల విస్తీర్ణమే ఉంది. అందులో 35.22 ఎకరాలు ప్రభుత్వ స్థలం ఉన్నట్టు తేల్చారు. ప్రైవేటు భూములు 1081 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. మరో ఆరు ఎకరాల్లో అసైన్డ్‌ భూములున్నట్టు తేలింది. అయితే మామిడి, పామాయిల్‌ వంటి ఉద్యాన పంటల సాగు ఏకంగా 840 ఎకరాలు ఉంది. దీనిపైనే కేంద్ర బృందం కాస్త ఆలోచించింది. దాంతో కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

రెండో ప్రతిపాదనలో నాలుగు గ్రామాలు

తాడిపూడి కాలువతో ఇబ్బంది లేకుండా మరో ప్రతిపాదన సిద్ధం చేశారు. అందులో జగన్న పేట, కడియద్ద, కూనవరం, కొమ్ముగూడెం గ్రామాలున్నాయి. సుమారు 833.52 ఎకరాల్లో ప్రతిపాదనలు చేశారు. జగన్నపేట పరిధిలో 288.14 ఎకరాలు, కడియద్దలో 41 ఎకరాలు, కూనవరంలో 109 ఎకరాలు, కొమ్ముగూడెంలో 395.15 ఎకరాలను గుర్తించారు. ఆ గ్రామా ల్లోనూ 551 ఎకరాల్లో ఉద్యాన సాగు విస్తరించి ఉంది. మరో 244 ఎకరాల్లో వరిసాగు చేస్తు న్నారు. మార్కెట్‌ విలువతో సహా కేంద్రానికి ప్రతిపాదనలు అందజేశారు.

మరో రెండు గ్రామాలతో

మూడో ప్రతిపాదన

తాడేపల్లిగూడెం రూరల్‌ మండలంలోనే కుంచనపల్లి, ఆరుగొలను పరిధిలో విమా నాశ్రయం ఏర్పాటుకు మూడో ప్రతిపాదన రూపొందించారు. రెండు గ్రామాల్లోనూ 850 ఎకరాలు కేటాయిస్తే రన్‌వేతో సహా విమా నాశ్రయం ఏర్పాటవుతుందని అంచనా వేశారు. కుంచనపల్లిలో 280 ఎకరాలు, ఆరుగొలనులో 570 ఎకరాలు అందుబాటులో ఉన్నట్టు ప్రతిపాదించారు. అందులో 44 ఎకరాల్లో ప్రభుత్వ భూమి ఉంది. ఇక్కడ కేవలం 93 ఎకరాల్లోనే ఉద్యాన సాగు ఉంది. మిగిలిన భూమిలో వరి ప్రధాన పంటగా సాగు చేస్తారని వివరించారు.

ఆవశ్యకతపై నివేదిక

తాడేపల్లిగూడెంలో విమానాశ్రయ ఆవశ్యకతపైనా నివేదిక సమర్పించారు. ఇక్కడ జాతీయ రహదారులతో పాటు ప్రధాన రైలు మార్గం ఉంది. ఏపీ నిట్‌, ఉద్యాన విశ్వ విద్యాలయాలు న్నాయి. ఆక్వా సాగు విస్తరించి ఉంది. ఇవన్నీ విమానాశ్రయం ఏర్పాటుకు అనుకూలమంటూ కేంద్రానికి ప్రతి పాదించారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇక్కడ ఏర్పాటుకు సుముఖంగా ఉంది. కేంద్ర బృందం మరోసారి పర్యటించి నివేదిక సమర్పించిన తర్వాతే తాడేపల్లిగూడెం విమానాశ్రయం ఏర్పాటుపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Aug 04 , 2026 | 12:40 AM