లెక్క తేలింది..
ABN , Publish Date - Mar 19 , 2026 | 12:59 AM
వేసవిలో కాలువల ప్రక్షాళనకు నిధులు కేటాయింపు లెక్క తేలింది. ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కాలువ పనులకు నియోజకవర్గానికి రూ.3 కోట్లు
వేసవి పనులకు కేటాయింపు
ఎమ్మెల్యే సిఫారసులకే పెద్దపీట
అంచనా సిద్ధం చేస్తున్న అధికారులు
నీటి సంఘాల ఆధ్వర్యంలో పనులు
జలవనరుల శాఖలో కొత్త పంథా
వేసవిలో కాలువల ప్రక్షాళనకు నిధులు కేటాయింపు లెక్క తేలింది. ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నియోజకవర్గానికి రూ.3 కోట్లు చొప్పున నిధులు కేటాయించనున్నారు. అంచనాలు రూపొందించాలని జలవనరుల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
పంట కాల్వల ప్రక్షాళనకు గతంలో ఎమ్మెల్యేలు, నీటి సంఘాలు సూచించిన పనులను అధికారులు ప్రతిపాదించారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. తాజాగా మరోసారి పరిశీలించి ఎమ్మెల్యేల ద్వారా పనులు ఖరారు చేసేలా నిర్ణయం తీసుకుం టున్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో దాదాపు రూ.21 కోట్లతో పనులు చేపట్టే అవకాశం ఉంది. పంటకాలవలు, డ్రెయిన్‌లలో పూడిక తీత., తూడు, గుర్రపు డెక్క తొలగింపు వంటి పనులు చేపట్టనున్నారు. వారం రోజుల వ్యవధిలోనే పనులు ఒక కొలిక్కి రానున్నాయని అధికారులు భావిస్తు న్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల అభీష్టం మేరకు అంచనాలు రూపొందిస్తున్నారు.
నామినేషన్ పద్ధతిలోనే పనులు
గతంలో టెండర్ ద్వారా పనులు నిర్ధారించేవారు. దాంతో పనులు నిర్వహించడంలో జాప్యం జరిగేది. ప్రభుత్వ ఆమోదంలో కూడా ఆలస్యమయ్యేది. ఆ తర్వాత స్వల్పకాలిక టెండర్లు పిలిచేవారు. కాంట్రా క్టర్ల నుంచి స్పందన ఉండేది కాదు. బిల్లులు మంజూరు చేయరనే ఉద్దేశంతో టెండర్లు వేయ డానికి కాంట్రాక్టర్లు వెనుకంజ వేసేవారు. అరకొర పనులు చేపట్టినా సరే బిల్లుల కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారు. దానికోసం అధికారులు కోర్టులు చుట్టూ తిరగాల్సి వస్తోంది. కొద్దిరోజులైనా వేచి చూసే పరిస్థితి కాంట్రాక్టర్లలో ఉండడం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నీటి సంఘాల ద్వారా పనులు చేపట్టాలని నిర్ణయించింది. నామినేషన్ పద్ధతిలోనే పనులను కేటాయించనున్నారు. గతంలో రూ. 5 లక్షల వరకే నామినేషన్ ద్వారా పనులు మంజూరు చేసేవారు. ఈఏడాది ప్రభుత్వం దానిని రూ. 10 లక్షలకు పెంచింది. అధికారులు సైతం ఆ పరిధిలోనే పనులను ప్రతిపాదిస్తున్నారు. నామి నేషన్ విధానంలో పనులు చేయడానికి నీటి సంఘాలు సైతం ముందుకొస్తున్నాయి.
గత ఏడాది ఎమ్మెల్యేల అసంతృప్తి
గత ఏడాది కాల్వ పనులపై జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తికి గురయ్యారు. ప్రతి నియోజ కవర్గానికి సమ ప్రాధాన్యం ఇస్తారని ఆశించారు. అప్పట్లో నియోజకవర్గాని రూ.2 కోట్లు వంతున ఇస్తారని ఆశించారు. ప్రభుత్వం కూడా ఆ దిశగానే సంకేతాలు పంపింది. స్థానిక ఎమ్మెల్యేలు సైతం పనులకు ప్రాధాన్యం ఇస్తూ ప్రతిపాదనలు పంపిం చారు. తీరా కేటాయింపులకు వచ్చేసరిరి అన్యాయం జరిగిందంటూ మొత్తుకున్నారు. ఒకటి రెండు నియోజకవర్గాల్లోనే అత్యధిక పనులు జరిగాయి. దానివల్లే తమ నియోజకవర్గాలకు అన్యాయం జరి గిందంటూ ఆవేదన చెందారు. ఈసారి ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి రూ.3 కోట్లు విలువైన పనులకు ఆమోద ముద్ర వేస్తుందని అఽధికారులకు వర్తమానం అందింది. ఆ దిశగానే ప్రతిపాదనలు. అంచనాలతో రూపొందిస్తున్నారు. ఈసారి జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు సమప్రాధాన్యం ఉంటుం దన్న ధీమా అందరిలో ఉంది. ఆ మేరకు అంచనాలు రూపొందుతున్నాయి.
నీటి సంఘాల జోష్
కూటమి ప్రభుత్వంలో నీటి సంఘాలు మంచి జోష్ మీదున్నాయి. వైసీపీ హయాంలో నీటి సంఘా లను పూర్తిగా రద్దు చేశారు. ఐదేళ్లపాటు సంఘాలు లేకుండానే కాలం గడిపేశారు. మరోవైపు నిధులు కేటాయింపులు అంతంత మాత్రంగానే జరిగాయి. అవికూడా టెండర్లు పిలిచి చేపట్టేవారు. కాంట్రాక్టర్ల నుంచి స్పందన ఉండేది కాదు. కూటమి అధికారం లోకి వచ్చిన తర్వాత నీటి సంఘాలను పునరుద్ధ రించి, వాటి ఆధ్వర్యంలోనే పనులకు శ్రీకారం చుట్టింది. గడచిన వేసవిలో నీటి సంఘాల ప్రతి నిధులే పనులు నిర్వహించారు. మరోవైపు కొత్త పనులకు కూడా సిద్ధమవుతున్నారు. ఏడాది పొడవునా కాలువలు, డ్రెయిన్లలో ఎక్కడ ఇబ్బం దులు తలెత్తినా తక్షణం పనులు చేపడుతున్నారు. ఈ ఏడాదిలోనూ పనులు సకాలంలో పూర్తి చేయా లని అంతా సిద్ధమవుతున్నారు.