22ఏ భూములకు.. విముక్తి!
ABN , Publish Date - Apr 10 , 2026 | 11:36 PM
జిల్లాలో 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన భూములకు మోక్షం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో త్వరలో వీటి పరిష్కారానికి మార్గదర్శకాలు విడుదలవుతాయని అధికారులు చెబుతు న్నారు.
జిల్లాలో 125 అర్జీలు పెండింగ్.. త్వరలో కలెక్టర్ పర్యవేక్షణలో పరిష్కారం
12 వేల ఎకరాలు ఈ తరహాలోనే..
యంత్రాంగం ఇప్పటికే కసరత్తు పూర్తి
నూజివీడులో అత్యధికంగా 40 అర్జీలు
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన భూములకు మోక్షం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో త్వరలో వీటి పరిష్కారానికి మార్గదర్శకాలు విడుదలవుతాయని అధికారులు చెబుతు న్నారు. జిల్లాలో 125పైనే వచ్చిన అర్జీలకు సంబంధించి 12వేల ఎకరాల వరకు ఈ జాబితాలో చేరి ఉండవచ్చని అధికారులు అంచనాలు వేస్తున్నారు.
దేవదాయశాఖ, రెవెన్యూ, ఇతర ప్రైవేట్ ల్యాండ్స్‌ను గత వైసీపీ ప్రభుత్వం ప్రీహోల్డ్‌లో పెట్టింది. దీంతో ఈ భూములపై నిషేధాజ్జలు అమలు కావడంతో యజమానులు వాటిని అమ్ముకోవడానికి లేదా ఇతర అవసరాలకు వినియోగించడానికి అవకాశం లేకుండా పోయింది. పలుమార్లు మంత్రివర్గ ఉపసంఘంలో 22ఏ భూములపై ప్రభుత్వం కసరత్తు చేసింది. వీటిని పరిష్కరించే బాధ్యత ను కలెక్టర్, ఇతర అధికారులకు విభజన చేస్తూ సీఎం చంద్రబాబు ఇటీవల బాపట్ల సభలో ప్రకటించారు.
జిల్లా వ్యాప్తంగా 22ఏ కింద నిషేధిత భూముల్లో చేర్చిన అర్జీలు 125 వరకు అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో నూజివీడులోనే అత్యధికంగా 40 అర్జీలు ఉండగా ఏలూరు, జంగారెడ్డిగూడెం డివిజన్లలోను కొన్ని ఈరకంగా పెండింగ్‌లో ఉన్నాయి. భూములు నిషే ధిత జాబితాలో చేర్చడం వెనుక రెవెన్యూ, ఎండోమెంట్ శాఖల తప్పిదాలు ఉండి ఉండవచ్చు. ప్రభుత్వం గతంలో పలుచోట్ల ఆక్రమిత పట్టాలకు ఎంజాయ్‌మెంట్ సర్టిఫికె ట్లను జారీ చేసింది. కొంతమంది డి–ఫామ్ పట్టాలు అను భవించడానికి ఇస్తే ఆక్రమించిన ఘటనలున్నాయి. ఇవి కూడా సమీప సర్వే నంబర్లల్లో కలిసి ఉండడం వల్ల నిషేధిత జాబితాలో చేరిపోవడానికి ఆస్కారం ఉండనుంది.
ఇప్పటికీ ప్రదక్షిణలే..
22ఏ నిషేధిత జాబితాల నుంచి తమ భూములను తప్పించాలని కోరుతూ కలెక్టరేట్, రెవెన్యూ, రిజిస్ర్టేషన్ శాఖల చుట్టూ రైతులు, ప్రజలు తిరుగుతూనే ఉన్నారు. కొంతమందికి చెందిన ఇళ్లపట్టాలు, ఇళ్లు ఇందులో చేరి పోయాయి. దీంతో వాటిని అమ్ముకోలేక అగ చాట్లు పడుతు న్నారు. ప్రధానంగా అసైన్డ్ చేసిన దేవాలయ కౌలు భూముల్లోను ఈ సమస్యలు చోటుచేసుకున్నాయి. గతేడాది డిసెంబరులో ఏలూరు కలెక్టరేట్‌లో జరిగిన డీఆర్సీ సమావేశంలో 22ఏ భూములపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. అనంతరం 15 రోజుల వ్యవధిలోనే మెగా గ్రీవెన్‌సెల్‌ను యంత్రాంగం, మంత్రి నాదెండ్ల మనోహర్ నిర్వహించి పెద్ద ఎత్తున అర్జీలను స్వీకరించారు. గతంలో పెండింగ్‌లో ఉన్నవి.. ఇప్పుడు ఇచ్చినవి సరిపోల్చి నివేదిక లను తయారు చేశారు. త్వరలోనే వీటికి పరిష్కారం దొరికే అవకాశం ఉంది.