216 దారెటు..?
ABN , Publish Date - Feb 22 , 2026 | 11:57 PM
తీరం వెంబడి 216 జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా అభివృద్ధికి కేంద్రం పచ్చజెండా ఊపింది.
తీరంలో నాలుగు లేన్ల రహదారిపై ఉత్కంఠ
పట్టణం.. లేక గ్రామాల మీదుగా రహదారి ఏర్పాటు!
మూడు మార్గాల్లో అధికారుల ప్రతిపాదన?
తీరం వెంబడి 216 జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా అభివృద్ధికి కేంద్రం పచ్చజెండా ఊపింది. డీపీఆర్ సర్వేకు సిద్ధం కావడంతో తీర ప్రాంతవాసుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత జాతీయ రహదారిని నాలుగు లేన్లగా అభివృద్ధి చేస్తారా... లేక మరో మార్గం గుండా మళ్లిస్తారా...? అనే చర్చ సాగుతోంది.
నరసాపురం, ఫిబ్రవరి 22(ఆంద్రజ్యోతి): జాతీయ రహదారి పట్టణం మీదుగానే వెళుతుందనే ఊహాగానాలతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఈనేపథ్యంలో డీపీఆర్ సర్వే ప్రాధాన్యత సంతరించుకుంది.
2015లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుతో తీరం వెంబడి 216 జాతీయ రహదారి అభివృద్ధికి నోచుకుంది. బ్రిటిష్ కాలం నుంచి ప్రతిపాదనలకే పరిమితమైన కొత్త రోడ్‌పై అంచనాలకు మించి రద్దీ ఉండడంతో నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. గతంలో రోడ్డు పనులు చేపట్టే సమయంలో పట్టణం, గ్రామాల్లో చాలా మంది ఇళ్లు, భూములు కోల్పోయారు. వవారందరికీ అప్పట్లో కేంద్రం భారీగానే పరిహారం ఇచ్చింది. దీని వల్ల అప్పటి వరకు ఉన్న భూములు ధరలు ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి.
ఈ మూడు మార్గాల్లో ఏది..?
కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు వెళ్లే రహదారి జిల్లాలో చించినాడ నుంచి భీమవరం మండలం లోసరి వరకు 51కిలోమీటర్ల మేర విస్తరించింది. అప్పట్లో పట్టణం మీదుగా కాకుండా బైపాస్ మీదుగా రోడ్డును తీసుకెళ్లాలని యోచించారు. అంచనా వ్యయం పెరుగుతుందటంతో టౌన్ మీదుగానే 216 అభివృద్ధి చేశారు. శ్రీహరిపేట, మొగల్తూరు రోడ్‌లో చాలా ఇళ్లు, దుకాణాలు తొలగించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇదే మార్గం గుండా రోడ్డు అభివృద్ధి చేయడానికి కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. దిగమర్రు నుంచి పట్టణం వరకు పాలకొల్లు రోడ్డుకు ఇరువైపులా నిడదవోలు పంట కాల్వ, మరోవైపు మురికికాల్వలు ఉన్నాయి. ఈకారణంగా ఇక్కడ నాలుగు లైన్లను ఆభివృద్ధి చేసే అవకాశం తక్కువ. దీంతో పాటు పట్టణంలో చాలా దుకాణాలు, ఇళ్లు మళ్లీ తొలగించాల్సి వస్తే పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ రూట్‌లో కాకుండా దిగమర్రుకు సమీపంలో ఉన్న చిట్టవరం నుంచి నిడదవోలు పంట కాల్వ, లిఖితపూడి మీదుగా రుస్తుంబాదా వరకు బైపాస్ రోడ్‌ను వేయాలని ఎన్‌హెచ్ అధికారులు ప్రతిపాదించారు. ఈ రూట్ నిర్మాణానికి పంట కాల్వలు, రైల్వే ట్రాక్‌పై మూడు వంతెనలు నిర్మించాల్సి వచ్చింది. అంచనా వ్యయం, భూసేకరణ ఖర్చులు భారీగా ఉండడంతో అప్పట్లో ఈ ప్రతిపాదనను పక్కన బెట్టారు. తాజాగా 216ను కోనసీమ జిల్లా దిండి నుంచి సీతారాంపురం వరకు బైపాస్ 23 కిలోమీటర్ల మేర నిర్మించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. వశిష్ఠ వారధిలో చేపట్టే ఈ రహదారికి ఇప్పటికే భూసేకరణ పూర్తి చేశారు. ప్రస్తుతం ఈ మార్గానికి న్యాయపరమైన అడ్డంకులు కూడా తొలిగాయి. భూసేకరణ కూడా పూర్తవడంతో కొత్తగా చేపట్టే నాలుగు లైన్ల పట్టణం మీద వెళ్లకుండా లక్ష్మణేశ్వరం, వైఎస్‌పాలెం, సీతారాంపురం మీదుగా మళ్లిస్తారన్న ఊహాగానాలు కూడా షికారు చేస్తున్నాయి. దీనివల్ల ఎక్కడ ఆస్తి నష్టం ఉండదు. భూ సేకరణ అవసరం కూడా లేదు. ఈనేపథ్యంలో కొత్తగా వెళ్లే నాలుగు లైన్లు ఈ మూడు మార్గాల్లో ఎటువైపు కోనసీమకు వెళుతుందన్నది హాట్‌టాఫిక్‌గా మారింది. ఎన్‌హెచ్ అధికారులు మాత్రం డీపీఆర్ సర్వే ఆధారంగానే రోడ్డు పనులు జరుగుతాయని దాటవేస్తున్నారు.