Share News

81.72

ABN , Publish Date - May 01 , 2026 | 01:16 AM

ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో జిల్లాకు 81.72 శాతం ఉత్తీర్ణతతో గతేడాది మాదిరి గానే రాష్ట్రంలో 21వ స్థానం లభించింది. గతేడాది ఫలితాల (77.23 శాతం)తో పోల్చితే 4.5 శాతం అదనంగా ఉత్తీర్ణత వచ్చిందన్న ఒకింత ఊరట తప్పితే చెప్పుకోదగ్గ విషయమేదీ లేదు.

81.72

‘పది’లో ఉత్తీర్ణత శాతం

గతేడాది మాదిరిగానే రాష్ట్రంలో 21వ స్థానం

పరీక్షలు రాసిన విద్యార్థులు 22,585 మంది

ఉత్తీర్ణుల సంఖ్య 18,455.. ఫెయిలైనవారు 4,130

నేటి నుంచే రెమిడియల్‌ క్లాసుల నిర్వహణ

ఏలూరు అర్బన్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి):

ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో జిల్లాకు 81.72 శాతం ఉత్తీర్ణతతో గతేడాది మాదిరి గానే రాష్ట్రంలో 21వ స్థానం లభించింది. గతేడాది ఫలితాల (77.23 శాతం)తో పోల్చితే 4.5 శాతం అదనంగా ఉత్తీర్ణత వచ్చిందన్న ఒకింత ఊరట తప్పితే చెప్పుకోదగ్గ విషయమేదీ లేదు.

పదో తరగతి పరీక్షలకు రెగ్యులర్‌ విభాగంలో మొత్తం 22,585 మంది విద్యార్థులు హాజరుకాగా 18,455 మంది ఉత్తీర్ణుల య్యారు. 4,130 మంది ఫెయిలయ్యారు. పాసైనవారిలో బాలి కలు 10,017 మంది, బాలురు 8,438 మంది ఉన్నారు. జిల్లాల పునర్విభజన తర్వాత పదో తరగతి ఫలితాల్లో ఏలూరు జిల్లాకు లభించిన ఉత్తీర్ణత ఇదే అత్యధికం కావడం విశేషం. ఫలితాలపై విశ్లేషించిన డీఈవో వెంక టలక్ష్మమ్మ మాట్లాడుతూ.. వందరోజుల కార్యాచరణ ప్రణాళిక, చదువులో వెనుకబడిన విద్యార్థులకు అదనపు తరగతులు, సా యంత్రం వేళల్లో అదనంగా నిర్వహించిన రెమిడియల్‌ క్లాసుల వల్లే జిల్లాలో ఉత్తీర్ణత పెరిగిందన్నారు. నిజాయితీగా పరీక్షలు నిర్వహించడంవల్లే ఈ ఉత్తీర్ణత లభించిందని ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్‌ ఆర్‌.ఆశ వివరించారు. ఫెయిలైన విద్యార్థులు కొద్దిరోజుల్లో నిర్వహించనున్న అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్దమయ్యేలా శుక్రవారం నుంచే రెమిడియల్‌ క్లాసులు నిర్వ హించాలని సబ్జెక్టు టీచర్లను, హెచ్‌ఎంలను ఆదేశించామన్నారు.

62 హైస్కూళ్లలో అందరూ ఉత్తీర్ణులే..

జిల్లాలో మొత్తం 433 హైస్కూళ్లుండగా, వీటిలో 62 ఉన్నత పాఠశాలలు నూరుశాతం ఉత్తీర్ణతను సాధించాయు. అత్యధికంగా 53 ప్రైవేటు హైస్కూళ్లుండగా, జడ్పీ నుంచి 4, ఏపీ గురుకుల పాఠశాలలు 2, కేజీబీవీలు, మదర్సా, ట్రైబల్‌ వెల్ఫేర్‌ నుంచి ఒకొ క్కటి ఉన్నత పాఠశాలలున్నాయి. కాగా 9,128 మంది ఉత్తీర్ణులతో, మరో 1,990 మంది ఫెయిల్యూర్స్‌తో ఏలూరు డివిజన్‌ టెన్త్‌ రిజల్ట్స్‌లో టాప్‌స్థానంలో ఉంది. ఆ తదుపరి స్థానాల్లో 4,282 మంది ఉత్తీర్ణులతో నూజివీడు డివిజన్‌, 5,045 మంది ఉత్తీర్ణులతో జంగారెడ్డిగూడెం డివిజన్లున్నాయి.

ప్రభుత్వ పాఠశాలల్లో టాపర్లు వీరే...

ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా జిల్లాలోని పలు ప్రభు త్వ ఉన్నతపాఠశాలల బాలబాలికలు అద్భుత ప్రతిభను కనబరిచి టాపర్లుగా నిలిచారు. సరెళ్ల కీర్తన (591 మార్కులు, పెదనిండ్రకొలను), పాలరౌతు కావ్య (587, ఏలూరు), పర్వతం హైమావతి (586, గుండుగొలను), మహ్మద్‌ వసీమా (585, ఏలూరు), పంతగాని మృదుల (585, అల్లూరు), వల్లూరి సాయిప్రసన్న (584, జంగారెడ్డిగూడెం), అంబటి సాక్షి (584, కుక్కునూరు), మాకుల రాజ్యలక్ష్మి(583, ఎం.సూరవరం), భీమడోలు ప్రేమ్‌కుమార్‌ (583, భీమడోలు), చింతల రేఖ (583, గుండుగొలను), షేక్‌ ఆటిక (583, నూజివీడు), గిడు తూరి నమ్రత (582, ఎం.సూరవరం), మరీదు ప్రభు కుమార్‌ (582, ఏలూరు), చిరప ప్రశాంత్‌ (581, బాదంపూడి), అడ్డగట్ల కవిత (580, చిన్నంపేట) ప్రభుత్వ/జడ్పీ/మున్సిపల్‌ హైస్కూళ్ల నుంచి టాపర్లుగా నిలిచారు.

జడ్పీ హైస్కూళ్లలోనే..

ప్రభుత్వ రంగంలోని వివిధ యాజమాన్యాల హైస్కూళ్లు సా ధించిన ఫలితాల్లో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు చాలా పేలవంగా వున్నాయి. జడ్పీ యాజమాన్య హైస్కూళ్ల నుంచి టెన్త్‌ పరీక్షలు రాసిన 9,668 మంది బాలబాలికల్లో 6,975 మంది (72.15శాతం) ఉత్తీర్ణులు కాగా, మిగతా యాజమాన్యాల పాఠ శాలల కంటే అత్యధికంగా ఫెయిలైన విద్యార్థులు 2,693 మంది జడ్పీ మేనేజ్‌మెంట్‌ స్కూల్స్‌ నుంచే ఉన్నారు. వాస్తవానికి అన్ని సబ్జెక్టుల బోధనకు టీచర్ల నియామకాలు, 100 రోజుల కార్యాచరణ ప్రణాళికకు అనుగుణంగా సాయంత్రంపూట అదనపు తరగతులు, పరీక్షల్లో సులువుగా విజయం సాధించేందుకు సబ్జెక్టు నిపుణులతో రూపొందించిన విజయకేతనం స్టడీ మెటీరియల్‌, ప్రత్యేక తరగతుల పర్యవేక్షణకు విద్యాశాఖేతర మండలస్థాయి అధికారుల నియామకం, రోజువారీ స్లిప్‌ టెస్టులు, వారంతపు టెస్టులు వంటివి జిల్లా పరిషత్‌ హైస్కూళ్లకే పరిమితమైనా ఉత్తీర్ణతలో మాత్రం వెనుకబడడం గమనార్హం.

ఎయిడెడ్‌ పాఠశాలల నుంచి 549 మందికి 386, ఏపీ రెసిడెన్షియల్‌ సొసైటీ స్కూల్స్‌ నుంచి 585కి 499, ఏపీ గురుకుల పాఠశాలల నుంచి 251కి 242, బీసీ వెల్ఫేర్‌ నుంచి 37కి 35, కేజీబీవీల నుంచి 110కి 101, ట్రైబల్‌ వెల్ఫేర్‌ నుంచి 885కి 695, మున్సిపల్‌ పాఠశాలల నుంచి 731కి 499, స్టేట్‌ గవర్నమెంట్‌ పాఠశాలల నుంచి 581కి 343 మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేటు పాఠశాలల నుంచి 9,188 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 94.47శాతం ఉత్తీర్ణతతో 8,680 మంది పాసయ్యారు.

బావురుమనిపించిన భౌతికశాస్త్రం!

తాజా టెన్త్‌ పరీక్షల్లో ఫిజికల్‌ సైన్స్‌ ప్రశ్నపత్రం అత్యంత కఠినంగా వున్నట్టు విద్యార్థులు చెప్పిన దానికనుగుణంగానే ఫలితాలు ప్రతిబింబించాయి. జిల్లాలో ఫెయిలైన విద్యార్థుల్లో అత్యధికంగా 2,950 మంది సైన్సు సబ్జెక్టు నుంచే ఉండటం గమనార్హం. భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం పరీక్షలు ఒక్కోటి 50 మార్కులకు చొప్పున వేర్వేరుగా నిర్వహించిన విషయం విదితమే. ఈ రెండు పేపర్లలో ఏ ఒక్కదానిలోనైనా పాస్‌మార్కులు(35) సాధించినా లేదా ఒక పేపరులో నాలుగైదు మార్కులు వచ్చి రెండో పేపరులో పాస్‌మార్కు 35కి కావలసిన మిగతా మార్కులు తెచ్చుకున్నా రెండింటినీ కలిపి ఉత్తీర్ణతగానే పరిగణిస్తారు. గతంలో పీఎస్‌, బీఎస్‌ సబ్జెక్టుల్లో చెరో 18 కనీస పాస్‌మార్కులు తప్పనిసరిగా వస్తేనే ఉత్తీర్ణతకు ప్రామాణికంగా తీసుకునేవారని, ఈ విధానాన్ని ఎత్తివేసి ఓ ఒక్క సబ్జెక్టులోనైనా పాస్‌మార్కులు వస్తే ఉత్తీర్ణులయ్యేలా నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వ పరీక్షల కమిషనర్‌ ఆర్‌.ఆశ వివరించారు. ఆ ప్రకారం భౌతికశాస్త్రం పరీక్ష కఠినతరంగా వుండటం, మరోవైపు జీవశాస్త్రంలో పెద్దగా స్కోర్‌ చేయలేకపోవడం వల్లే సైన్సు సబ్జెక్టులో అత్యధికంగా విద్యార్థులు ఫెయిలవడానికి కారణమైందని ఆమె విశ్లేషించారు. ఇక సోషల్‌ స్టడీస్‌లో 1,757 మంది, తెలుగులో 1,700, గణితంలో 1,508, ఇంగ్లీషులో 531మంది విద్యార్థులు ఫెయిల్‌ కావడంతో ఆ ప్రభావం అంతిమంగా జిల్లా ఉత్తీర్ణతపై చూపడానికి కారణమైంది.

రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌కు వెసులుబాటు

రీ–కౌంటింగ్‌కు సబ్జెక్టుకు రూ.500లు, రీ–వెరిఫికేషన్‌కు సబ్జెక్టుకు రూ.1000లను అధికారిక వెబ్‌సైట్‌ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని డీఈవో వెంకటలక్ష్మమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి జూన్‌ 4వరకు జరుగుతాయని, పరీక్ష రుసుంగా 3 సబ్జెక్టుల వరకు రూ.110, 4 సబ్జెక్టులు అంతకంటే ఎక్కువ అయితే రూ.125లను అపరాధ రుసుం లేకుండా మే 9వరకు, పెనాల్టీ రూ.50లను కలిపి మే 24లోగా సంబంధిత స్కూలు హెచ్‌ఎంలకు చెల్లించాలని కోరారు.

‘ఓపెన్‌’ పరీక్షల్లో ఫలితాలు దారుణం

ఏపీ ఓపెన్‌స్కూల్స్‌ (అపోస్‌)దూరవిద్య టెన్త్‌, ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలను కూడా గురువారమే విడుదల చేశారు. జిల్లాలో ఈ పరీక్షలకు టెన్త్‌లో 759 మంది అభ్యాసకులు హాజరుకాగా కేవలం 59 మంది (7.77శాతం) పాసయ్యారు. ఇంటర్మీడియట్‌ పరీక్షలకు 701 మందికి 254 మంది (36.23శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఫెయిలైన వారికి సప్లిమెంటరీ పరీక్షలు మే 25 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు జరుగుతాయి. పరీక్ష ఫీజుగా టెన్త్‌ అభ్యాసకులు సబ్జెక్టు ఒక్కింటికి రూ.100, ఇంటర్మీడియట్‌ సబ్జెక్టు ఒక్కింటికి రూ.150 చొప్పున మే 2నుంచి 11వ తేదీలోగా ఏపీ ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలని డీఈవో వెంకటలక్ష్మమ్మ సూచించారు.

అధైర్యపడొద్దు : కలెక్టర్‌

పదో తరగతి ఫలితం ఎలావున్నా ధైర్యంగా స్వీకరించాలని, ఎటువంటి అధైర్యానికి లోనుకావద్దని కలెక్టర్‌ వెట్రిసెల్వి విద్యార్థులకు సూచించారు. ఆందోళనతో క్షణాకావేశానికి లోనుకావద్దని, ఆత్మస్థయిర్యంతో ఉండాలన్నారు. ఫలితాలు ఎలావున్నా పిల్లలకు ప్రేమను, నమ్మకాన్ని, ధైర్యాన్ని నింపి, తోడ్పాటును అందించాలని, ఒంటరిగా ఉండనివ్వవద్దని తల్లిదండ్రులకు సూచించారు.

Updated Date - May 01 , 2026 | 01:16 AM