మూకుమ్మడిగా.. అంతా ఒకేచోట!
ABN , Publish Date - Mar 14 , 2026 | 12:28 AM
రంగాపురంలోని ఓ ప్రైవేటు స్కూలులో టెన్త్ చదువుతున్న విద్యార్థులు స్థానిక జడ్పీ హైస్కూలులో పరీక్షలు రాయనున్నారు.
ఒకే పరీక్ష కేంద్రంలో ఒకే స్కూలు విద్యార్థులకు, టీచర్లకు ‘పది’ పరీక్షలు!
ఇన్విజిలేటర్ల నియామకాల్లో పలుచోట్ల గందరగోళం..
ప్రత్యామ్నాయ నియామకాలకు రెండు రోజుల సెలవు గండం
ఏలూరు అర్బన్, మార్చి 13(ఆంధ్రజ్యోతి):రంగాపురంలోని ఓ ప్రైవేటు స్కూలులో టెన్త్ చదువుతున్న విద్యార్థులు స్థానిక జడ్పీ హైస్కూలులో పరీక్షలు రాయనున్నారు. అయితే అదే ప్రైవేటు స్కూలు టీచర్లకు ఆ పరీక్ష కేంద్రంలోనే ఇన్విజిలేషన్ డ్యూటీలు చేయడానికి ఆదేశాలు వచ్చాయి. చింతలపూడిలోని ఓ హైస్కూ లు టీచర్లకు సుదూరంలోని ఏలూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎస్‌ఎస్‌సీ ఇన్విజిలేషన్ డ్యూటీలు వేశారు. తీవ్ర అనారోగ్య కారణాలతో సీఎస్, డీవో డ్యూటీల నుంచి మినహాయింపు లిచ్చిన హెచ్‌ఎంలు, స్కూల్ అసిస్టెంట్లకు తాజాగా ఇన్విజిలేటర్లుగా అపాయింట్‌మెంట్ ఆర్డర్లు జారీ చేశారు. ఈనెల 16 నుంచి ప్రా రంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో భాగం గా శుక్రవారం విద్యాశాఖ జారీచేసిన ఇన్విజిలేటర్ల నియామక పత్రాల్లో పలుచోట్ల దూరాభారం, ఒకే పరీక్ష కేంద్రంలో ఒకే స్కూలుకు చెందిన విద్యార్థులకు, టీచర్ల నియామకాలు, ఇంకా పలుచోట్ల ఒకే స్కూలు నుంచి దాదాపు 90 శాతం ఉపాధ్యా యులకు ఇన్విజిలేషన్ విధులు కేటాయించగా, మరికొన్నిచోట్ల ఒక్క టీచరుకూ పది పరీక్షల విధులు లేకపోవడం... ఇలా చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. దీంతో సంబంధిత పాఠశాలల నుంచి హెచ్‌ఎంలు/సీఎస్‌లు/డీవోలు, టీచర్లు ఇన్విజిలేషన్ ఆర్డర్లలో మార్పు చేర్పుల కోసం డీఈవో కార్యాలయానికి తరలివస్తుండటం శుక్రవారం హైలైట్‌గా నిలిచింది.
నేడు, రేపు సెలవు.. ప్రత్యామ్నాయ నియామకాలు ఎలా?
జిల్లాకు సంబంధించి పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఇన్విజిలేటర్లు సుమారు 1200 మందికి పైగా అవసరమవుతారని అంచనా. ఆ మేరకు పాఠశాల విద్యాశాఖ వద్ద వున్న టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం (టిస్) డేటా ఆధారంగా ఇటీవల సీఎస్, డీవోల నియామకాలు, తాజాగా ఇన్విజిలేటర్ల నియామకాలు జరిగాయి. ఈ నియామకాల్లో పలుచోట్ల సమస్యలు ఎదురైనట్టు తాజాగా హెచ్‌ఎంలు/సీఎస్‌లు/ డీవోల నుంచి వస్తున్న అభ్యంతరాలు రుజువుచేస్తున్నాయి. ఇటువంటి అభ్యంతరాలను పరిశీలించి, సహేతుకంగా వున్న వాటిని పరిష్కరించడానికి జిల్లావిద్యాశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి రెండో శనివారం, ఆదివారం వరుసగా సెలవులు రావడం, ఆ మరుసటిరోజే సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవుతుండడంతో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ఇన్విజిలేటర్ల నియా మకాల్లో క్షేత్రస్థాయి నుంచి వస్తున్న సమస్యలను ఎప్పటికప్పుడు సరిదిద్దేందుకు డీవైఈవోలు, ఎంఈవోలను అందుబాటులో ఉండాలని జిల్లా విద్యా శాఖ సూచించింది.