‘పది’ పరీక్షకు 97.82 శాతం విద్యార్థుల హాజరు
ABN , Publish Date - Mar 17 , 2026 | 12:11 AM
పదో తరగతి పబ్లిక్ పరీ క్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు జరిగిన తెలుగు పరీ క్షకు రెగ్యులర్, ప్రైవేటు విభాగాల్లో 23,636 మంది విద్యార్థులు దర ఖాస్తు చేసుకోగా 23,120 మంది హాజరయ్యారు.
ఏలూరు అర్బన్, మార్చి 16(ఆంధ్రజ్యోతి):పదో తరగతి పబ్లిక్ పరీ క్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు జరిగిన తెలుగు పరీ క్షకు రెగ్యులర్, ప్రైవేటు విభాగాల్లో 23,636 మంది విద్యార్థులు దర ఖాస్తు చేసుకోగా 23,120 మంది హాజరయ్యారు. 516 మంది గైర్హాజ రయ్యారు. ఏలూరు, కైకరం పరీక్ష కేంద్రాలను జిల్లా పరిశీలకుడు, ఎస్సీ ఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి తనిఖీ చేయగా, సమస్యాత్మక కేంద్రమైన శనివారపుపేట జడ్పీ హైస్కూలుతోపాటు, పెదవేగి జడ్పీ హైస్కూలులో కలెక్టర్ వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు నమోదు కాలేదని డీఈవో వెంకటలక్ష్మమ్మ తెలిపారు. కాగా విద్యాశాఖ వందరోజులపాటు నిర్వహించిన ‘విద్యాశక్తి’ ప్రత్యేక కార్యా చరణకు ఊతమిచ్చేలా జడ్పీ నిధులతో డీసీఈబీ ముద్రించిన విజయకేతనం స్టడీ మెటీరియల్ నుంచి 87 మార్కులకు సంబంధించి ప్రశ్నలు తెలుగు పరీక్ష ప్రశ్నపత్రంలో రావడం విశేషం.
ఏపీ సార్వత్రిక విద్యాపీఠం(అపోస్) దూరవిద్య పదోతరగతి పరీక్ష లు సోమవారమే ప్రారంభమయ్యాయి. తెలుగు పరీక్షకు 521 మంది అభ్యాసకులు దరఖాస్తు చేసుకోగా 451, ఉర్దూ పరీక్షకు 18 మందికి 16 మంది హాజరయ్యారు. చింతలపూడి, ఏలూరులోని పరీక్ష కేంద్రాల్లో ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ఆశ ఆకస్మిక తనిఖీలు చేశారు.
టెన్త్ నాన్–లాంగ్వేజెస్ సబ్జెక్టుల పరీక్షల నిర్వహణకు అవసరమైన ఇన్విజిలేటర్ల నియామకాలకు విద్యాశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ముందుగా జరిగే లాంగ్వేజ్ సబ్జెక్టుల పరీక్షలకు ఇన్విజిలేటర్ల నియామకాలు చేయగా, తాజాగా మిగతా నాలుగు సబ్జెక్టుల పరీక్షలకు నియామకాలు పూర్తి చేసింది.
ఇంటర్మీడియట్ థియరీ పరీక్షల్లో భాగంగా సోమవారం ద్వితీయ సంవత్సరం బ్రిడ్జికోర్సు గణితం పరీక్షకు ఐదుగురు విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా అందరూ గైర్హాజరయ్యారని ఆర్‌ఐవో యోహాన్ తెలిపారు.