నీటి సంరక్షణకు వంద రోజుల ప్రణాళిక!
ABN , Publish Date - Apr 06 , 2026 | 12:20 AM
జిల్లాలో భూగర్భజల మట్టాలు పెంపు నకు సమగ్ర కార్యాచరణ దిశగా వివిధ ప్రభుత్వ శాఖలు అడుగులు వేయను న్నాయి.
మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం
354 సాగునీటి సంఘాలదే కీలకపాత్ర
కలెక్టర్ల పర్యవేక్షణలో జిల్లా కమిటీ.. క్షేత్రస్థాయిలో మండల, గ్రామ కమిటీలు
జిల్లాలో భూగర్భజల మట్టాలు పెంపు నకు సమగ్ర కార్యాచరణ దిశగా వివిధ ప్రభుత్వ శాఖలు అడుగులు వేయను న్నాయి.ఈ మేరకు ఈనెల 6వ తేదీ నుంచి జూలై ఏడో తేదీ వరకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక తో ముందుకు సాగాలని ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్ ఉత్తర్వు లు చేశారు. ఇందులో జలవనరులు శాఖ, భూగర్భ శాఖ, డ్వామాశాఖలు సమష్టిగా చర్యలు చేపట్టనున్నాయి. దీనికి కలెక్టర్ పర్య వేక్షణ చేయాలంటూ మార్గదర్శకాలు విడుదలయ్యాయి.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటడం.. కరవు పరిస్థితులు తలెత్తకుండా ప్రత్యేక చర్యల దిశగా ప్రభుత్వ కార్యాచరణకు దిగిం ది. ఇందులో భాగంగా 100 రోజుల పాటు నీటి భద్రత– సాగునీటి సంఘాల బాధ్యత అంటూ ఒక కీలక నినాదంతో జిల్లాలోని సాగునీటి వినియోగదా రుల సంఘాలను ఈ కార్యక్రమంలో ప్రధానంగా భాగస్వామ్యం చేయనున్నారు. రానున్న రోజుల్లో ఉపాధి హామీ స్థానంలో అమలు చేయనున్న వీబీ రామ్‌జీ పథకంలో డ్వామా కింద చెక్‌డ్యామ్‌లు, ఇతర నీటివృద్ధి చర్యలకు సమగ్ర కార్యాచరణ చేయాలని నిర్ణయించారు.
అన్నమయ్య జిల్లా ప్రేరణగా..
ఈ వంద రోజుల ప్రణాళిక అన్నమయ్య జిల్లాలో అమలు చేసిన కార్యక్రమాలను ప్రాతిపదికగా తీసు కున్నారు. ప్రధానంగా రాజంపేట, నందలూరుల్లో అన్ని రకాల చెరువుల్లో పూడికలు తీశారు. గొలుసు కట్టు చెరువుల పరిధిలో ఆక్రమణలు తొలగించారు. ఆపై రెండు తుఫాన్‌లు రావడంతో భారీగా చెరువులు జలకళను సంతరించుకున్నాయి. దీనివల్ల భూగర్భజలాల మట్టాలు అపారంగా వృద్ధి చెందా యి. విరివిగా పంటలు సాగులోకి రావడంతో అక్కడ విద్యుత్ వాడకం తగ్గింది. ఇదే స్ఫూర్తిగా తీసుకున్న ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఈ ప్రణాళికకు అంకురార్పణ చేసింది.
జిల్లాలో పాతాళంలోనే గంగ..
ఏలూరు జిల్లాలో గత నవంబరు నుంచి భూర్భజలాల మట్టాలు పాతాళంలోకి అడుగంటాయి. దీంతో ప్రమాద ఘంటికలు మోగాయి. జిల్లా సగటు ఈ నెలలో 18.85కు పడిపోయింది. జిల్లాలో కొయ్యల గూడెం, కుక్కునూరు, ద్వారకాతిరుమల, బుట్టాయ గూడెం,నూజివీడు, ముసునూరు, చాట్రాయిల్లోను భూగర్భ జలాలు ఇంకాయి. ఏలూరు పరిసరాల్లోను ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
సాగునీటి సంఘాలకే కీలక బాధ్యతలు
ప్రభుత్వం అమలు చేసే కీలక ప్రణాళికలో సాగునీటి సంఘాలు కీలక భూమిక పోషించను న్నాయి. జిల్లాలో 354 సాగునీటి సంఘాల పరిధిలో 2,741 టీసీలు పనిచేస్తున్నాయి. గోదావరి డెల్టా కింద 23 భారీ నీటి సంఘాలు ఉన్నాయి. ఈనెల ఆరో తేదీ నుంచి వారంరోజుల పాటు సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో మైనర్ ఇరిగేషన్ చెరువులు, మేజర్ చెరువులతో పాటు ట్యాంక్ బండ్లు, గొలుసుకట్టు చెరువులు, ఇతర నీటి వనరులపై ఆరా తీసి.. ఏయే పనులు చేయాలో సమగ్ర ప్రణాళికను చేపడతారు. ప్రధానంగా వారు పర్యవేక్షణ చేపట్టే సాగునీటి సంఘాల కాల్వలు కాకుండా అన్ని నీటి వన రులు పర్యవేక్షణ చేస్తారు. ఇటీవల రాజధానిలో ఒక్కరోజు సాగునీటి సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ నేపథ్యం లో సాగునీటి సంఘాలే రానున్న రోజుల్లో నీటి వనరులకు జవసత్వాలు తీసుకొచ్చేలా ఈ ప్రణాళిక మరింత ఉపకరించనుంది. జిల్లాలో 1,513 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు ఈ పథకంలో చేర్చితే పూర్తిస్థాయిలో బాగుపడనున్నాయి. తద్వారా భూగర్భజలం పైకి ఉబికి వస్తుందని భావిస్తున్నారు.
కమిటీల పర్యవేక్షణ
జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా పర్యవేక్షణ చేసే జిల్లా కమిటీలో జేసీ ఇతర శాఖలను సమన్వ యం చేస్తారు. జలవనరులశాఖ, గ్రౌండ్‌వాటర్ డిపార్టుమెంట్, పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖ, ఉద్యానశాఖ, పశుసంవర్ధకశాఖ, అటవీ శాఖ, ఏపీ డిస్కమ్, ప్రాజెక్టు కమిటీ వాటర్ యూజర్స్ సంఘాలతో సమావేశం అవుతాయి. దీనికి సమాంతరంగా ఆయా శాఖలుతోనే మండల, గ్రామ కమిటీలు పనిచేస్తాయి.