పన్నుల వసూళ్లు అంతంతే!
ABN , Publish Date - Jan 22 , 2026 | 01:02 AM
జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఇంటి, ఇతర పన్నుల వసూళ్లు అంతంత మాత్రంగానే ఉంది. సిబ్బంది కృషి చేస్తున్నా పన్నులు వసూళ్లులో జాప్యం కొనసాగుతోందని చెబుతు న్నారు
ఇంటి పన్నుల వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్
(ఏలూరుసిటీ– ఆంధ్రజ్యోతి)
జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఇంటి, ఇతర పన్నుల వసూళ్లు అంతంత మాత్రంగానే ఉంది. సిబ్బంది కృషి చేస్తున్నా పన్నులు వసూళ్లులో జాప్యం కొనసాగుతోందని చెబుతు న్నారు. దీంతో పన్నుల వసూళ్లపై పంచాయతీ ఉన్నతా ధికారులు దృష్టి సారించారు. ఈనెలాఖరు నాటికి ఇంటి పన్నుల వసూళ్లలో జిల్లా రాష్ట్రంలో మెరుగైన స్థానం సాధించాలనే లక్ష్యంతో వసూళ్లను వేగవంతం చేయాలని ఆదేశిస్తూ సమీక్షిస్తున్నారు.
జిల్లాలో పన్నుల వసూళ్లు పరిశీలిస్తే మొత్తం ఇప్పటి వరకు ఇంటి పన్నులు 20.32 శాతం వసూలు కాగా ఇందు లో ఏరియర్ బకాయిలు 17.92శాతం, ప్రస్తుత పన్నులు 21.01 శాతం వరకు వసూలయ్యాయి. ఇతర పన్నుల వసూళ్లలో రాష్ట్రంలో ఏలూరు జిల్లా మెరుగైన స్థానంలోనే ఉంది. ఇంటి పన్నుల వసూళ్ల ఏలూరులో 42.05 శాతం, ముదినేపల్లి మండలంలో 35శాతం, కుక్కునూరు మండలంలో 32.13 శాతం, బుట్టాయిగూడెం మండలంలో 27.06 శాతం కైకలూరు మండలంలో 26.47 శాతం, వేలేరుపాడు మండలంలో 25.48 శాతం వసూలు కాగా జిల్లాలోని మిగిలిన మండలాల్లో 25 శాతం లోపు వసూలయ్యాయి. ఇతర పన్నుల విషయానికొస్తే ఇటీవలే ఈ పన్నుల వసూళ్లు ప్రారంభ మయ్యా యి. ప్రస్తుతం జిల్లాలో ఇతర పన్నుల వసూళ్లు 3.24 శాతం మాత్రమే జరిగినా రాష్ట్రంలో జిల్లా మెరుగైన స్థానంలో ఉందని చెబుతున్నారు.
ఇంటి పన్నుల వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్
జిల్లాలోని 547 పంచాయతీల్లో ఇంటి పన్నులు, ఇతర పన్నులు వసూళ్లను పరిశీలిస్తే ఇంటి పన్నులకు సంబంధించి డిమాండ్ రూ. 55.10 కోట్లు వరకు ఉంది.ఇందులో ఈ ఏడాదిలో వసూలు చేయాల్సిన పన్నులు రూ.42.76 కోట్లు, ఏరియర్స్ పన్నులు డిమాండ్ రూ.12.33 కోట్లు వరకు ఉంది. ఇందులో ఇప్పటివరకు ఇంటి పన్నులు రూ.11.19 కోట్లు వసూలు కాగా ఇంకా రూ.43.91 కోట్లు వసూలు చేయాల్సి ఉంది.
ఫజిల్లాలో మంచినీటి కుళాయి పన్నులతో పాటు ఇతర పన్నుల డిమాండ్ రూ. 22.59 కోట్లు వరకు ఉంది. ఇందులో ఈ ఏడాది చెల్లిం చాల్సిన పన్నులు రూ.14.36 కోట్లు, ఏరియర్స్‌గా ఉన్న పన్నుల డిమాండ్ రూ.8.23 కోట్లు ఉంది.ఇప్పటివరకు ఇతర పన్నుల రూ.73.24 లక్షలు వసూళ్లు కాగా ఇందులో ప్రస్తుతం వసూలు చేయాల్సిన పన్నులు రూ. 53.22 లక్షలు, ఏరియర్స్ పన్నులు రూ.20.03 లక్షలు ఉన్నాయి. ఇంకా రూ.21.86 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఇందులో ప్రస్తుతం వసూలు చేయాల్సిన పన్నులు రూ.1.82 కోట్లు, ఏరియర్స్ పన్నులు రూ. 8.03 కోట్లు గా ఉంది.
పన్నుల వసూళ్లు వేగవంతం
జిల్లాలో ఇప్పటికే పంచాయతీ సిబ్బంది పన్నుల వసూళ్లలో నిమగ్నమయ్యారు. జిల్లా స్థాయిలో పంచాయతీ కార్యదర్శులకు ఇంటి పన్నులు, ఇతర పన్నుల వసూళ్లపై ఆదేశాలు జారీ చేశాం. ఇంటింటికీ తిరిగి పన్నుల వసూళ్లపై పంచాయతీల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం.
– కొడాలి అనూరాధ, డీపీవో